ప్రతిభకు మెరుగులు

ABN , First Publish Date - 2022-07-07T13:26:18+05:30 IST

పరిశోధక విద్యార్థుల్లో ప్రతిభా పాటవాలను పెంపొందించే దిశగా టైసల్‌ సంస్థ సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌ సమక్షంలో ఐదు విద్యా,

ప్రతిభకు మెరుగులు

- పరిశోధక విద్యార్థుల కోసం టైసల్‌ సంస్థతో 5 ఒప్పందాలు

- భవనాలు, అగ్నిమాపక కేంద్రాల ప్రారంభోత్సవం


చెన్నై, జూలై 6 (ఆంధ్రజ్యోతి): పరిశోధక విద్యార్థుల్లో ప్రతిభా పాటవాలను పెంపొందించే దిశగా టైసల్‌ సంస్థ సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌ సమక్షంలో ఐదు విద్యా, పరిశోధన సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘నాన్‌ ముదల్వన్‌’ విద్యా పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కళాశాల విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలను పెంపొందించటానికి వీలుగా ప్రత్యేక శిక్షణ ఇవ్వడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఆ కోవలోనే టైసల్‌ సంస్థ చెన్నైలోని క్రిసెంట్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఇంక్యుబేషన్‌ కౌన్సిల్‌, రాష్ట్ర వెటర్నరీ విశ్వవిద్యాలయంలోని ఇంక్యుబేషన్‌ సెంటర్‌, వేల్‌టెక్‌ రంగరాజన్‌ డాక్టర్‌ శకుంతలా ఆర్‌ అండ్‌ డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, వేల్‌టెక్‌ టెక్నాలజీ బిజినెన్‌ ఇంక్యుబేటర్‌, అసోసియేషన్‌ ఫర్‌ బయో ఇన్‌స్టిట్యూట్‌ లీడర్స్‌ పారిశ్రామికవేత్తలకు సంబంధించి సాంకేతిక వాణిజ్య ఇంక్యుబేషన్‌ కేంద్రం, శాస్త్రా టీబీఐ, వీఐటీ- టెక్నాలజీ బిజినెస్‌ ఇంకుబేటర్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలోనే ఒరగడం సిప్కాట్‌ పారిశ్రామికవాడలో 350 ఎకరాల్లో వైద్య ఉపకరణాల కర్మాగారంలో ఉత్పత్తులకు అనుమతి  పత్రాన్ని జెన్యూన్‌ బయో సిస్టమ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.ధనశేఖరన్‌కు అందజేశారు. ఆ తర్వాత సిరుశేరి సిప్కాట్‌ టెక్నాలజీ పార్కులో నిర్మించిన మూడు కాన్ఫరెన్స్‌ హాళ్లు, రెండు శిక్షణా కేంద్రాలతో కూడి ఎగుమతుల వాణ్యి కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. అంతేగాక సిరుశేరి సిప్కాట్‌, ఇరుంగాట్టుకోటలో కొత్త అగ్నిమాపక కేంద్రాల భవనాలను కూడా ప్రారంభించారు. అదేవిధంగా తిరుప్పూరు జిల్లా నెరుప్పెరిసల్‌ గ్రామంలోని సిప్కాట్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆ జిల్లాలో కర్మాగారాలలో పనిచేసే కార్మికుల కోసం రెండంతస్థులతో రూ.10.19 కోట్లతో నిర్మించిన వసతిగృహ భవనసముదాయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీ ఇరైఅన్బు, టైసల్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.పూంకుమరన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T13:26:18+05:30 IST