80 శాతం హామీలు నెరవేర్చాం: Cm

ABN , First Publish Date - 2022-06-18T13:05:37+05:30 IST

డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 80 శాతం ఎన్నికల హామీలను నెరవేర్చిందని, మిగిలిన 20 శాతం హామీలను వీలైనంత త్వరగా

80 శాతం హామీలు నెరవేర్చాం: Cm

చెన్నై, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 80 శాతం ఎన్నికల హామీలను నెరవేర్చిందని, మిగిలిన 20 శాతం హామీలను వీలైనంత త్వరగా అమలు చేసి తీరుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. స్థానిక తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయంలో శుక్రవారం ఉదయం తిరువళ్లూరు వెస్ట్‌ జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌ సభ్యులు 500 మందిని ఆయన నగదు పురస్కారాలతో సత్కరించారు. ఆ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... పార్టీకి నిస్వార్థంగా సేవలు చేస్తున్న కార్యకర్తల వల్లే తమ పార్టీ సుస్థిరంగా ఉంటోందని, దశాబ్దాల తరబడి సేవలందిస్తున్న సీనియర్‌ సభ్యుల కారణంగానే పార్టీ పురోగమిస్తోందని తెలిపారు. వారి సేవలను గుర్తించే ఏటా నగదు పురస్కారాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కోట్లాదిమంది కార్యకర్తలు, సీనియర్‌ సభ్యులే పార్టీకి అండగా ఉంటున్నారని ప్రశంసించారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జన్మదిన వేడుకలను ఏడాది పొడవునా జరుపుతామని, ఆ సందర్భంగా జిల్లాల వారీగా పార్టీ సీనియర్‌ నేతలను సత్కరిస్తామని చెప్పారు. పెరియార్‌, అన్నాదురై, కరుణానిధి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం పరిపాలనను కొనసాగిస్తోందని, ప్రజా సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రిగా పాటుపడుతున్నానని చెప్పారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన డీఎంకే మేనిఫెస్టోలోని 80 శాతం హామీలను నెరవేర్చామని, మిగిలిన 20 శాతం హామీలను కూడా త్వరగా అమలు చేస్తామని స్టాలిన్‌ చెప్పారు. గతేడాది తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పుడు కరో నా ఉగ్రరూపం దాల్చిందని, వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం భారీగా నిధులు కేటాయించాల్సి వచ్చిందన్నారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది కలిసి కట్టుగా చేసిన సేవల కారణంగా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందన్నారు. దీనికి తోడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు కూడా తీవ్రంగా పాటుపడాల్సివచ్చిందన్నారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి ప్రజలకు తాను సుపరిపాలనను అం దిస్తున్నానని స్టాలిన్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాజర్‌ ఎంపీ జగద్రక్షగన్‌, పార్టీప్రముఖులు భూపతి, వీజీ రాజేంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-18T13:05:37+05:30 IST