అసెంబ్లీ రద్దుకు రెడీ

ABN , First Publish Date - 2022-07-11T08:16:41+05:30 IST

‘‘బీజేపీ వాళ్లకు నిజంగా దమ్ముంటే ముందస్తు ఎన్నికల తేదీని ప్రకటించమనండి. నేనే అసెంబ్లీని రద్దు చేస్తా. అందరం ఎన్నికలకు పోదాం. ఇలాంటి చిల్లర మాటలతోని కేసీఆర్‌ను కొడతారా? దెబ్బతీస్తారా? ఇంత కురచ ఆలోచనా? ఇది మంచిది కాదు.

అసెంబ్లీ రద్దుకు రెడీ

ఎన్నికల తేదీని ప్రకటించే దమ్ముందా?

ముందస్తుకు పోతే నన్ను తట్టుకుంటరా?

టీఆర్‌ఎస్‌ జాతీయపార్టీగా మారుతుంది

ఆ విషయం ప్రధాని నరేంద్ర మోదీకి తెలుసు

కొత్త పార్టీ రావొద్దా? వాళ్లేమైనా గుత్తపట్టుకున్నరా?

ఫ్రంటో గింటో కడితే.. గెలిచాక ఏమవుతుంది?

బిల్లులు లోక్‌సభలో తప్ప రాజ్యసభలో పాస్‌ కావు

గుణాత్మక పాలన కోసమే జాతీయ రాజకీయ పార్టీ

ప్రజాస్వామ్యంలో గెలిపించేది, ఓడించేది ప్రజలే

వాళ్లు జాగృతమైతే నేతలు మోకాళ్లపై నిలవాల్సిందే

‘నేను ఓడిస్తా’ అని ఎవరైనా అంటే అహంకారమే

కేంద్రంలో నడిచేది బ్లాక్‌మెయిలర్‌ ప్రభుత్వమా?

నా మీద కూడా 1, 2 కేసులు పెడ్తరేమో.. ఏం కాదు

మోదీ అసమర్థ పాలన వల్లే రూపాయి పతనం

బీజేపీ జాతీయ సమావేశంతో ఒరిగిందేమీ లేదు

నాన్‌ బీజేపీ డబుల్‌ ఇంజన్‌ సర్కారు వస్తుంది

కేంద్రంలోని బీజేపీకి చరమగీతం పాడతాం

మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు


 కేసీఆర్‌ ఫైటర్‌

జైళ్లకు, కేసులకు ఎవరు భయపడతారు. నా మీద కూడా ఒకటి, రెండు కేసులు పెడతారేమో. న్యాయస్థానాలున్నాయి. న్యాయం బతికే ఉంది. కేసీఆర్‌ ఫైటర్‌. కేసులతో ఏం కాదు. మా పార్టీలో ఈడీ కేసులు పెట్టేంత దొంగలు లేరు. మేం కుంభకోణాలు చేయలేదు. బీజేపోళ్ల లొల్లిని ఎవరూ నమ్మరు. 529 రోజుల కౌంట్‌ డౌన్‌ పేరుతో బీజేపీ డిజిటల్‌ టైమర్‌ పెట్టడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌


హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ‘‘బీజేపీ వాళ్లకు నిజంగా దమ్ముంటే ముందస్తు ఎన్నికల తేదీని ప్రకటించమనండి. నేనే అసెంబ్లీని రద్దు చేస్తా. అందరం ఎన్నికలకు పోదాం. ఇలాంటి చిల్లర మాటలతోని కేసీఆర్‌ను కొడతారా? దెబ్బతీస్తారా? ఇంత కురచ ఆలోచనా? ఇది మంచిది కాదు. ఒకవేళ ముందస్తుకు పోతే కేసీఆర్‌ను తట్టుకుంటారా? కేసీఆర్‌ జాతీయస్థాయి రాజకీయాల్లోకి వస్తే.. రైతుబంధు, దళితబంధు ఇస్తానని ప్రజలకు చెప్తాడు. ‘అదే జరిగితే మన కొంప మునుగుతది’ అని బీజేపీ భయపడుతోంది’’.. అని సీఎం కేసీఆర్‌ బీజేపీపై మండిపడ్డారు. తాను గుణాత్మక మార్పు కోసమే దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలనుకుంటున్నానని.. జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించానని చెప్పారు. ఆదిశగా దేశ ప్రజలను జాగృతం చేసే కసరత్తు జరుగుతోందన్నారు. ఇందుకోసం మేధావులు, రాజకీయ నేతలను కలిసి జాతీయ అంశాలపై చర్చిస్తున్నట్లు చెప్పారు. ‘‘ఫ్రంటో, గ్రింటో కడుతాం అనుకుందాం. గెలిచాక ఏం చేస్తారు. కామన్‌ మినిమం ప్రోగాం ఉంటుంది. అంతేకదా. గెలిచాక లోక్‌సభలో బిల్లు పెడితే పాస్‌ అవుతుందిగానీ.. రాజ్యసభలో పాస్‌ కాదు. గెలవకుంటే కొందరు ఫ్రంట్‌కు చైర్మనే లేరనివిమర్శలు చేస్తారు. అందుకే జనంలోంచి మహత్తరమైన శక్తి రావాల్సిన అవసరముంది. దానికోసమే నేను రచన చేస్తున్నా. నేను ఎత్తుకుంటే ఎంత సీరియ్‌సగా పనిచేస్తనో తెలుసు.


