సీఎం సారూ.. పరిష్కరించరూ!

ABN , First Publish Date - 2022-07-05T06:01:20+05:30 IST

జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎం జగన్‌ను ప్రజలు కోరుతున్నారు.

సీఎం సారూ.. పరిష్కరించరూ!

పనులు మొదలు కాని మెడికల్‌ కళాశాల

టమోట జ్యూస్‌ ఫ్యాక్టరీ కలేనా?

ప్రాజెక్ట్‌ల ఊసే లేదు 

ఆదోని రోడ్లను విస్తరించరా? 

నేడు జిల్లాకు రానున్న సీఎంకు జిల్లా ప్రజల విజ్ఞప్తి  

 

జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను  పరిష్కరించాలని సీఎం జగన్‌ను ప్రజలు కోరుతున్నారు.  మంగళవారం ఆదోనికి వస్తున్న సీఎం...తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జనం వేడుకుంటున్నారు. ఆదోని మెడికల్‌ కళాశాల నిర్మాణానికి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేసి ఏడాది దాటింది. ఇప్పటికీ పునాదులు కూడా తీయలేదు. నిధుల కొరతతో ముందుకు కదలడం లేదు. వేదవతి, ఆర్డీఎస్‌ ప్రాజెక్ట్‌లు అర్ధంతరంగా ఆగిపోయాయి.  పంట కాల్వలు లేక హంద్రీ నీవా ద్వారా 30వేల ఎకరాల కూడా సాగునీరు అందడం లేదు. టమోటా జ్యూస్‌ పరిశ్రమ పశ్చిమ రైతుల కలగానే మిగిలింది. ఆదోని రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. టిడ్కో ఇళ్లను మూడేళ్లయినా పంపిణీ చేయలేదు. ఇలా ఎన్నో సమస్యలు. మరో రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి.  దీనిని దృష్టిలో పెట్టుకొనైనా ...తమ  సమస్యలు పరిష్కరించాలని సీఎంను జిల్లా ప్రజలు కోరుతున్నారు. 


(కర్నూలు - ఆంధ్రజ్యోతి) 


పునాదులకు కూడా నోచుకోని వైద్య కళాశాల  


ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాల అంటూ సీఎం గతంలో ఆర్భాటంగా ప్రకటన చేశారు. ఇందులో భాగంగా ఆదోని వైద్య కళాశాల నిర్మాణం కోసం 58 ఎకరాలు సేకరించారు. రూ.475 కోట్లతో నిర్మించాల్సిన ఈ కళాశాలకు వర్చువల్‌ విధానంతో సీఎం జగన్‌ శంకుస్థాపన చేసి ఏడాది దాటింది. ఇప్పటికీ పునాదులకు నోచుకోలేదు. ఎకరా రూ.40 లక్షల వంతున రైతుల నుంచి భూమిని కొనుగోలు చేశారు. ఇందులో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. రైతులు భూములు ఇచ్చినా ప్రభుత్వం మాత్రం ఇంతవరకూ కళాశాల నిర్మాణానికి పూనుకోలేదు. 


సాగునీటి ప్రాజెక్ట్‌లపై చిన్నచూపు 


పశ్చిమ ప్రాంతంలో కరువును శాశ్వతంగా నివారించాలని చంద్రబాబు ప్రభుత్వం రూ.1,980 కోట్లతో వేదవతి ప్రాజెక్ట్‌, రూ.1985.42కోట్లతో ఆర్డీఎస్‌ కుడికాల్వ నిర్మాణం చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయితే ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కీలకమైన నీటి ప్రాజెక్ట్‌లు నిధుల్లేక అసంపూర్తిగా ఆగిపోయాయి. హంద్రీనీవా నుంచి జిల్లాలో 80వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. డిస్ట్రిబ్యూటరీలు, పంటకాల్వలు లేక 30వేల ఎకరాలకు కూడా నీరివ్వలేని పరిస్థితి. ఫీల్డ్‌ఛానల్స్‌ నిర్మాణం కోసం రూ.150 కోట్లు కేటాయిస్తే 80వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు. సీమ జలజీవని అయిన గుండ్రేవుల ప్రాజెక్ట్‌ ప్రతిపాదనకే పరిమితమైంది. కేసీకెనాల్‌ ఆధునికీకరణకు రూ.513 కోట్లు ఓడీఏ బ్యాంకు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా 11శాతం నిధులు ఇవ్వలేక అప్రూవల్‌ ఇవ్వలేదని తెలుస్తోంది. రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్‌ కింద ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్‌ ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌, ఎస్‌ఆర్‌ఎంసీ మెయిన్‌కెనాల్‌ సీసీ లైనింగ్‌ పనులు చేపట్టారు. నిధుల కొరతతో పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. బిల్లులు కూడా మంజూరు కావడం లేదు. 


