నరసింహ స్వామివారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2021-03-04T18:07:39+05:30 IST

యాదాద్రి భువనగిరి: యాదాద్రి దివ్యక్షేత్రానికి సీఎం కేసీఆర్ గురువారం వెళ్లారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా 14వ సారి

నరసింహ స్వామివారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

యాదాద్రి భువనగిరి: యాదాద్రి దివ్యక్షేత్రానికి సీఎం కేసీఆర్ గురువారం వెళ్లారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా 14వ సారి పాంచ నారసింహుడి దివ్యక్షేత్రానికి కేసీఆర్ వెళ్లడం విశేషం. నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి బాలాలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ పర్యటన కోసం వైటీడీఏ, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భువనగిరి జోన్‌ డీసీపీ కె.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండపైన ఘాట్‌ స్వాగత ద్వారం నుంచి పుష్కరిణి, శివాలయం మీదుగా ప్రధానాలయం వరకు రోడ్డును తీర్చిదిద్దారు.


ప్రధానాలయం, క్యూలైన్లు, ప్రసాదాల కాంప్లెక్స్‌, శివాలయం, పుష్కరిణి పరిసరాల పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. యాదాద్రి లక్ష్మీనారసింహుడి సన్నిధిలో దేవతా వృక్షాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కృష్ణరాతి శిలల అపురూప శిల్ప సంపదతో అలరించే అష్టభుజి ప్రాకార బాహ్య ప్రాకారం ఆలయానికి మరో ఆకర్షణ. అలాగే మాఢవీధుల వెంట హరిహరుల నక్షత్ర వృక్షాలు, సుగంధ, పుష్పాల దేవతా ఉద్యానవనం ఆధ్యాత్మికత, ఆహ్లాదాలకు మేళవింపు కానుంది. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ప్రధానాలయం బాహ్య ప్రాకార మండపానికి ఉత్తర దిశగా మొక్కలను నాటారు.


నృసింహుడి జన్మ నక్షత్రం స్వాతి, తుల రాశికి ప్రాధాన్యం గల పొగడ మొక్కలను, ఆ తర్వాత వరుసలో ముక్కంటి పరమశివుడి మిథున రాశి ప్రకారం కదంబ వృక్షపు మొక్కలు నాటారు. ఒక్కో వరుసలో 40 చొప్పున హరిహరుల జన్మనక్షత్ర పొగడ, కదంబ వృక్షాల మొక్కలతో పాటు వాటి మధ్య అర్చనకు వినియోగించే సుగంధ పుష్పాలు, పచ్చదనం వెలివెరిసేలా ల్యాండ్‌ స్కేప్‌ గార్డెన్లను తీర్చిదిద్దుతున్నారు. అష్టభుజి ప్రాకార మండపం వెంట, గోపురాలకు అభిముఖంగా పాండిచ్చేరి కి చెందిన నాణ్యమైన కుండీల్లో దేవతా ప్రాధాన్యం గల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 


Updated Date - 2021-03-04T18:07:39+05:30 IST