మనలో మనిషి మమత!

ABN , First Publish Date - 2021-05-16T18:52:13+05:30 IST

అవి దసరా నవరాత్రులు.. అది... ఎనిమిదవ రోజు. అంటే... దుర్గాష్టమి. బెంగాల్‌ అంతటా దుర్గాపూజ సందడి.

మనలో మనిషి మమత!

అవి దసరా నవరాత్రులు.. అది... ఎనిమిదవ రోజు. అంటే... దుర్గాష్టమి. బెంగాల్‌ అంతటా దుర్గాపూజ సందడి. అదే సమయంలో... పరిమళేశ్వర్‌ బెనర్జీ ఇంట్లో ఒక చిన్నారి జన్మించింది. పుట్టింది... అమ్మాయి! దుర్గాష్టమి రోజు పుట్టిన ఆ పాప... పెరిగి పెద్దయ్యాక ప్రత్యర్థుల పాలిట ఓ భద్రకాళి అవుతుందని ఊహించి ఉంటే, ‘దుర్గ’ అని పేరు పెట్టేవారేమో! కానీ... ‘మమత’ అని నామకరణం చేశారు. ఆమే... నేటి అగ్గిబరాటా, సమకాలీన రాజకీయాల్లో అపర కాళిక మమతా బెనర్జీ!.


‘ఇక అంతే! పశ్చిమ బెంగాల్‌లో ఎర్రజెండా ఎప్పటికీ ఎగురుతూనే ఉంటుంది! దాని తల దించే వారే ఉండరు’... అని అప్పుడు అంతా అనుకున్నారు. కానీ... మమతా బెనర్జీ 2001లో చరిత్ర తిరగరాశారు. 34 సంవత్సరాల వామపక్ష పాలనకు చరమ గీతం పాడారు. అప్పుడు ఆమె చేసిన నినాదం... ‘పరివర్తన్‌’. అంటే... మార్పు!


‘ఇంకేముంది! మమత పని అయిపోయింది. బెంగాల్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయం. గడ్డిపూల పార్టీకి ఇక గత వైభవమే’ అని ఇప్పుడు అంతా అనుకున్నారు. కానీ... అదే మమతా బెనర్జీ మరో చరిత్ర సృష్టించారు. ఇటీవలి ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలిచి, తానేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆమె చేసిన నినాదం... ‘మై బెంగాల్‌కీ బేటీ’! ఇది మరో సంచలనం! అసలీ మమతా బెనర్జీ ఎవరు? ఎక్కడిదీ తెగువ? ఏమిటామె నేపథ్యం? రంగుల గీతలు ఉన్న తెల్ల నూలు చీర, కాళ్లకు హవాయి చెప్పులు, కళ్లకు మందపాటి ఫ్రేము ఉన్న అద్దాలు, ముడివేసిన జుట్టు, ముఖంపై ముడతలు, భుజంపై వేలాడే పొడవాటి ఖాదీ సంచీ... మమత అంటే ఇంతేనా? ఇంకా చాలా ఉంది!


నేనూ... నాన్న..


‘‘నాన్న చనిపోయి రెండు రోజులైంది. ఒకరోజు సాయంత్రం వంట చేస్తూ పుస్తకం చదువుతున్నా. తలుపు బయట ఎవరో నిలబడినట్లు రెండు పాదాలు కనిపించాయి. లాంతరు పట్టుకుని అక్కడికి వెళ్లాను. అక్కడ ఎవరూ లేరు. కానీ... నేను గుర్తుపట్టగలను. అవి నాన్న పాదాలే. ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు ఎన్నోసార్లు ఆ పాదాలను నొక్కాను. నూనె రాసి మర్దన చేశాను’’.. 


