సీఎం స్టాలిన్‌ శపథం.. అట్టడుగు వర్గాల అభ్యున్నతే ధ్యేయం

ABN , First Publish Date - 2022-04-16T13:10:50+05:30 IST

సుగాలీలు, గిరిజనులు సహా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం శాయశక్తులా పాటుపడతానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం తిరువళ్లూరు జిల్లా పరిధిలోని

సీఎం స్టాలిన్‌ శపథం.. అట్టడుగు వర్గాల అభ్యున్నతే ధ్యేయం

- సుగాలీల నివాసప్రాంతాల్లో పర్యటన 

- ఓ విద్యార్థిని ఇంట అల్పాహారం 

- అంబత్తూరు పోలీసుస్టేషన్‌ తనిఖీ


చెన్నై: సుగాలీలు, గిరిజనులు సహా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం శాయశక్తులా పాటుపడతానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం తిరువళ్లూరు జిల్లా పరిధిలోని తిరుముల్లైవాయల్‌, ఆవడి ప్రాంతాల్లో సుగాలీలు నివసించే ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఆ సందర్భంగా 197 మంది సుగాలీలకు ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా కార్డులు, ఇంటి నివేశన పట్టాలు, కొత్త రేషన్‌ కార్డులు, వ్యాపార నిమిత్తం రుణాలు పంపిణీ చేశారు. సుగాలీల నివాసప్రాంతాల్లో తాగునీరు, విద్యుద్దీపాల సదుపాయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఇటీవల సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను సుగాలీలకు చెందిన పాఠశాల విద్యార్థినులు ఆర్‌.ప్రియ, కె.దివ్య, ఎస్‌ఎస్‌ దర్శిని కలిసి తమ ప్రాంతాల్లోని సమస్యలను వివరించారు. ఓబీసీలుగా పరిగణిస్తున్న సుగాలీలను షెడ్యూల తెగలకు మార్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత ఆవడిలో నివసిస్తున్న సుగాలీలు వాట్స్‌పకాల్‌లో తమ ప్రాంతం లో పర్యటించాలని సీఎంను కోరిన విషయం తెలిసిం దే. వారి విన్నతిని మన్నించిన స్టాలిన్‌ శుక్రవారం ఉదయం ఆవడి, తిరుముల్లైవాయల్‌ ప్రాంతాల్లో పర్యటించి సహాయకాలను పంపిణీ చేశారు. ఆవడిలో ముఖ్యమంత్రి స్టాలిన్‌కు సుగాలీ బాలికలు పూసల దండలను వేసి, పుస్తకాలను కానుకగా ఇచ్చి స్వాగతం పలికారు. సుగాలీల కుటుంబాలకు చెందిన మహిళలు ఆయనతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సభలో స్టాలిన్‌ ప్రసంగిస్తూ... ఇటీవల ఢిల్లీలో తాను ప్రధాని మోదీని కలుసుకున్నప్పుడు సుగాలీలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని విజ్ఞప్తి చేశానని తెలిపారు. ముఖ్యంగా కష్టపడి చదువుతున్న బాలికలు తన వద్దకు ధైర్యంగా వచ్చి వారి సమస్యలను తెలుపుకోవడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఆ బాలికల కోరిక మేరకే తాను సుగాలీలకు ఓటరు గుర్తింపు కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు, ఇంటి పట్టాలు, నివాసప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించాననని తెలిపారు. చెన్నై సమీపంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుగాలీల తదితర సంచార జాతుల కుటుంబాలకు కనీస సదుపాయాలు కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడతానని సీఎం పేర్కొన్నారు. 


సుగాలీల ఇంట్లో అల్పాహారం..

ముఖ్యమంత్రి స్టాలిన్‌ తొలుత స్థానిక తిరుముల్లైవాయల్‌లోని సుగాలీల నివాసప్రాంతమైన జయానగర్‌ను సందర్శించారు. ఆ సందర్భంగా 39 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి ఆరోగ్యబీమా కార్డులను, 20 మందికి రేషన్‌ కార్డులు, సామాజిక భద్రతా పథకం కింద నలుగురికి ఆర్థిక సాయం, రహదారుల పక్కనే పూసలమ్ముకునే 38 మందికి ఆర్థిక సహాయం అందజేశారు. తరువాత ఆవడి పరుత్తిపట్టు గ్రామంలోని సుగాలీ బాలిక దర్శని ఇంటికి వెళ్లిన సీఎం.. అక్కడ అల్పాహారం తీసుకున్నారు.  ఆ ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో 40 మంది ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం కార్డులు, 18 మందికి కొత్త రేషన్‌కార్డులు, 22 మందికి వ్యాపారం కోసం రుణాలను కూడా పంపిణీ చేశారు. సుగాలీలకు ఏ సమస్యలు వచ్చినా జిల్లా అధికారులను గానీ, తనను సంప్రదించవచ్చని స్టాలిన్‌ సూచించారు. ఆ తర్వాత ఆవడి కార్పొరేషన్‌లో లబ్దిదారులకు ప్రభుత్వ సహాయకాలను పంపిణీ చేశారు. చివరగా నగరానికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో టి1 అంబత్తూరు పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి హాజరుపట్టీ, కేసుల వివరాలను పరిశీలించారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రి ఎస్‌ఎం నాజర్‌, శాసనసభ్యుడు ఎ. కృష్ణసామి, ఆవడి కార్పొరేషన్‌ మేయర్‌ జి.ఉదయకుమార్‌, డిప్యూటీ మేయర్‌ ఎస్‌.సూర్యకుమార్‌, నగరపాలక నిర్వహణ విభాగం సంచాలకులు పి.పొన్నయ్య, తిరువళ్లూ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఆల్ఫీ జాన్‌ వర్గీస్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-04-16T13:10:50+05:30 IST