డెల్టా జిల్లాల్లో సాగుకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-05-13T13:17:43+05:30 IST

కావేరి డెల్టా జిల్లాల్లో పంటల సాగుకు మాత్రమే అధిక ప్రాధాన్యతనిస్తామని, పంటపొలాలకు నష్ట్రం కలిగించే పరిశ్రమల ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతిచ్చే ప్రసక్తే

డెల్టా జిల్లాల్లో సాగుకు ప్రాధాన్యం

- పంట భూములకు నష్టం కలిగించే పరిశ్రమలకు అనుమతివ్వం

- రైతులకు సీఎం హామీ


చెన్నై: కావేరి డెల్టా జిల్లాల్లో పంటల సాగుకు మాత్రమే అధిక ప్రాధాన్యతనిస్తామని, పంటపొలాలకు నష్ట్రం కలిగించే పరిశ్రమల ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతిచ్చే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. సచివాలయం సమీపంలోని నామక్కల్‌ కవింజర్‌ మాళిగై హాలులో గురువారం ఉదయం జరిగిన సురక్షిత వ్యవసాయ మండలి సాధికారత సంస్థ తొలి సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన ప్రసంగిస్తూ... తంజావూరు జిల్లా సహా కావేరి డెల్టా జిల్లాలన్నీ ప్రాచీన కాలం నుంచి వ్యవసాయ క్షేత్రంగానే పేరుపొందాయని చెప్పారు. తంజావూరు, తిరువారూరు, నాగపట్టినం, మైలాడుదురై జిల్లాలు పూర్తిగా, కడలూరు, పుదుకోట, అరియలూరు, తిరుచ్చి జిల్లాలకు చెందిన కొన్ని ప్రాంతాలు కావేరి డెల్టా పరిధిలో ఉన్నాయని తెలిపారు. ఈ డెల్టా ప్రాంతాల్లో 14 లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్నారని, రాష్ట్రంలోని మొత్తం ధాన్యం ఉత్పత్తిలో 34 శాతం ఈ జిల్లాల నుంచే వస్తుందని వివరించారు. కొబ్బరి, చెరకు, అరటి, మొక్కజొన్న, నువ్వులు వంటి వాణిజ్య పంటలను కూడా అధికంగా పండిస్తున్నందువల్లే కావేరి డెల్టా అతి పెద్ద వ్యవసాయ క్షేత్రంగా పేరుపొందిందన్నారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వం సురక్షిత వ్యవసాయ మండలి సాధికార సంస్థకు సంబంధించి చట్టాన్ని రూపొందించినా సక్రమంగా అమలు చేయలేదని, ఆ చట్టం అన్నదాతలకు మేలు చేకూర్చే విధంగా ఉండటం వల్లే తమ ప్రభుత్వం ఆ సంస్థకు జవసత్వాలు కల్పించి తొలి సమావేశాన్ని కూడా జరుపుతున్నామని స్టాలిన్‌ తెలిపారు. డీఎంకే ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉండటం వల్లే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ కూడా ప్రవేశపెడుతోందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మేట్టూరు డ్యామ్‌ నుంచి జలాలను విడుదల చేయడానికి కొన్ని నెలలకు ముందు సాగునీటి కాలువల్లో రూ.65.11 కోట్లతో పూడిక తీత చేపట్టామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఆ పంట కాల్వల మరమ్మతులకు రూ.80 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తిరువారూరు ప్రాంతంలో ఆహార ధాన్యాల కేంద్రం, రూ.14.50 కోట్లతో పంటల సాగులో సాంకేతిక పరికరాల వినియోగ పథకాన్ని కూడా చేపడుతున్నామని వెల్లడించారు. తంజావూరు, తిరువారూరు, మైలాడుదురై, నాగపట్టినం, తిరుచ్చి జిల్లాల్లో రైసు మిల్లులు, నూనె తయారీ కార్మాగారాలు, దారపు అల్లికల కర్మాగారం వంటి పరిశ్రమలను మాత్రమే నెలకొల్పనున్నామని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. ఈ సమావేశంలో మంత్రులు దురైమురుగన్‌, అనితా రాధాకృష్ణన్‌, తంగం తెన్నరసు. ఏవీ వేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, సురక్షిత వ్యవసాయ మండలి సాధికారత సంస్థ సభ్యులు, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read more