‘ధిక్కారం’ చేసినా, మమత ఎందుకు ఆహ్వానిస్తున్నారంటే...

ABN , First Publish Date - 2021-06-11T21:40:05+05:30 IST

తనను ధిక్కరించిన వారిని సహజంగా సీఎం మమత క్షమించరని బెంగాల్ రాజకీయ నేతలు అంటుంటారు.

‘ధిక్కారం’ చేసినా, మమత ఎందుకు ఆహ్వానిస్తున్నారంటే...

కోల్‌కతా : తనను ధిక్కరించిన వారిని సహజంగా సీఎం మమత క్షమించరని బెంగాల్ రాజకీయ నేతలు అంటుంటారు. అలాంటి కీలకమైన ఎన్నికల వేళ, తనకు హ్యాండిచ్చి, కీలక నేతలు బీజేపీలో చేరిపోయారు. సంస్థాగత వ్యవహారాలపై విపరీతమైన పట్టున్న ముకుల్ రాయ్ లాంటి వారు కూడా ఎన్నికల సమయంలో సీఎం మమతకు ఝలక్ ఇచ్చారు. అంతటి కీలక సమయంలో ఝలక్ ఇస్తే, తిరిగి చేర్చుకోవడానికి ఏ నేతా ఇష్టపడరు. అయినా మమత కిమ్మనకుండా వారందర్నీ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇలా మమత ఎందుకు చేస్తున్నారన్నదే ప్రశ్న. కీలకమైన ఎన్నికల వేళ, నేతలు హ్యాండిచ్చినా, మమత అవన్నీ మరిచిపోయి, నేతలను తిరిగి ఆహ్వానిస్తున్నారు. దీనంతటికీ ఒకే కారణమని మమత ఆంతరంగికులు పేర్కొంటున్నారు. ‘కాక మీదున్నప్పుడే బీజేపీని దెబ్బకొట్టాలి’ అన్న ఏకైక సూత్రంతో మమత వడివడిగా అడుగులు వేస్తున్నారని పేర్కొంటున్నారు. 


అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ బంపర్ మెజారిటీ సాధించడంతో బీజేపీలో చేరిన తృణమూల్ నేతలందరూ తిరిగి పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వారందర్నీ పార్టీలోకి తిరిగి తీసుకొని, బీజేపీని రాజకీయంగా కోలుకోలేని దెబ్బ కొట్టాలని మమత వ్యూహం పన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 18 ఎంపీ సీట్లను సాధించి, మమతకు ఖంగు తినిపించింది. ఈసారి కూడా బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు సాధించకుండా లక్ష్మణ రేఖ గీయాలని మమత యోచించారు. ఇందులో భాగంగానే తృణమూల్ అధినేత్రి ఘర్ వాపసీకి తెర లేపారు.


తృణమూల్ భారీ విజయం పొందడంతో పాత కాపులందరూ తిరిగి తృణమూల్ వైపు చూస్తున్నారు. భారీ విజయం ‘రుచి’ పాత కాక మునుపే వీరందర్ని తిరిగి తృణమూల్‌లోకి ఆకర్షించాలని మమత ప్లాన్ వేశారు. అంతే కాకుండా బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా సీఎం మమత గాలం వేసినట్లు తెలుస్తోంది. ఇలా భారీ మొత్తంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఆకర్షించి, బీజేపీని చావు దెబ్బ తీయాలని మమత చూస్తున్నారని సమాచారం. దీని ద్వారా బీజేపీలో పెద్ద చీలిక తెచ్చి, సంస్థాగతంగా దెబ్బ తీయాలని మమత చూస్తున్నారు. 

Updated Date - 2021-06-11T21:40:05+05:30 IST