మతతత్వ రాజకీయాలు మానండి

ABN , First Publish Date - 2022-07-10T14:02:00+05:30 IST

ప్రజల మధ్య చిచ్చురగిల్చే మతతత్వ రాజకీయాలను మానుకోవాలని బీజేపీ సహా ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ హితవు పలికారు. మతాన్ని

మతతత్వ రాజకీయాలు మానండి

                           - తిరువణ్ణామలై సభలో Stalin హితవు


చెన్నై, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ప్రజల మధ్య చిచ్చురగిల్చే మతతత్వ రాజకీయాలను మానుకోవాలని బీజేపీ సహా ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ హితవు పలికారు. మతాన్ని అడ్డుగా పెట్టుకుని రాజకీయాలు నడిపేవారు రాజకీయ నాయకులు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. ఆధ్యాత్మికవాదులని చెప్పుకొనే రాజకీయ నాయకులంతా ఆధ్యాత్మికవాదులు కారని, సమాజానికి పట్టిన వ్యాధుల్లాంటివారని ఆయన విమర్శించారు. తిరువణ్ణామలైలో శనివారం ఉదయం ఏర్పాటైన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆ జిల్లాలో రూ.70.27 కోట్ల వ్యయంతో పూర్తయిన పథకాలకు ప్రారంభోత్సవం, తిరువణ్ణామలైలో బస్‌స్టేషన్‌ నిర్మాణం సహా రూ.340.21 కోట్ల వ్యయంతో చేపట్టనున్న కొత్త పథకాలకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1.71 లక్షల మంది లబ్ధిదారులకు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద రూ.693.03 కోట్ల మేరకు సహాయాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగిస్తూ 217 అడుగుల ఎత్తు రాజగోపురం కలిగిన అరుణాచలేశ్వరం ఆలయం ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి దక్కుతుందన్నారు. 1963లో జరిగిన తిరువణ్ణామలై నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వచ్చేందుకు నాంది పలికిందన్నారు. గత శాసనసభ ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలోనే తాను ప్రజాయాత్రను ప్రారంభించానని, ఆ ప్రజాయాత్ర డీఎంకే ఘనవిజయం సాధించేందుకు దోహదపడిందన్నారు. డీఎంకే ప్రభుత్వ హయాంలోనే తిరువణ్ణామలై ఆలయంలో సంపూర్ణంగా జీర్ణోద్ధరణ పనులు జరిగాయని, ఇక ఈ ఆలయాన్ని కేంద్ర పురావస్తు శాఖ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరిగినప్పుడు స్థానిక ప్రజలు, భక్తుల కోరిక మేరకు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని చెప్పారు. ప్రస్తుతం మతం పేరిట రాజకీయాలు నడుపుతున్నవారికి ఈ వాస్తవాలు తెలియవని అన్నారు. నగరంలోని గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులకు కనీస సదుపాయాలు కల్పించేందుకు జిల్లా కలెక్టర్‌ నాయకత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. తిరువణ్ణామలై జిల్లాలోనే ఈ ఏడాది 13 ఆలయాలకు తమ ప్రభుత్వ ఆధ్వర్వంలో కుంభాభిషేకాలను నిర్వహించామని ఆయన చెప్పారు. ఈ వివరాలను పరిశీలిస్తే డీఎంకే ఆస్తికవాదులకు వ్యతిరేకం కాదని, మతవిశ్వాసులకు హాని తలపెట్టదని రుజువుచేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఏవీ వేలు, పొన్ముడి, కేఎస్‌ మస్తాన్‌, డిప్యూటీ స్పీకర్‌ పిచ్చాండి, ఎంపీ అన్నాదురై, శాసనసభ్యులు ఎంపీ గిరి, అంబేడ్కర్‌, శరవణన్‌, జ్యోతి, కలెక్టర్‌ మురుగేష్‌, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్‌ ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-10T14:02:00+05:30 IST