ఇది మమత స్వయంగా రాసుకున్న ‘మరపురాని జ్ఞాపకాలు’ (మై అన్‌ఫర్గెటబుల్‌ మెమొరీస్‌) పుస్తకంలోని తొలి పలుకులు. ఇది... నాన్నంటే ఆమెకు ఎంత ఇష్టమో చెప్పేందుకు ఈ రెండు మాటలు చాలు. మమతను వాళ్ల నాన్న ముద్దుగా ‘మోనాబాబా’ అని పిలిచేవారట! తల్లి గాయత్రీ దేవికంటే తండ్రే ఆమెను ఎక్కువ ముద్దు చేసేవారు. మమతకు ఆరుగురు సోదరులు! ఇద్దరు సోదరీమణులు. వారిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. పెద్ద కుటుంబం. తండ్రి మరణం తర్వాత ఆర్థిక పరిస్థితి దిగజారింది. చిన్నప్పుడు పేదరికం అనుభవించారు, పాలు అమ్మారు, ట్యూషన్లు చెప్పారు... మమత గురించి ఇలా అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే... మమత మాత్రం తన చిన్నతనంలో కష్టాలు అనుభవించినట్లు ఎక్కడా చెప్పుకోలేదు. మమత చిన్నగా ఉన్నప్పుడే కలకత్తా (నేటి కోల్‌కతా)కు వలస వచ్చారు. కాళీఘాట్‌ ప్రాంతంలో నివాసం. విశేషమేమిటంటే... మమత తాము చిన్నప్పుడున్న ఇంట్లోనే ముఖ్యమంత్రి అయ్యాకా ఉన్నారు. ఆమె ఎలాంటి ఆర్భాటాలు, విలాసాలను కోరుకోరు.


సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లాగే ఉండాలనుకుంటారు. అలా ఉన్నారు కూడా. అధికారిక లెక్కల ప్రకారం మమత పుట్టింది 1955 జనవరి 5న. కానీ... అది నిజమైనది కాదు! మనదేశంలో చాలా మంది పిల్లలను పాఠశాలలో చేర్చేటప్పుడు... వయసు సర్దుబాటు కోసం తేదీ మార్చేస్తుంటారు. మమత విషయంలోనూ అదే జరిగింది. స్కూల్‌ ఫైనల్‌ చేరుకునేసరికి 15 ఏళ్లు నిండవని ఏకంగా ఐదేళ్లు ముందు పుట్టినట్లు చూపించారట! మమత దుర్గాష్టమి (అక్టోబరు 5)న పుట్టగానే జాతకపత్రం రాయించారు. కానీ... అధికారికంగా చెల్లుబాటుకాని ఆ ‘కాగితం’తో పనేముందంటూ, దానిని చించేశానని మమత చెప్పుకొన్నారు. చాలా మంది రాజకీయ నాయకులు ఆర్భాటంగా పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటుంటారు. కానీ, మమత ఎప్పుడూ తన పుట్టినరోజు జరుపుకోలేదు. అది ఆమెకు ఇష్టం ఉండదు కూడా!. ఈ విషయంలో కార్యకర్తలు, అభిమానులు కూడా ఆమె మనసెరిగి నడుచుకుంటారు. 


చిన్నతనపు సరదాలు


మమత ఇప్పుడో అగ్గిబరాటా! బాల్యంలో మాత్రం అందరిలాగా అల్లరి పిల్ల. గిల్లీ దండా, గోలీకాయలు, హుగ్లీ నదిలో ఈత... ఇలా ఎన్నో సరదాలు. బొమ్మల పెళ్లికి మమతే పెద్దగా వ్యవహరించేది. తమకు ఖాతా ఉన్న దుకాణం నుంచి చక్కెర, పిండి, నూనె తెచ్చి పిండి వంటలు కూడా చేసుకునేవారట! అదీ అమ్మా నాన్నలకు తెలియకుండా! ఒకసారి... నాన్నకు ఈ విషయం తెలిసి అడిగితే మమత నిజమే చెప్పింది. ‘సరే... అమ్మకు తెలిస్తే తిడుతుంది. ఇంకెప్పుడూ ఇలా చెప్పకుండా చేయొద్దు’ అని ‘మోనాబాబా’ను తండ్రి ముద్దుగా మందలించాడట! ఇంతగా ప్రేమించే తండ్రి మరణం... మమతను బాగా కుంగదీసింది. గ్యాస్ట్రిక్‌ అల్సర్స్‌ బాధిస్తుండటంతో పరిమళేశ్వర్‌ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్‌ తర్వాత 48 గంటలు గడిచాకే ఏమైనా చెప్పగలం అని వైద్యులు అన్నారు. ఆ 48 గంటలు మమత కుటుంబం క్షణమొక యుగంగా గడిపింది. కానీ... ఆ గడువు ముగిశాకే మమత తండ్రి కన్నుమూశారు. ‘‘మోనాబాబా.... ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే నేను చనిపోయాను’’ అని కలలో కనిపించి చెప్పారట! ఒక విశేషమేమిటంటే... తన జీవిత చరిత్రలో మమత తన తండ్రి పేరు ఎక్కడా రాయలేదు. ‘బాబా’ అని మాత్రమే ప్రస్తావించారు. ఆయన ఏం చేసేవారో కూడా చెప్పలేదు. ఇంటర్నెట్‌లో వెతికితే... మమత తండ్రి వ్యాపారి అని, కాంగ్రెస్‌ కార్యకర్తగా పనిచేసేవారని తెలుస్తుంది.


