పల్లె ముంగిటకే వైద్యం

ABN , First Publish Date - 2022-04-09T16:05:55+05:30 IST

గ్రామీణ ప్రాంత ప్రజలకు వారి ఇళ్ల వద్దే మెరుగైన వైద్యం అందేలా రాష్ట్ర వైద్య ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో రూ.70 కోట్లతో కొనుగోలు చేసిన కొత్త సంచార వైద్య శాల వాహనాలను ముఖ్యమంత్రి ఎంకే

పల్లె ముంగిటకే వైద్యం

- ప్రతి తాలూకాలో నెలకు 40 వైద్య శిబిరాలు

- రూ.70 కోట్లతో 389 వాహనాల కొనుగోలు

- జెండా ఊపి ప్రారంభించిన సీఎం స్టాలిన్‌


చెన్నై: గ్రామీణ ప్రాంత ప్రజలకు వారి ఇళ్ల వద్దే మెరుగైన వైద్యం అందేలా రాష్ట్ర వైద్య ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో రూ.70 కోట్లతో కొనుగోలు చేసిన కొత్త సంచార వైద్య శాల వాహనాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు. మెరీనాబీచ్‌ అన్నా సమాధి ప్రాంతం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ సంచార వైద్యసేవల  కోసం 133 వాహనాలకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ సంచార వైద్యశాల వాహనంలో ఉన్న సదుపాయాలను ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం పరిశీలించారు. ప్రతి వాహనంలో ఓ వైద్యనిపుణుడు, నర్సు, డ్రైవర్‌, పారిశుధ్యకార్మికుడు ఉంటారని, ఈ వాహనాల ద్వారా 385 తాలూకాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తారని మంత్రి సుబ్రమణ్యం సీఎంకు వివరించారు. ప్రతి నెలా ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి నిర్ణీత తేదీల్లో  చికిత్స అందిస్తారన్నారు. గ్రామీణ ప్రజలకు వైద్యపరీక్షలు జరిపే సదుపాయం కూడా ఈ వాహనంలో ఉందని, వైద్యపరీక్షలు చేసుకునేవారికి వారికి, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఉచితంగా మందులు కూడా ఇస్తామన్నారు. ఈ సంచార వైద్యశాల ద్వారా ప్రభుత్వం ప్రతి తాలూకాలోనూ నెలకు 40 వైద్యశిబిరాలను ఏర్పాటు చేయనుంది. ఈ సంచార వైద్యశాలలో రక్తపరీక్షలు చేయడానికి ప్రయోగశాల కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సి.పొన్ముడి, పీకే శేఖర్‌బాబు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జె. రాధాకృష్ణన్‌, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ఆర్‌.ప్రియా, డిప్యూటీ మేయర్‌ ఎం.మహే్‌షకుమార్‌ తదితరులు కూడా పాల్గొన్నారు.

Updated Date - 2022-04-09T16:05:55+05:30 IST