ప్రజా సంక్షేమ కార్యకర్తలకు మళ్లీ ఉద్యోగం

ABN , First Publish Date - 2022-04-09T13:31:02+05:30 IST

అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో తొలగించిన గ్రామీణ ప్రజా సంక్షేమ కార్యకర్తలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ఉదయం శాసనసభలో తీపి కబురు చెప్పారు. డీఎంకే ప్రభుత్వ

ప్రజా సంక్షేమ కార్యకర్తలకు మళ్లీ ఉద్యోగం

- గౌరవవేతనం రూ.7500లకు పెంపు

- శాసనసభలో సీఎం


చెన్నై: అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో తొలగించిన గ్రామీణ ప్రజా సంక్షేమ కార్యకర్తలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ఉదయం శాసనసభలో తీపి కబురు చెప్పారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో నియమితులైన 12,524 మంది గ్రామీణ ప్రజా సంక్షేమ కార్యకర్తలను రూ.7500ల గౌరవ వేతనంతో ‘ఉపాధిహామీ పథకం పనుల సమన్వయకర్త’ పదవిలో నియమించనున్నట్లు పాలకపక్షం సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. శాసనసభలో పలుపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. పదేళ్లకు పైగా ఉగ్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న గ్రామీణప్రజా సంక్షే మ కార్యకర్తలను మళ్ళీ పనిలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ సభలో కీలకమైన ప్రకటన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులైన నిరుద్యోగ యువకులకు ఉద్యోగావకాశం కల్పించాలనే లభ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, చిన్నమొత్తాల పొదుపు పథకానికి సహకారమందించటం, వంటి పనులు నిర్వహించేందుకు 1989లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ఒక గ్రామ పంచాయతీకి ఒక పురుషుడు, ఓ మహిళ చొప్పున మొత్తం 12,617 గ్రామ పంచాయతీలకు ప్రజా సంక్షేమ కార్యకర్తలను నియమించారని తెలిపారు. 1991లో అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే ప్రభుత్వం ఒక్క సంతకంతో వీరందరిని ఉద్యోగాల నుంచి తొలగించిందని, ఆ తర్వాత 1997లో డీఎంకే ప్రభుత్వ హయాంలో వారిని మళ్ళీ నియమించారన్నారు. 2001లో మళ్ళీ అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ఆ పోస్టులను రద్దు చేయగా, 2006లో మళ్ళీ డీఎంకే ప్రభుత్వం 12,618 మంది గ్రామీణ ప్రజా సంక్షేమ కార్యకర్తలను నియమించిందన్నారు. ఈ నేపథ్యంలో 2011లో అన్నాడీఎంకే ప్రభుత్వం మళ్ళీ ఆ పోస్టులను రద్దు చేయడంతో గత పదేళ్లుగా ప్రజా సంక్షేమ కార్యకర్తలు నిరుద్యోగులుగా అలమటిస్తున్నారని స్టాలిన్‌ చెప్పారు. అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడల్లా వీరు ఉద్యోగాలు కోల్పోవడం, డీఎంకే అధికారంలోకి రాగానే మళ్లీ ఉద్యోగాలు పొందటం ఆనవాయితీగా మారిందన్నారు. ఈ పోస్టులను రద్దు చేయడంపై గ్రామీణ ప్రజా సంక్షేమ కార్యకర్తల తరఫున హైకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలై ఆ కేసులో వీరికి అనుకూలమైన తీర్పు వచ్చినా అన్నాడీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్ళి స్టే తెచ్చుకుందని తెలిపారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నా గ్రామీణ ప్రజా సంక్షేమ కార్యకర్తల అభ్యర్ధన మేరకు వారిని ఆదుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ విషయమై న్యాయనిపుణులతో ప్రభుత్వం జరిపిన సంప్రదింపుల ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చే ఉత్తర్వులకు కట్టుబడేలా మాజీ గ్రామీణ ప్రజా సంక్షేమకార్యకర్తలందరినీ పనిలోకి తీసుకోనున్నామని ప్రకటించారు. మాజీ గ్రామీణ ప్రజా సంక్షేమ కార్యకర్తలు ఇష్టపడితే వారిని ‘ఉపాధి హామీ పథకం పనుల సమన్వయకర్తలు’గా నియమిస్తామని, వారి గౌరవ వేతనాన్ని రూ.3వేల నుండి రూ.5వేలకు పెంచుతున్నామని తెలిపారు. అదే సమయంలో వీరు గ్రామ పంచాయతీల పనులను అదనంగా నిర్వర్తించాల్సి ఉంటుందని, ఈ పనులకుగాను ప్రతినెలా రూ.2500లను భత్యంగా చెల్లిస్తామని, వీటన్నింటిని కలుపుకుంటే ప్రతినెలా రూ.7500లు గౌరవవేతనం లభిస్తుందని వివరించారు. అంతేకాకుండా గత పదేళ్లలో నిరుద్యోగులుగా ఇబ్బంది పడి గ్రామీణ ప్రజా సంక్షేమ కార్యకర్తలెవరైనా మృతి చెంది ఉంటే వారి వారసులను ఈ పనుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్టాలిన్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-09T13:31:02+05:30 IST