పూలూ... రాళ్లు!


‘నేను హిందువును. మేం బ్రాహ్మణులం’ అని ఎన్నికల సమయంలో మమత బహిరంగంగా మైకు పట్టుకుని అరవాల్సి వచ్చింది. ఇదో రాజకీయ అవసరం! అయితే... మమతకు చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక భావాలు అధికం. ‘కనిపించని శక్తి’ ఏదో ఉందని ఆమె నమ్ముతారు. తండ్రి మరణం గురించి ముందే తెలియడం, మరణం తర్వాత తండ్రి పాదాలు కనిపించడం, ఎవరో కానుకగా ఇచ్చిన గంధపు బుద్ధుడి ప్రతిమను మరొకరు తీసుకోబోగా... అది కట్టు కదలకుండా అలాగే ఉండటం వంటి అనేక అద్భుతాలు జరిగాయని ఆమె స్వయంగా పేర్కొన్నారు. దుర్గాపూజను ఎంతో ఇష్టంగా చేస్తారు. బాల్యంలో హుగ్లీ నది అవతల ఉన్న పోలీస్‌ బంగ్లా (కలెక్టర్‌ కార్యాలయం)లోకి వెళ్లి... పూజకు అవసరమైన పూలు తెచ్చేవారు. కాపలాగా ఉండే సెంట్రీల కళ్లుకప్పి మరీ లోపలికి వెళ్లేవారు. ఎంపీ అయ్యాక అదే బంగ్లాలో అధికారిక సమీక్షలు నిర్వహించినప్పుడు... తన బాల్యంనాటి ఘటనలు గుర్తుకొచ్చి నవ్వుకున్నారట! పూలకోసం అంత కష్టపడిన మమత... ఇప్పుడు వాటిని తన దగ్గరికి కూడా రానివ్వరు. పూలదండలు, బొకేలు, పుష్ప వర్షాలకు ఆమె దూరం. ఎందుకంటే... ఒక దాడిలో ఆమె కుడికంటిలో గాజురవ్వలు పడ్డాయి. 20 శాతం చూపు సన్నగిల్లింది. పుష్పాల్లోని పుప్పొడితో ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. దీంతో... అప్పటి నుంచి ఆమె పూలకు దూరంగా ఉంటున్నారు. 


చరిత్రను తిరగరాసి.. 


పశ్చిమ బెంగాల్‌ సమ్మెలు, ఆందోళనలకు పెట్టింది పేరు. అవంటే ఏమిటో, ఎందుకు వస్తాయో చిన్నప్పుడు మమతకు తెలిసేది కాదు. అయితే... సమ్మె అంటే సెలవు. సెలవు అంటే పండగ. ‘సమ్మె పండగ ఎప్పుడు వస్తుంది అన్నా?’ అని సోదరుడిని అడిగేది! అయితే, సమ్మె రోజున రాళ్లు ఎందుకు విసురుతారు అని కూడా అమాయకంగా ప్రశ్నించేది. ‘అన్ని పండగలకు పూలతో పూజ చేస్తారు. సమ్మె పండగకు మాత్రం రాళ్లతో’ అని అన్న సరదాగా చెప్పేవాడు. 

మమత జీవితంలో పూలున్నాయ్‌, రాళ్లున్నాయ్‌! ఆమె జీవితమే ఒక సంఘర్షణ. హింసా రాజకీయాలకు నెలవైన బెంగాల్‌లో ఒక మహిళ వరుస విజేతగా నిలవడమే ఒక చరిత్ర! స్వయనా భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షా వంటి వాళ్లు రంగంలోకి దిగి, ఆమెపై ముప్పేటదాడి చేసి, ఎలాగైనా పశ్చిమ బెంగాల్‌లో మమతను ఓడించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి కోరిక నెరవేరలేదు. అహంకారానికి, ఆత్మాభిమానానికి జరుగుతున్న యుద్ధం ఇది అంటూ మమత ఒంటికాలి మీద ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్ని అడ్డంకులు, ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని హింసలు పెట్టినా వెనక్కి తగ్గలేదు. ఆమె ఆత్మవిశ్వాసాన్ని కేంద్రం పెద్దలు దెబ్బతీయాలని చూసినా... కించిత్తు భయపడలేదు. రెట్టించిన పట్టుదలతో బెబ్బులిలా తిరగబడి, పోరాడి గెలిచారు మమత. గెలిచింది పశ్చిమ బెంగాలే కాదు, భారతదేశం... అంటూ మమత చేసిన ప్రకటన పెద్ద మార్పుకు సంకేతం అవుతుందేమో చూడాలి మరి. 