ప్రస్తుతం అదే పనిలో ఉన్న. 100 శాతం చేస్తా. దేశ ప్రజలు జాగృతమైతే నాయకులంతా మోకాళ్లమీద నిలబడతరు’’ అని ఆయన హెచ్చరించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన సీఎం.. బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జాతీయ పార్టీ ఎప్పుడు పెడుతున్నారని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘‘మీ కోరిక తీప్పకుండా తీర్చుతా. ఆ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆ విషయం మీకన్నా ఎక్కువ మోదీకి తెలుసు. తెలంగాణలో నేను బిజీగా ఉండేలా చేయాలన్నది బీజేపీ ప్లాన్‌. ఏక్‌నాథ్‌ షిండేను తీసుకురండి. నేను చాలా బిజీ అవుతా. నాకు కొట్లాడుడు అలవాటే’’ అని బదులిచ్చారు. అవసరమైతే టీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా మారుతుందని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. ‘‘కొందరు జాతీయ పార్టీపై అలానే విమర్శలు చేస్తరు. టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టినప్పుడు ఇలానే అన్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ఎక్కడుందో కనిపించడం లేదా? కొత్త పార్టీ దేశంలో రావొద్దా? ఎందుకు రావొద్దు? వాళ్లేమైన గుత్తపట్టుకున్నారా?’’ అని కేసీఆర్‌ నిలదీశారు.


కేంద్రంలో ఉన్న మోదీ సర్కారుదీ, రాష్ట్రంలో తమదీ ప్రభుత్వమేనని.. ఇద్దరం ప్రజలకు మేలు చేయడానికే ఉన్నామని గుర్తు చేశారు. ‘‘మాతో సఖ్యతగా ఉంటే మంచిగా ఉంటామని అనడం ఏంది? ఇదేం దిక్కుమాలిన వ్యవహారం? యాజమాన్య బాధ్యతలో ఉన్న ఒక తండ్రి ఆ మాట అనొచ్చా. కేంద్రంలో నడిచేది బ్లాక్‌మెయిలర్‌ ప్రభుత్వమా? ప్రజాస్వామ్య ప్రభుత్వామా?మాతో మంచిగా ఉంటే నిధులు ఇస్తామనడం అవివేకం’’ అని కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 


కేసీఆర్‌ ఫైటర్‌!

‘‘జైళ్లకు కేసులకు ఎవరు భయపడ్తారు. ఈ వయసులో నేనేందుకు భయపడుతా. నా మీద కూడా ఒకటి, రెండు కేసులు పెడ్తారేమో. న్యాయస్థానాలున్నాయి. న్యాయం బతికే ఉంది. కేసీఆర్‌ ఫైటర్‌. కేసులతో ఏం కాదు. మా దాంట్లో ఈడీ కేసులు పెట్టేంత దొంగలు లేరు? మేం కుంభకోణాలు చేయలేదు. బీజేపోళ్ల లొల్లిని ఎవరూ నమ్మరు’’ అని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.  తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఒక్కరిద్దరు బీజేపీలోకి వెళ్తే తమ పార్టీకి నష్టం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వాన్నిఇప్పటికిప్పుడు పడగొట్టే ఆలోచన తనకు లేదని కేసీఆర్‌ తేల్చిచెప్పారు. ‘‘వాళ్లు ఇంకా విస్తరించాలి. అహంకారం పెరగాలి. ఇంకా తప్పులు చేయాలి. ఆ పార్టీ కథ ఎన్నికల్లో చూసుకుంటాం’’ అని వ్యాఖ్యానించారు. బీజేపీని ప్రజలే పడగొడతారని ధీమా వ్యక్తం చేశారు. 


