Chief Minister Stalin: మత్తు వదలండి ప్లీజ్‌ !

ABN , First Publish Date - 2022-08-12T13:56:23+05:30 IST

మాదక ద్రవ్యాలకు బానిసలుగా ఉన్నవారంతా ఇకనైనా ఆ మత్తునుంచి బయటపడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief

Chief Minister Stalin: మత్తు వదలండి ప్లీజ్‌ !

- సీఎం స్టాలిన్‌

- ‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో’ ప్రారంభం


చెన్నై, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలకు బానిసలుగా ఉన్నవారంతా ఇకనైనా ఆ మత్తునుంచి బయటపడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister Stalin) పిలుపునిచ్చారు. కలైవానర్‌ అరంగంలో మాదక ద్రవ్యాల నిరోధక చర్యలపై కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో రెండు రోజులు సమీక్షా సమావేశాలు జరిగాయి. గురువారం ఉదయం ఈ సమావేశాల ముగింపు సందర్భంగా మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలపై విచారణకు ప్రత్యేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(Enforcement Bureau) పేరిట దర్యాప్తు విభాగాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన ప్రనంగిస్తూ తమ ప్రభుత్వం తమిళనాడును మాదక ద్రవ్యాల నిరోధక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకుందని, ఈ దిశగానే రెండు రోజులుపాటు తాను సమీక్ష నిర్వహించినట్టు  పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలను నిరోధించేందుకు ప్రభుత్వం రెండు పద్ధతులను ఎంచుకుందని, చట్ట ప్రకారం పోలీసులు, అధికారులు చర్యలు చేపడతారన్నారు. పోలీసులు తమ పరిధిలో మాదక ద్రవ్యాలను సమూలంగా నిర్మూలించినప్పుడే ప్రజలను మత్తు నుంచి కాపాడగలుగుతామని చెప్పారు. మాదక ద్రవ్యాలను నిరోధించడంలో విఫలమయ్యే పోలీసు ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోనని హెచ్చరించారు. ఇప్పటి వరకూ మాదక ద్రవ్యాలు విక్రయించిన వారి నుంచి రూ.50 కోట్ల  ఆస్తులు జప్తు చేశామన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరులో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలక పాత్రను పోషించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యా సంస్థల వద్ద మత్తుపదార్థాలు(Drugs) విక్రయించకుండా నిర్వాహకులు కూడా తగు చర్యలు చేపట్టాలని, ఈ విషయంలో పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు శేఖర్‌బాబు, అన్బిల్‌ మహేష్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, హోంశాఖ ప్రధాన కార్యదర్శి కే ఫణీందర్‌ రెడ్డి, డీజీపీ శైలేంద్రబాబు, ఏడీజీపీ మహే్‌షకుమార్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T13:56:23+05:30 IST