చచ్చి బతికి...


మమతకు ఎందుకు కాఠిన్యం? ఎక్కడి నుంచి వచ్చిందీ ఆగ్రహం? ఏమో మరి! అయితే... దెబ్బలు తినేకొద్దీ రాటుదేలతారు అనే మాట నిజమే అయితే, అందుకు మమతే ఒక ఉదాహరణ. యుక్తవయసులో ఉండగానే ఆమె రాజకీయాల్లో చెలరేగిపోయింది. దేశమంతా ‘లోక్‌నాయక్‌’ అని ప్రశంసించే జయప్రకాశ్‌ నారాయణ్‌ కారును అడ్డుకుని, పైకెక్కి నినాదాలు చేసింది. ‘ఈమె మన ఎనిమీ నెంబర్‌ వన్‌’ అని ప్రత్యర్థి శిబిరం భావించింది. ఆమెపై అనేక భౌతిక దాడులు జరిగాయి. 1990 ఆగస్టు 16న జరిగిన దాడిలో దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది. ఇనుప రాడ్లతో రెండు దెబ్బలు నేరుగా తలపై పడ్డాయి. ఎర్రటి రక్తంతో ఆమె తెల్లటి చీర తడిసిపోయింది. మూడో దెబ్బ కూడా పడుతుండగా... తన రెండు చేతులు అడ్డం పెట్టారు. లేదంటే... అప్పుడే తన ప్రాణాలు పోయేవని మమత చెబుతారు. అప్పట్లో ఆమెకు రెండు సర్జరీలు జరిగాయి. తలకు బాగా దెబ్బతగిలిన ప్రభావం ఇప్పటికీ కనిపిస్తుంది. మమతకు రాత్రిళ్లు సరిగ్గా నిద్రరాదు. అప్పుడప్పుడు విపరీతమైన తలనొప్పి కూడా!


అమ్మో... బాయ్‌ఫ్రెండ్స్‌

మమత అవివాహిత. పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేమిటో తెలియదు. విద్యార్థిగా ఉండగానే ఉద్యమాలు, రాజకీయ రంగ ప్రవేశంతో తీరికలేని జీవితం గడుపుతున్న ఆమె... పెళ్లి అనే అధ్యాయాన్ని మరచిపోయారేమో! అయితే... ఆమె విద్యార్థి దశలో ‘బాయ్‌ఫ్రెండ్స్‌’కు సంబంధించిన సరదా సన్నివేశం ఒకటుంది. అప్పట్లో... మమత, మరికొందరు అమ్మాయిలు టీచర్‌ భారతితో కలిసి స్కూలుకు వెళ్లి, మళ్లీ ఆమెతోనే తిరిగి వచ్చేవారు. ఒకరోజు భారతీ టీచర్‌ బడికి రాలేదు. ‘ఫ్రెండ్స్‌’తో మాట్లాడి ఇంటికి వెళదాం అని తోటి పిల్లలు అన్నారు. మమత... సరే అంది. మమత స్నేహితురాళ్లు పార్కులో ఇద్దరు అబ్బాయిలతో మాట్లాడుతూ కూర్చున్నారు. కాసేపు వేచి చూసిన మమత... ‘ఫ్రెండ్స్‌ వస్తారన్నారే! ఏరీ’ అని అమాయకంగా అడిగింది. వాళ్లు నవ్వుతూ అబ్బాయిలను చూపిస్తూ... ‘వీళ్లే ఫ్రెండ్స్‌! బాయ్‌ఫ్రెండ్స్‌’ అని అన్నారు. దీంతో... మమతకు భయమేసింది. ఆ రోజు నుంచి భారతీ టీచర్‌ స్కూలుకు రాకుంటే, మమత కూడా రానట్టే!.



పరుగు.. నడక..

