కరోనాపై పోరుకు తక్షణమే రూ. 9 కోట్లివ్వండి : పళనిస్వామి

ABN , First Publish Date - 2020-04-03T15:05:42+05:30 IST

రాష్ట్రంలో కరోనా నిరోధక, ముందుజాగ్రత్త చర్యలు పాటించే నిమిత్తం గతంలో

కరోనాపై పోరుకు తక్షణమే రూ. 9 కోట్లివ్వండి : పళనిస్వామి

చెన్నై : రాష్ట్రంలో కరోనా నిరోధక, ముందుజాగ్రత్త చర్యలు పాటించే నిమిత్తం గతంలో తాను రాసిన లేఖలో పేర్కొన్నట్టుగా రూ.9వేల కోట్లను తక్షణమే కేటాయించి తమిళనాడును ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విజ్ఞప్తి చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా వైరస్‌ నిరోధానికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ పరిస్థితులపై సమీక్ష జరిపారు. ఆ సందర్భంగా ఎడప్పాడి మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా బాధితులకు చికిత్సలందించేందుకు ఎన్‌-95 రకం మాస్కులు, వెంటిలేటర్లు సమకూర్చుకునేందుకు రూ.3 వేల కోట్లను తక్షణమే కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి తమ ప్రభుత్వం పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నదని, రాష్ట్ర విపత్తులనిర్వహణ సంస్థ ఇప్పటిదాకా 11 సమీక్షా సమావేశాలు నిర్వహించిందని, రాష్ట్రమంతటా 144 నిషేధాజ్ఞలను అమలు చేసిందన్నారు. ప్రజారోగ్యం, విపత్తు నివారణ చట్టాలను అమలు చేస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కోవిడ్‌-19 వైరస్‌ నిరోధక చర్యలు, ముందుజాగ్రత్త చర్యలపై నిఘా వేయడానికిగాను సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల నాయకత్వంలో 12 కమిటీలు పనిచేస్తున్నాయని, సామాజిక దూరం పాటించే తీరుపైనా, వైరస్‌ సోకకుండా ఉండేందుకు పాటించాల్సిన నియమాలపై ప్రజల్లో అవగాహన ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 


అంతరాష్ట్ర వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసి, లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసర వస్తువులు ప్రజలకు లభించేలా అన్ని చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 2.10 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించామని, వారిలో 77,330 మందిని 28 రోజులపాటు వేరుగా ఉంచి వైద్యనిపుణుల చేత నిఘా వేసి చికిత్సలందించినట్టు తెలిపారు. ఇక జిల్లాలవారీగా కరోనా నిరోధక చర్యలను ప్రత్యేకించి వృద్ధులు, టీబీ రోగులు, హెచ్‌ఐవీ రోగులు, రక్తపీడనం కలిగినవారు, చిన్నారులను కాపాడే దిశగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని, అన్ని జిల్లాల్లోనూ సంచార వైద్య బృందాలు కూడా పనిచేస్తునాయని, స్థానిక సంస్థల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టి అన్నిచోట్లా క్రిమి సంహారక మందులను చల్లుతున్నామని ఎడప్పాడి వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 22వేలకు పైగా ఐసోలేషన్‌ పడకలు, 5934 ఐసీయూ పడకలు సిద్ధం చేశామని, బుధవారం వరకూ రాష్ట్రంలో కోవిడ్‌-19 పాజిటివ్‌ లక్షణాలున్న 234 మందిని గుర్తించి చికిత్స లందిస్తున్నామని చెప్పారు. చెన్నైలోని ఓమండూరార్‌ వైద్య కళాశాల ఆస్పత్రిని, కోయంబత్తూరు ఈఎస్‌ఐ ఆస్పత్రిని కోవిడ్‌-19 చికిత్సలందించే ఆస్పత్రులుగా ప్రకటించామని, ఐసోలేషన్‌ వార్డులో చికిత్సలందిస్తున్నవారికి వ్యాధినిరోధక శక్తిని పెంచేలా పుష్టికరమైన ఆహరపదార్థాలను అందజేస్తున్నామని, కరోనా పరీక్షలకును 11 ప్రభుత్వ ప్రయోగశాలలు, ఆరు ప్రైవేటు ప్రయోగశాలలు రోజంతా పనిచేస్తున్నాయని చెప్పారు. 