యాదృచ్ఛికమే

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే సమయంలోనే.. యశ్వంత్‌ సిన్హా సమావేశం నిర్వహించడం యాదృచ్ఛికమేనని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆ సభ నుంచి తాను సంధించిన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వలేకపోయారన్నారు. ‘‘మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నపుడు అప్పటి కేంద్ర సర్కారు వైఫల్యం వల్లే రూపాయి విలువ తగ్గిందని విమర్శించారు.. మరి ఎనిమిదేళ్ల మోదీ పాలనలో డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత పతనమై ఏకంగా రూ.80కి చేరుకుంది. ఇదే విషయాన్ని అప్పుడు ఆయన అడిగారు. ఇప్పుడు మేం అడగొద్దా? రూపాయి విలువ ఇంత దరిద్రంగా పడిపోవడానికి కారణం మీ చేతగానితనమా? అవివేకమా? దేశ ప్రజలకు సమాధానం సమాధానం చెప్పాలె.’ అని నిలదీశారు. మోదీ అవలంబిస్తున్న అవినీతి విధానాలు, లక్షల కోట్ల కుంభకోణాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు.. వంటి ప్రజా సంబంధ అంశాలపైనే తాను ప్రశ్నించానని, కానీ మోదీ వాటికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడి వెళ్లారని ఎద్దేవా చేశారు. ‘‘దేశాన్ని జలగలాగా పీడిస్తున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వల్ల ఒరిగిందేమీ లేదు. ‘దేశానికి ప్రయోజనం కలిగించే విషయాలేమైనా చెబుతారా’ అని.. మనమే కాదు, దేశప్రజలంతా ఎదురు చూశారు. కానీ, నిష్ర్కియాపరమైన, అసమర్థ పాలన కొనసాగిస్తున్న ప్రధాని మోదీ ఆ సమావేశంలో  ఏం మాట్లాడిండో భగవంతునికే ఎరుక. ఆయనకు ముందు మాట్లాడిన కేంద్ర మంత్రులు కేవలం కేసీఆర్‌ను తిట్టి నోటి దూల తీర్చుకున్నరు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సరుకు లేదు, సబ్జెక్ట్‌ లేదు. దేశ ప్రజలకు నిరాశే మిగిల్చారు’’ అని నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు చెప్పినట్లుగానే డబుల్‌ ఇంజన్‌ సర్కారు రావాలని, అయితే అది నాన్‌ బీజేపీ డబుల్‌ ఇంజన్‌ వస్తుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

 

దేశంలో ప్రతి ఎకరాకూ నీళ్లు!

దమ్మున్న ప్రభుత్వమే ఉంటే దేశంలో ప్రతి ఎకరాకూ నీళ్లు ఇవ్వొచ్చని కేసీఆర్‌ అన్నారు. అందుకు 40 వేల టీఎంసీలే అవసరమని.. అందుకు మంచి ప్రాజెక్టులు కట్టుకోవాలని ఆయన పేర్కొన్నారు. ‘‘దేశంలో నీటియుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి. నదులను ఎందుకు అనుసంధానం చేయట్లేదు? సమాధానం చెప్పండి’’ అని నిలదీశారు. దేశరాజధానిలో మంచినీళ్లు దొరకడం లేదని గుర్తుచేశారు. ‘‘దేశంలో కురిసే వర్షపాతం ద్వారా 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఇందులో కేవలం 22 వేల టీఎంసీలను మాత్రమే వినియోగించుకొంటున్నాం. ప్రపంచంలో చాలా దేశాలు వేల టీఎంసీల సామర్థ్యంగల రిజర్వాయర్‌లను నిర్మించుకున్నాయి. మనం ఎందుకు నిర్మించుకోకూడదు. మన దగ్గర ఉన్న నీటిని సద్వినియోగం  చేసుకుంటే ఇండియాలో ప్రతి ఎకరాకూ నీరు ఇవ్వొచ్చు’’ అని స్పష్టం చేశారు. ‘‘కుట్రలు కుతంత్రాల రాజకీయాలు కాదు. ప్రజాస్వాయ్య రాజకీయాలు చేద్దాం. ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఓడించేటోళ్లు, గెలిపించేటోళ్లు ప్రజలు. ప్రజాస్వామ్యంలో ‘నేను ఓడిస్తా’ అని మాట్లాడొచ్చా. అది అహంకారానికి, అవివేకానికి నిదర్శనం’’ అని మండిపడ్డారు.