కవిత్వం, చిత్రలేఖనం, సంగీతం వినడం... ఇవి మమతకు ఇష్టమైన వ్యాపకాలు. ఆమె ఇప్పటివరకు 27 పుస్తకాలు రచించారు. మతం, కులం, లింగవివక్ష, ధనిక-పేద తారతమ్యాలు... ఇలాంటి అంశాలే ఆమె పుస్తకాలకు ఇతివృత్తాలు. తాను గీసిన చిత్రాలతో ప్రదర్శనలు కూడా నిర్వహిస్తుంటారు. ఆమె గీసిన 300 చిత్రాలు రూ.9 కోట్లకు అమ్ముడయ్యాయి. న్యూయార్క్‌లో వేసిన వేలంలో కూడా ఆమె చిత్రలేఖనం అధిక ధరకు అమ్ముడైంది. మమతకు ఇష్టమైన వ్యాపకం మరొకటి ఉంది. అదే... నడక! ఆమె రోజుకు దాదాపు 15 కిలోమీటర్లు నడుస్తారు. ప్రతి రోజు ట్రెడ్‌మిల్‌ మీద ఆరు కిలోమీటర్లు నడవడం ఆమెకు అలవాటు. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు రోజుకు కనీసం 10 నుంచీ 20 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. అందుకని నడక ఆమె జీవితంలో భాగమైంది. అసెంబ్లీ లాన్‌లలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులతో లాంగ్‌ వాక్‌ చేయడం అలవాటు.


అబద్ధం చెప్పను

‘తప్పులు సహించవద్దు. కానీ, ఒక్కోసారి నిజం మాట్లాడకపోవడమే మంచిది’ అని మమతా బెనర్జీ తండ్రి లౌక్యం నేర్పించారు. కానీ... ‘ఏది ఏమైనా... నిజమే చెబుతాను’ అనేది మమత మాట. చిన్నప్పుడు తను పచారీ దుకాణం వద్ద ఉండగా... ఒక వ్యక్తి బీడీ కాల్చి, దానిని నిర్లక్ష్యంగా విసిరేశాడు. అది కాస్తా... బాబ్‌లా అనే పిల్లాడి చొక్కా లోపల పడిపోయింది. అతని చొక్కాతోపాటు వీపు కూడా కాస్త కాలిపోయింది. దీనిపై పెద్ద గొడవ! పంచాయతీ కూడా జరిగింది. ‘అదిగో బీడీ వేసింది అతనే. నేను చూశాను’ అని మమత ధైర్యంగా చెప్పారట! ‘మరపురాని జ్ఞాపకాలు’ పుస్తకంలో ఆమె ఈ విషయం రాసుకున్నారు. 


వెంటనే ఇంటికి రావాల్సిందే!


ప్రయాణాలంటే ఇష్టమే. కానీ.. విదేశాలకు వెళ్లడం ఇష్టముండదు. అధికారిక పర్యటనల కోసం విదేశాలకు వెళ్లినా... వీలైనంత త్వరగా వచ్చేయాలనుకుంటారు. ‘పర్యటనలకు భారత్‌ బెస్ట్‌’ అని చెబుతారు. అన్నట్లు... మమత జీవితమే స్ఫూర్తిగా 1999లో ‘భాగిని’ అనే సినిమా కూడా వచ్చింది.


వరి అన్నం, బంగాళా దుంపలతో చేసిన వడలు, చాక్లెట్లు అంటే ఇష్టం. అప్పుడప్పుడు చాయ్‌ తాగుతూ రిలాక్స్‌ అవుతారు. 



 జొగమయాదేవి కళాశాలలో హిస్టరీలో బ్యాచిలర్‌ డిగ్రీ, కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇస్లామిక్‌ హిస్టరీ పూర్తి చేశారు మమత. ఎడ్యుకేషన్‌, న్యాయవిద్యలలో కూడా ఆమె పట్టభద్రురాలు.  


తొలినాళ్లలో మమతకు కాంగ్రెస్‌ పార్టీలో ప్రత్యేక గుర్తింపు రావడానికి చిత్రలేఖనం కూడా తోడ్పడింది. ఒకవైపు కవిత్వం రాస్తూ, రచనలు చేస్తూనే... మరోవైపు అద్భుతమైన బొమ్మలు వేసేవారు. ఆ చిత్రాలను విక్రయించగా వచ్చిన డబ్బును పార్టీ కోసం విరాళంగా ఇచ్చేవారామె. 


