ఆర్‌ఎస్‌ఐ అర్జునరావుకు సీఎం శౌర్యపతకం

ABN , First Publish Date - 2021-04-13T06:20:18+05:30 IST

ఆర్‌ఎస్‌ఐ అర్జునరావుకు సీఎం శౌర్యపతకం

ఆర్‌ఎస్‌ఐ అర్జునరావుకు సీఎం శౌర్యపతకం

విజయవాడ, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లో రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అర్జునరావును ప్రభుత్వం ముఖ్యమంత్రి శౌర్యపతానికి ఎంపిక చేసింది. మంగళవారం జరిగే ఉగాది వేడుకల్లో సీఎం నుంచి అర్జునరావు ఈ పతకాన్ని అందుకుంటారు. బందరు కాల్వలో కొట్టుకుపోతున్న ఓ మహిళను ప్రాణాలతో కాపాడినందుకు ఆయన్ను ఎంపిక చేశారు. కృష్ణలంకకు చెందిన లక్ష్మి అనే మహిళ భర్తతో జరిగిన వివాదానికి మనస్థాపం చెంది 2019, డిసెంబరు రెండో తేదీ ఉదయం 7.30 గంటల ప్రాంతంలో బందరు కాల్వలోకి దూకేసింది. బందరు కాల్వను ఆనుకుని ఉన్న పోలీస్‌ క్వార్టర్స్‌లో ఉంటున్న అర్జునరావు ఆమెను చూశారు. వెంటనే కిందకు వచ్చి నీళ్లలోకి దూకి స్థానికుల సహాయంతో ఆమెను ఒడ్డుకు చేర్చి ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఆ సమయంలోనే సీఎం జగన్‌.. అర్జునరావును తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని అభినందించారు. తాజాగా శౌర్యపతకానికి ఎంపిక చేశారు. ఈ పతకం కింద ప్రతినెలా వేతనంలో రూ.500ను అదనంగా ఇస్తారు. దీంతోపాటు రూ.10వేల పారితోషికాన్ని అందజేస్తారు.

Updated Date - 2021-04-13T06:20:18+05:30 IST