అసమర్థ ప్రధాని..

ప్రధాని మోదీ అసమర్థత కారణంగా దేశ ప్రతిష్ఠ దిగజారుతోందని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. మోదీ హయాంలో బ్యాంకు కుంభకోణాలు జరిగాయని.. లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొటి విదేశాలకు పారిపోయిన నేరస్థులను ఎందుకు పట్టుకోరని మండిపడ్డారు. ‘‘12 లక్షల కోట్ల కుంభకోణాల్లో మీ వాటా ఎంత?’’ అని నిలదీశారు. దేశ చరిత్రలో అత్యంతర అసమర్థ ప్రధాని మోదీ అని.. ఆయన హయాంలో దేశంలో జీడీపీ ఎన్నడు లేనంతగా పడిపోయిందని, ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని నిప్పులు చెరిగారు. ‘‘మోదీ పాలనలోనే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. దేశంలో 38 శాతం పరిశ్రమలు మూతపడ్డాయి. కార్మికులు రోడ్డున పడ్డారు. అరాచకపాలన, విష, విద్వేష రాజకీయాలతో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తరలిపోతున్నాయ’’ని కేసీఆర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘మేకిన్‌ ఇండియా ఓ డైలాగ్‌  మాత్రమే. మనం వాడుతున్న ప్రతి వస్తువు చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే. 


ఇప్పటి వరకూ బీజేపీ చేసిందేమీ లేదు.. లొల్లి లొటారం తప్ప’’ అంటూ ఎద్దేవాచేశారు. మోదీ అవలంబిస్తున్న విధానాలు దేశ ఆర్థిక భవిష్యత్‌ను సర్వనాశనం చేస్తున్నాయని.. బీజేపీయేతర రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెట్టాలనే ఎఫ్‌ఆర్‌బీఎం ఆంక్షలను తీసుకొచ్చారని ఆరోపించారు. ‘‘ఆ రాష్ట్రాలకు ఆర్‌బీఐ డబ్బులు ఇవ్వదని ప్రచారం చేస్తారు. దీంతో రైతుబంధు బంద్‌ అవుతుందని, ఉద్యోగులకు రావని కొన్ని పత్రికల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు’’ అని మండిపడ్డారు. ఇలాంటి పనులతో  రాష్ట్రాల ప్రగతిని దెబ్బతీస్తారా అని ప్రశ్నించారు. ‘‘దేశం బాగుపడాలంటే బీజేపీని తరిమేయాలి. మోదీని మార్చుతాం. ఎల్‌ఐసీని కాపాడుకుంటాం’’ అని వ్యాఖ్యానించారు. మోదీ అరాచకాలను, దుర్మార్గాలను భరించుకుంటూ పోతే దేశం దెబ్బతింటుందన్నారు. ‘‘యువకుల్లారా మీరు ఈ దేశాన్ని కాపాడుకోండి. గతంలో ఇలాంటి రాజకీయ జిమ్మికులతోనే ఎన్టీఆర్‌ను గద్దెదింపారు. చివరకు ప్రజలు మళ్లీ ఎన్టీఆర్‌ను సీఎంగా చేసేంత వరకూ పోరాడారు. దేశంలో కూడా ప్రజలు బీజేపీని గద్దెదింపుతారు’’ అని వ్యాఖ్యానించారు.  


తెలంగాణ అగ్రగామి

బీజేపీ పాలనలో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి లేదని.. ఆ పార్టీ ద్రవ్యోల్బణాన్ని ఆపలేదని,. ధరల పెరుగుదలను నియంత్రించలేదని, రూపాయి పతనాన్ని ఆపడం చేత కాదని.. నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదని కేసీఆర్‌  ధ్వజమెత్తారు. ‘‘మీకన్న రెండింతల అభివృద్ధితో ముం దుకు వెళ్తున్న తెలంగాణ సర్కారును తిట్టి పోతరా? ఇది మీ తెలివా? సంస్కారమా? తెలంగాణ పర్‌ క్యాపిటా? దేశ పర్‌ క్యాపిటా ఎంత తెలుసా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం ఇండియా పర్‌క్యాపిటా రూ. 1,49,848, తెలంగాణ పర్‌ క్యాపిటా రూ.2,78,833. కేంద్రం అసమర్థత వల్లే తెలంగాణ నష్టపోతోంది’’ అని నిప్పులు చెరిగారు. ధరణి, కాళేశ్వరంపై  కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 


కేసీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు

‘‘హైదరాబాద్‌ సభలో ఆయన ఏందో చెప్తడనుకుంటే.. భద్రాచలం, జోగులాంబ ఆ అంబ.. ఈ అంబ ఇవన్నీ చెప్పి దండంపెట్టి పోయిండు ఖతం ఏమీ లేదు’’ అంటూ ప్రధాని మోదీపై కేసీఆర్‌ వ్యంగ్యవ్యాఖ్యలు చేశారు. బీజేపీకి అహంకారం ఎక్కువైందని.. ఆ పార్టీ నాయకులు అప్రజాస్వామ్యంగా.. ఇష్టమొచ్చినట్లు కారు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ‘‘మోకాలెత్తు లేని దద్దమ్మలు కూడా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన ఓ సన్నాసి ఘోరంగా ఓడిపోయి.. ఇక్కడకొచ్చి.. మహారాష్ట్రలో లాగా తెలంగాణలో ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం వస్తుందని చెప్పడం విచిత్రంగా ఉంది. రాష్ట్రంలో మిత్ర పక్షాన్ని కలుపుకొని మొత్తం 110 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎ్‌సకు మద్దతుగా ఉన్నారు. విషయం తెలుసుకొని మాట్లాడాలి’’ అని హెచ్చరించారు. ‘‘శిశుపాలుని లాగా బీజేపీ నూరు తప్పులను నింపుకొంటోంది. ఇక్కడ ఓడిపోయి వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన లక్ష్మణ్‌ చేస్తున్న విమర్శలు ఆశ్చర్యంగా ఉన్నాయి. కట్టప్పనా.. కాకరకాయనా? లక్ష్మణ్‌.. కట్టప్ప కథ రెండో భాగంలో రాజ్యాధికారం కట్టబెట్టేందుకు ఏం చేశారో తెలుసుకో అని సూచించారు.




థ్యాంక్స్‌ టు ఇందిరా గాంధీ

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని కేసీఆర్‌ ఆరోపించారు. ‘‘ఇంత ఘోరమా.. పాలన చేస్తున్నారా? రౌడీయిజం చేస్తున్నారా? జడ్జిలను, సీఎంలను  అవమానిస్తారా? ఇంత అహంకారమెందుకు’’ అంటూనే.. ‘థ్యాంక్స్‌ టు ఇందిరాగాంధీ’ అని వ్యాఖ్యానించారు.


పీయూష్‌ గోల్‌మాల్‌.. నెత్తి లేని సన్యాసి

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పైనా సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. ‘‘పీయూష్‌ గోయల్‌ కాదు పీయూష్‌ గోల్‌మాల్‌ వాడు. నెత్తిలేని సన్యాసి. రైతులను అవమానించి మాట్లాడాడు. నూకలు తినాలని చెబుతాడు. మంత్రి ఇలా మాట్లాడొచ్చా’’ అని నిప్పులు చెరిగారు. 


వాషింగ్‌ పౌడర్‌తో కడిగినట్లు..

ఎన్ని తప్పులు చేసినవారైనా బీజేపీ కండువా కప్పుకోగానే ‘వాషింగ్‌ పౌడర్‌ నిర్మా’ అన్నట్టు వారి తప్పులన్నీ మాఫీ చేసేస్తున్నారని కేసీఆర్‌ కమలనాథులపై ధ్వజమెత్తారు. తెలుగు నాట సుజనా చౌదరి, బెంగాల్‌లో ముకుల్‌ రాయ్‌ తదితర  నేతల పేర్లను ప్రస్తావించి మరీ ఒక వీడియోను ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించారు. అందులో.. సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, సువేందు అధికారి, ముకుల్‌ రాయ్‌, నారాయణ్‌ రాణే, హిమంత విశ్వ శర్మ, జ్యోతిరాదిత్య సిందియా.. ఇలా సీబీఐ, ఈడీ దాడులను ఎదుర్కొన్న పలువురు బీజేపీలో చేరిన దృశ్యాలున్నాయి. వారంతా బీజేపీ కండువా కప్పుకోగానే 64 చెట్ల పసరు తాగినట్లు పవిత్రం అయిపోయారని ఎద్దేవా చేశారు. 

Updated Date - 2022-07-11T08:16:41+05:30 IST