రాజకీయాల్లోకి రాకముందు టైపు నేర్చుకున్న మమత స్టెనోగ్రాఫర్‌గా చేశారు. ఆ తరువాత ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా, ప్రైవేటు ట్యూషన్‌ టీచర్‌గా, కొన్నాళ్లు సేల్స్‌గర్ల్‌గా కూడా పనిచేశారు. చిన్నప్పటి నుంచే సొంతకాళ్లపైన నిలబడి బతకాలన్న తత్వం ఆమెది. 


1984 లోక్‌సభ ఎన్నికల్లో 29 ఏళ్ల మమతా బెనర్జీ.. రాజకీయాల్లో అత్యంత సీనియర్‌ అయిన సీపీఎం నాయకుడు సోమ్‌నాథ్‌ చటర్జీని ఓడించి... సంచలనం సృష్టించారు. 


మమతా బెనర్జీ రాజకీయాల్లో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నా సరే... ఆమె సున్నిత మనసు సంగీతం, సాహిత్యాన్ని మరువలేదు. ఆమె గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోల్‌కతాలోని ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ సంగీతాన్ని మైకుల్లో వినించే ఏర్పాటు చేశారు. ఆ ప్రయోగానికి బెంగాళీలు ఫిదా అయ్యారు. మమతకు అత్యంత ఇష్టమైన కవుల్లో ఒకరు ఖాజీ నజృల్‌ ఇస్లామ్‌. 


దక్షణ కోల్‌కతా, హరీష్‌ ఛటర్జీ వీధిలోని తమ పూర్వీకుల ఇంట్లోనే ఉన్నారు మమత. ఆ ఇల్లు పైకప్పును టెర్రకోట టైల్స్‌తో కప్పారు. భారీ వర్షాలు కురిస్తే ఇంట్లోకి నీళ్లు వస్తాయి. వాజపేయి ఒకసారి కోల్‌కతాకు వచ్చినప్పుడు మమత ఇంటిని చూసి ఆశ్చర్యపోయారు. అత్యంత సాధారణమైన జీవితాన్ని గడుపుతున్న ఆమెను చూశాక వాజ్‌పేయికి గౌరవభావం మరింత పెరిగింది.


ఏది పడితే అది తినే రకం కాదు. ఆచితూచి ఎంపిక చేసుకున్న తిండినే తింటారు మమత. అధిక నూనెలు, మసాలాలతో వండిన పదార్థాలను ఆమె అస్సలు ముట్టరు. 


ముఖ్యమంత్రి హోదాలో గ్రామాలకు వెళ్లినప్పుడు... ఎక్కడ వరి పొలం కనిపించినా ఆమె కారు కాసేపు ఆగుతుంది. ఎందుకంటే చిన్నప్పుడు పొలాల్లో కోతలయ్యాక వరి కంకులను ఏరుకుని, వాటిని గుత్తిగా కట్టి, ఇంటి చూరుకు వేలాడదీసేవారు. ఆ కంకులే పిచ్చుకలకు ఆహారం అయ్యేవి. 


కథనం : తొమ్మండ్రు సురేష్‌ కుమార్‌



మమతాగ్రహం... 

మమత కవయిత్రి, చిత్రకళాకారిణి కూడా! అమె అనేక పుస్తకాలు రచించారు. ఇక... అనేక చిత్రాలనూ గీయడం ఆమెకు అలవాటు. ఆమె గీసిన చిత్రాలు వేలంలో మంచి ధర పలికాయి. కవులు, కళాకారులకు ‘ఆగ్రహం తక్కువ, ఆలోచన ఎక్కువ’ అని అనుకుంటాం. కానీ... మమత వ్యక్తిత్వం భిన్నమైనది. ఆమెకు ఆలోచనా ఎక్కువే, ఆగ్రహమూ ఎక్కువే. 1996లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంటులో ఆందోళనకు దిగిన సమాజ్‌వాదీ ఎంపీ కాలర్‌ పట్టుకుని ఈడ్చిపడేశారు. యువతతో ముఖాముఖి సమయంలో తనకు గిట్టని ప్రశ్నలు అడిగితే... ‘మీరంతా మావోయిస్టు, వామపక్ష విద్యార్థులు. అందుకే ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు’ అంటూ కాలర్‌మైక్‌ విసిరేసి అర్ధంతరంగా వెళ్లిపోయారు. రాజకీయ ప్రత్యర్థులపైకి కాలు దువ్వుతారు. రంకెలు వేస్తారు. అసహనంతో ఊగిపోతారు. నచ్చకపోతే డోంట్‌కేర్‌. కుండబద్ధలు కొట్టినట్లే...! 

Updated Date - 2021-05-16T18:52:13+05:30 IST