సమైక్యత కోసమే సమత్తువ పురాలు

ABN , First Publish Date - 2022-06-09T14:47:46+05:30 IST

అన్ని కులాల వారు ఒకే చోట నివసించేలా చేసి వారి మధ్య సమైక్యతను పెంపొదించటం కోసమే సమత్తుపురాలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే

సమైక్యత కోసమే సమత్తువ పురాలు

                         - శివగంగ సభలో సీఎం స్టాలిన్‌


చెన్నై, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): అన్ని కులాల వారు ఒకే చోట నివసించేలా చేసి వారి మధ్య సమైక్యతను పెంపొదించటం కోసమే సమత్తుపురాలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. శివగంగ జిల్లా కోట్టై వేంగైపట్టి గ్రామంలో రూ.3.17 కోట్లతో వంద గృహాలతో నిర్మించిన పెరియార్‌ స్మారక సమత్తువపురాన్ని బుధవారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఆ కాలనీ ప్రవేశద్వారం వద్ద రూ. 2.25 లక్షలతో ఏర్పాటు చేసిన పెరియార్‌ విగ్రహాన్ని కూడా సీఎం ఆవిష్కరించారు. అనంతరం అక్కడే అన్నా క్రీడామైదానంలో రూ.1.01 లక్షలతో ఏర్పాటైన వాలీబాల్‌ మైదానం, చిల్డ్రన్స్‌ పార్కు, రూ.4.38 లక్షలతో నిర్మించిన రేషన్‌ దుకాణ భవనాన్ని రూ. 8.09 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రం, గ్రంథాలయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం కారైయూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఇటీవలే యేడాదిపాలనను పూర్తి చేసుకున్న తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఐదేళ్లకు సరిపడా సంక్షేమ పథకాలను అమలు చేసిందని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కరోనా బారి నుంచి ప్రజలను కాపాడామని, లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేషన్‌షాపుల ద్వారా సహాయాలు అందించి ఆదుకున్నామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని పథకాలను కూడా అమలు చేశామని ఇదేదో ఆరంభ శూరత్వమని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా తాను పట్టించుకోనన్నారు. పెరియార్‌ ఆశయాలకు అనుగుణంగానే మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రాష్ట్రంలో సమత్తువపురాలను ఏర్పాటు చేసి సరికొత్త విప్లవాన్ని లేవదీశారని, కులమత రహిత సమాజస్థాపనే ధ్యేయంగా అన్ని కులాలవారు సోదరుల్లా ఒకే ప్రాంతంలో నివశించేలా ఏర్పాట్లు చేశారన్నారు. తన పాలనను మెచ్చుకుంటూ జాతీయ సంస్థలెన్నో తనను నెంబర్‌ వన్‌ సీఎం అంటూ ప్రశంసిస్తున్నాయని, వాటిని పక్కనబెట్టి రాష్ట్రానికి నెంబర్‌ వన్‌ స్థాయి కల్పించడం కోసమే తాను నిరంతరం కృషిచేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సభలో పాల్గొన్న కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం కోరిక మేరకు స్వాతంత్య్ర సమరయోధురాలు వేలునాచ్చియార్‌ పేరిట మహిళా పోలీసుల శిక్షణా కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడతానని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, కేకేఎ్‌సఎ్‌సఆర్‌ రామచంద్రన్‌, ఎస్‌.రఘుపతి, ఆర్‌ఎస్‌ రాజకన్నప్పన్‌, శివ వి.మెయ్యనాధన్‌, కాంగ్రెస్‌ ఎంపీ. కార్తీ చిదంబరం, ఎమ్మెల్యేలు తమిళరసి, మాంగుడి, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి పి.అముద, శివగంగ జిల్లా కలెక్టర్‌. పి.మధుసూదన్‌ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి మణివన్నన్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పొన్‌ మణిభాస్కరన్‌ తదితరులు పాల్గొన్నారు. కారైయూరులో జరిగిన బహిరంగ సభలో శివగంగ జిల్లాలో రూ.24.77 కోట్లతో పూర్తయిన పథకాలను ప్రారంభించిన సీఎం.. రూ.119.68 కోట్లతో చేపట్టనున్న 127 కొత్త పథకాలకు శంకుస్థాపన చేశారు.

Updated Date - 2022-06-09T14:47:46+05:30 IST