మహిళల భద్రతకే అధిక ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-06-17T13:08:17+05:30 IST

మహిళలకు భద్రత కల్పించే దిశగా డీఎంకే ప్రభుత్వం కృషి చేస్తోందని, దాని కోసం ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తోందని సీఎం స్టాలిన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా

మహిళల భద్రతకే అధిక ప్రాధాన్యం

- సీఎం స్టాలిన్‌ 

- రాష్ట్రంలో 20 మహిళా పోలీసు స్టేషన్లు ప్రారంభం


చెన్నై, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): మహిళలకు భద్రత కల్పించే దిశగా డీఎంకే ప్రభుత్వం కృషి చేస్తోందని, దాని కోసం ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తోందని సీఎం స్టాలిన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 20 మహిళా పోలీసుస్టేషన్లను ముఖ్యమంత్రి గురువారం ప్రారంభించారు. నగరంలోని వలసరవాక్కం, తాంబరంలోని సేలయూరు, ఆవడిలోని ఎస్‌ఆర్‌ఎంసీ, తాంబరంలోని వండలూరు, వేలూరు జిల్లా కాట్పాడి, తిరువణ్ణామలై జిల్లా తిరువణ్ణామలై సబర్బన్‌, కడలూరు జిల్లా తిట్టక్కుడి, కరూరు జిల్లా కరూరు సబర్బన్‌, పుదుకోట జిల్లా కోట్టైపట్టినం, తంజావూరు జిల్లా ఒరత్తనాడు, తిరువారూరు జిల్లా ముత్తుపేట, కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం, ఈరోడ్‌ జిల్లా పెరుందురై, కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై, మదురై జిల్లా ఊమచ్చికుళం, దిండుగల్‌ జిల్లా దిండుగల్‌ సబర్బన్‌, తేని జిల్లా పెరియకుళం, రామనాధపురం జిల్లా ముదుగళత్తూరు, తిరునల్వేలి జిల్లా చేరన్‌మాదేవి, తెన్‌కాశి జిల్లా పులియంగుడిలో ఏర్పాటైన మహిళా పోలీసులస్టేషన్లను సీఎం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో 1973లో అప్పటి డీఎంకే ప్రభుత్వ హయాంలో తొలి మహిళా పోలీసుస్టేషన్‌ ఏర్పాటైందని, అప్పటి నుంచి ఇప్పటి వరకూ డీఎంకే ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించే దిశగా మహిళా పోలీసుస్టేషన్లను విరివిగా ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కొత్తగా ఏర్పాటైన మహిళా పోలీసుస్టేషన్లు కూడా మహిళలకు సేవలందిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌, హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి కె.ఫణీంధర్‌రెడ్డి, డీజీపీ శైలేంద్రబాబు, గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌జివాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-17T13:08:17+05:30 IST