పంపిణీకి నోచుకోని టిడ్కో ఇళ్లు 


 చంద్రబాబు ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కర్నూలులో 10వేల ఇళ్లు చేపట్టి 4వేలు పూర్తి చేసింది. ఎమ్మిగనూరులో 3250 ఇళ్లకు గాను 1500 ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఆదోనిలో 4,780 ఇళ్లకు గాను 1000, నంద్యాలలో 10వేల ఇళ్లకు గాను 2వేలు, డోన్‌లో 250 ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నా మూడేళ్లుగా కాలయాపన చేస్తున్నారు. లబ్ధిదారులు టిడ్కో ఇళ్ల కోసం ఆశతో నిరీక్షిస్తున్నారు. 


కలగా మిగిలిన టమోటా జ్యూస్‌ ఫ్యాక్టరీ  


జిల్లాలో 25వేల హెక్టార్లకు పైగా టమోటా సాగుచేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో మద్దతు ధరలేక రోడ్లపై పారబోసే పరిస్థితి ఉంది. టమోటా జ్యూస్‌ ఫ్యాక్టరీ నిర్మించాలని ఎన్నోఏళ్లుగా రైతులు కోరుతున్నారు. పాలకులు ఊరిస్తున్నారే తప్ప ఆ దిశగా ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఎన్నికల్లో ఇది హామీగా మారింది. 


పద్మవ్యూహంగా ఆదోని రోడ్లు 


పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో రెండో ముంబైగా ఆదోని ఖ్యాతి పొందింది. జనాభా 3 లక్షలు దాటింది. వందేళ్లకు పూర్వమే మున్సిపల్‌ పట్టణంగా ఆవిర్భవించింది. ఏళ్లు గడుస్తున్నాయి, జనాభా పెరుగుతోంది, జ నావాసాలు పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా రోడ్లను విస్తరించలేదు. మున్సిపల్‌ మెయిన్‌రోడ్‌, నెహ్రూరోడ్‌, ఠాణాజీ స్ర్టీట్‌, కారోన్‌పేట, అవనపేటరోడ్‌, ఆర్ట్స్‌ కాలేజీరోడ్‌ ఇలా ప్రధాన రహదారులు ఇరుకుగా... ట్రాఫిక్‌ పద్మవ్యూహంగా మారాయి. రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు పంపినా నిధుల్లేక ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా వీటిపై దృష్టి సారించండి. 


పత్తి పరిశ్రమకు ప్రోత్సాహమేదీ? 


రాయలసీమలోనే ఏకైక అతిపెద్ద కాటన్‌ మార్కెట్‌ ఆదోని. జిల్లా నుంచే కాకుండా అనంతపురం, కడప, సరిహద్దు రాష్ట్రాలు కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు, గద్వాల జిల్లా నుంచి రైతులు పత్తిని విక్రయానికి తెస్తున్నారు. మార్కెట్‌ ఆధారంగా 120కిపైగా పత్తి జిన్నింగ్‌ పరిశ్రమలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, చేయూత లేక ఒక్కొక్కటే మూతబడుతున్నాయి. దీంతో   రైతులకు సరైన గిట్టుబాటు ధర అందడంలేదు. అదే క్రమంలో హమాలీలు ఉపాధి కోల్పోతున్నారు. అంతే కాకుండా ఆదోని, కర్నూలు మార్కెట్‌ యార్డు కేంద్రంగా మిరప విక్రయాలు కొనసాగించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 


చేనేతలకు చేయూత ఏదీ?


ఎమ్మిగనూరు, ఆదోని చేనేత కార్మికులకు పెట్టిందిపేరు. జిల్లాలో 25వేలకు పైగా చేనేత కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేక చేనేత కార్మికులు వలస వెళ్తున్నారు. ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు, నందవరం కేంద్రాల్లో చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేసి ఉపాధి చూపడంతో పాటు చేనేత ఉత్పత్తి వస్ర్తాల విక్రయాలకు ప్రోత్సాహం అందించాలి. ముడిచమురుపై ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి. గత ప్రభుత్వం కొనసాగించిన సిల్క్‌ రాయితీ కొనసాగించాలి. 


సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు


 కలెక్టర్‌ కోటేశ్వరరావు


ఆదోని, జూలై 4: సీఎం పర్యటన సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆదోనిలో సీఎం పర్యటన నేపథ్యంలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ రాజశేఖర్‌, ఎమ్మెల్సీ, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌తో కలిసి కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా నెహ్రూ మెమోరియల్‌ మున్సిపల్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సమావేశమై అధికారులతో చర్చించారు. మున్సిపల్‌ హైస్కూల్‌ తరగతి గదులను, మరుగుదొడ్లు, ఇతర పనులను పరిశీలించారు. అనంతరం ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ హెలిప్యాడ్‌ నుంచి సభా ప్రాంగణం వరకు ఎస్పీ సిద్ధార్థ్‌కౌశల్‌తో కలిసి ట్రయల్‌ రన్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి, కర్నూలు కార్పొరేషన్‌ కమిషనర్‌ భార్గవ్‌ తేజ, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-05T06:01:20+05:30 IST