జైశ్రీరాం నినాదానికి విరుగుడు కనిపెట్టిన సీఎం మమత

ABN , First Publish Date - 2021-03-04T19:36:14+05:30 IST

జైశ్రీరాం అంటూ నిత్యం తనను ఇరుకున పెడుతున్న బీజేపీకి సీఎం మమత విరుగుడు కనిపెట్టారు. బీజేపీ ‘హార్డ్‌కోర్ హిందుత్వ’ను

జైశ్రీరాం నినాదానికి విరుగుడు కనిపెట్టిన సీఎం మమత

కోల్‌కతా : జైశ్రీరాం అంటూ నిత్యం తనను ఇరుకున పెడుతున్న బీజేపీకి సీఎం మమత విరుగుడు కనిపెట్టారు. బీజేపీ ‘హార్డ్‌కోర్ హిందుత్వ’ను ఫాలో అవుతుంటే... తృణమూల్ ఇకపై ‘సాఫ్ట్ హిందుత్వ’ను ఫాలో కావాలని నిర్ణయించుకుంది. రాముడికి విరుగుడుగా శివుణ్ని తెరపైకి తీసుకురావాలని మమత తలపోసింది. మహా శివరాత్రి పర్వ దినాన ఆమె ఎన్నికల నామినేషన్‌ను వేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వచ్చే ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగనున్న నేపథ్యంలో అక్కడే నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పాటు ఎన్నికల కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. బీజేపీని ఇరుకున పెట్టడానికే ఈ రోజును ఎంచుకున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారం సందర్భంగా పాదయాత్రను చేపట్టాలని మమత డిసైడ్ అయ్యారు. ప్రతి రోజు కొన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయాలన్న తలపుంతో మమత ఉన్నట్లు సమాచారం. 


బీజేపీకి పట్టున్న స్థానాలపై కన్నేసిన మమత

రోజురోజుకీ బీజేపీ చొచ్చుకొస్తున్న నేపథ్యంలో మమత విరుగుడు కనిపెట్టారు. అన్ని స్థానాలపై దృష్టి సారిస్తూనే.... బీజేపీకి పట్టున్న స్థానాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అభ్యర్థులందర్నీ మమత బెనర్జీయే ఏరికోరి డిసైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరు అభ్యర్థిగా పోటీలోకి దిగినా... మిగితా వారందరూ కచ్చితంగా సహకరించాలన్న నిబంధనను ఆమె కేడర్‌కు ఇచ్చారు. మార్చి 5న పార్టీ అభ్యర్థుల జాబితాను మమత ప్రకటించనున్నారు. ఈ జాబితాలో యువ నేతలతో పాటు మరికొందరి కొత్తవారికి కూడా అవకాశం కల్పించనున్నారు. ‘‘బెంగాల్ కూతురే సీఎం కావాలి’’ అన్న నినాదంతోనే ఎన్నికల్లోకి దూసుకెళ్లాలని మమత విస్పష్టమైన ప్రకటన ఇప్పటికే ఇచ్చేశారు. ఈ నినాదంతోనే ముందుకు సాగాలని పార్టీ నేతలకు సూచించారు. 



Updated Date - 2021-03-04T19:36:14+05:30 IST