అమ్మకానికి ‘అమరావతి’!

ABN , First Publish Date - 2020-08-14T08:41:50+05:30 IST

.రాజధాని అమరావతిలో నిర్మితమైన రెసిడెన్షియల్‌ టవర్లపై సర్కారులో సాగుతున్న చర్చ ఇది! విశ్వసనీయ వర్గాల సమాచారం

అమ్మకానికి ‘అమరావతి’!

భూమితో సహా రెసిడెన్షియల్‌ టవర్ల విక్రయం?

ఏఎంఆర్డీఏపై తొలి సమీక్షలో ఇదే ప్రధానాంశం!

ఎన్‌బీసీ ద్వారా విలువపై అంచనా

ప్రాజెక్టుల పూర్తికి కార్యాచరణ

హ్యాపీనెస్ట్‌ కూడా నిర్మించండి

నిధుల సమీకరణ మార్గం చూడండి

అధికారులకు సీఎం ఆదేశం


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

పూర్తి చేయడమా... ఒక్కొక్కటిగా అమ్మడమా... లేక  హోల్‌సేల్‌గా విక్రయించడమా?

...రాజధాని అమరావతిలో నిర్మితమైన రెసిడెన్షియల్‌ టవర్లపై సర్కారులో సాగుతున్న చర్చ ఇది! విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... అమరావతిలోని రెసిడెన్షియల్‌ టవర్లను విక్రయించే దిశగా సర్కారు కదులుతున్నట్లు తెలిసింది. ఏపీసీఆర్డీయే రద్దయి, దాని స్థానంలో ఆవిర్భవించిన ‘అమరావతి మెట్రో రీజియన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (ఏఎంఆర్డీయే)’ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి జగన్‌ గురువారం తొలిసారిగా సమీక్ష నిర్వహించారు. ఇందులో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఏఎంఆర్డీయే కమిషనర్‌ పి.లక్ష్మీ నరసింహం తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానంతరం విడుదలైన అధికారిక ప్రకటనలో ‘అమరావతిలో అసంపూర్తిగా ఉన్న పలు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికా రూపకల్పన,  అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ, హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టు పూర్తికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు’’ అని తెలిపారు. అయితే, ఆయా అంశాలపై చర్చ జరిగినప్పటికీ... మంత్రులు, శాసనసభ్యులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, ఉద్యోగుల కోసం నిర్మించిన/నిర్మాణంలో ఉన్న భారీ రెసిడెన్షియల్‌ టవర్లను ఎలా విక్రయించి, సొమ్ము చేసుకోవాలన్న దానిపైనే ప్రధాన చర్చ జరిగినట్లు తెలిసింది.


అధికారంలోకి వచ్చీ రాగానే వివిధ కారణాలతో అమరావతిలోని ప్రాజెక్టులన్నింటినీ వైసీపీ ప్రభుత్వం ఆపివేయించింది. 60 భారీ రెసిడెన్షియల్‌ టవర్లు కూడా వివిధ దశల్లో ఆగిపోయాయి. వీటిల్లో కొన్నయితే 70 శాతంమేర పూర్తయినవి కూడా ఉన్నాయి. ఆతర్వాత... ఎలాగోలా ఈ టవర్లను పూర్తి చేసి విక్రయిస్తే ఆదాయం వస్తుందనే ఆలోచన సర్కారులో మొదలైంది. దీంతో వాటిని ఇతరులకు విక్రయించడానికి గల అవకాశాలను బేరీజు వేసి, నివేదికను సమర్పించాల్సిందిగా అప్పటి ఏపీసీఆర్డీయేను ఆదేశించింది. అపార్ట్‌మెంట్లను విక్రయిస్తే కొన్ని వందల కోట్ల లాభం వస్తుందని సీఆర్డీయే నివేదించింది. ఈ వివరాలతో ‘ఆంధ్రజ్యోతి’ గత నెల మొదట్లో ‘అమరావతి టవర్స్‌ ఫర్‌ సేల్‌!’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇప్పుడు అదే నిజమవుతోంది.

ఎలా విక్రయించాలి?

గురువారం సీఎం జగన్‌ నిర్వహించిన ఏఎంఆర్డీయే సమీక్షా సమావేశంలో రెసిడెన్షియల్‌ టవర్ల అమ్మకంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఆ నివాస సముదాయాల్లో మిగిలి ఉన్న పనులను పూర్తి చేయడానికి ఎన్ని నిధులు అవసరమవుతాయి, పూర్తయిన తర్వాత అమ్మకానికి ఉంచితే ఎంత మొత్తం లభించే అవకాశముంది తదితరాంశాలపై చర్చ సాగిందని సమాచారం. దీంతోపాటు అసలు ఈ టవర్లను పూర్తిచేసి అమ్మాలా, లేక ఇప్పుడున్నది ఉన్నట్లుగా భూమితోసహా విక్రయుంచేయడం మేలా అనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. భూమితోసహా ఈ టవర్ల విలువను  కేంద్రం ఆధ్వర్యంలోని జాతీయ నిర్మాణ సంస్థ ద్వారా అంచనా వేయించాలని అధికారులు సూచించినట్లు సమాచారం. భవనాలున్న భూములను రైతులకు తిరిగి ఇవ్వలేం కాబట్టి ఏదోవిధంగా వాటిని ఉపయోగించుకోవడం మంచిదనే అంచనాకు వచ్చారు.

పూర్తి చేయాలంటే... 

అమరావతిలో వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకుగాను కార్యాచరణను రూపొందించాలని జగన్‌ ఆదేశించారు. అక్కడున్న అన్ని ప్రాజెక్టుల స్థితిగతులను అధికారులు వివరించారు. వివిధ నిర్మాణ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలతోపాటు పనుల పూర్తికి  రూ.10వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకూ అవసరమన్నారని తెలిసింది. వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం... ఆయా ప్రాజెక్టుల పూర్తికి కార్యాచరణను సిద్ధం చేసి, అవసరమైన నిధుల సమీకరణకు ఆర్థిక శాఖ తోడ్పాటుతో పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని ఏఎంఆర్డీయే ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. అమరావతిలో ప్రజలు నివసించేందుకు వీలుగా హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్ట్‌ను కూడా ముందుగా అనుకున్న ప్రకారం పూర్తి చేయాలని సీఎం చెప్పారు. 


Updated Date - 2020-08-14T08:41:50+05:30 IST