కొత్తగా 530 డాక్టర్లు, 1000 మంది నర్సులను 1508 మంది లాబ్‌ టెక్నీషియన్లను నియమించినట్టు తెలిపారు. గృహనిర్బంధంలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకుగాను రూ.3280 కోట్ల మేరకు నిధులు కేటాయించి రేషన్‌షాపులలో రూ.1000ల నగదు, ఉచితంగా ఏప్రిల్‌ నెల కోటా సరకులను అందజేస్తున్నామని చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సిద్ధం చేసిన గ్రాంట్లలో 50 శాతాన్ని తక్షణమే విడుదల చేయాలని ఆయన కోరారు. గత డిసెంబర్‌ నుండి జనవరి దాకా రాష్ట్రానికి చెల్లించాలని జీఎస్టీ బకాయిలను కూడా త్వరగా విడుదల చేయాలని ప్రధానికి సీఎం ఎడప్పాడి విజ్ఞప్తి చేశారు.


కరోనా వైద్యపరికరాల తయారీకి రాయితీలు

కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్‌ నిరోధక చికిత్సలకు అవసరమైన వైద్యపరికరాలను తయారుచేసే పరిశ్రమలకు భారీగా రాయితీలు కల్పించనున్నట్టు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఓ ప్రకటన జారీ చేశారు. కృత్రిమ శ్వాసపరికరాలు (ఇన్‌వేసివ్‌ వెంటిలేటర్స్‌), ఎన్‌-95 మాస్కులు, కరోనా వ్యాధినిరోధక మందులు, మలేరియా నిరోధక మందులు (హైడ్రాసిక్‌ క్లోరోక్విన్‌, ఎసిత్రోమైసిన్‌, ద్రవరూప విటమిన్‌-సి), వ్యక్తిగత రక్షణ దుస్తులు, మల్టీపారామీటర్‌ ఐసీయూ మానిటర్లు వంటి పరికరాలను తయారు చేస్తున్న సంస్థలకు, కొత్తగా పరికరాలను తయారు చేయడానికి జూలై 31లోగా ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వం రాయితీలు అందజేస్తుందన్నారు. 


ఈ రాయితీలు, సబ్సిడీలు చిన్నతరహ, మధ్యతరహా, భారీ పారిశ్రామిక సంస్థలకు వర్తిస్తాయన్నారు. అన్ని అర్హతలు కలిగిన సంస్థలకు పెట్టుబడి మొత్తంలో 30 శాతం సబ్సిడీగా అందజేస్తామన్నారు. గరిష్ట పరిమితిగా 20 కోట్ల దాకా సబ్సిడీలు ఇచ్చే అవకాశముందని, ఈ సబ్సిడీ మొత్తాలను ఐదేళ్లలోపున వాయిదాల పద్ధతిలో అందజేస్తామన్నారు. ఈ పరికరాలు, మందుల తయారీకీ సిద్ధమయ్యే సంస్థలకు సిప్‌కాట్‌, సిడ్కో పారిశ్రామిక వాడలలోని స్థలాలను స్వల్పకాలిక, దీర్ఘకాలిక లీజుపద్ధతిన కేటాయిస్తామన్నారు. నాలుగు నెలలలోపు ఈ పరికరాలను ఉత్పత్తి చేసే సంస్థలకు ప్రభుత్వం 50 శాతం కొనుగోలు గ్యారెంటీని ఇస్తుందని సీఎం పేర్కొన్నారు.

Updated Date - 2020-04-03T15:05:42+05:30 IST