హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-05-24T09:04:42+05:30 IST

జాతీయ రాజకీయాల్లో పాలుపంచుకునేందుకు దేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌ తన పర్యటనను అర్ధాంతరంగా ముగించారు.

హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్‌

  • దేశవ్యాప్త పర్యటన మధ్యలోనే తిరుగుముఖం
  • 27 వరకు పర్యటన అంటూ సీఎంవో ప్రకటన
  • మూడు రోజులకే వెనుదిరిగిన ముఖ్యమంత్రి
  • మళ్లీ 26న బయలుదేరి వెళతారన్న ప్రచారం
  • ప్రధాని హైదరాబాద్‌కు రాకముందే టూర్‌కు!
  • అశోక్‌ గులాటీతో సీఎం కేసీఆర్‌ చర్చలు 


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): జాతీయ రాజకీయాల్లో పాలుపంచుకునేందుకు దేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌ తన పర్యటనను అర్ధాంతరంగా ముగించారు. ఈ నెల 27 వరకు కొనసాగాల్సిన పర్యటనను సోమవారం సాయంత్రానికే ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ నెల 20న ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌.. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) చేసిన ప్రకటన ప్రకారం ఈ నెల 26న బెంగళూరుకు, 27న రాలెగావ్‌ సిద్దికి వెళ్లాల్సి ఉంది. బెంగళూరులో జేడీఎస్‌ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్‌ భేటీ అవుతారని సీఎంవో పేర్కొంది. అక్కడి నుంచి 27న రాలెగావ్‌ సిద్ది పర్యటనకు వెళ్లి.. సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో బేటీ అవుతారని, షిర్డీకి వెళ్లి దర్శనం చేసుకుంటారని తెలిపింది. అక్కడ పర్యటనను ముగించుకుని తిరిగి హైదరాబాద్‌కు వస్తారని వివరించింది.


ఆ తర్వాత 29, 30 తేదీల్లో బెంగాల్‌, బిహార్‌ పర్యటనకు వెళతారని మమతా బెనర్జీ, తేజస్వియాదవ్‌ తదితరులను కలుసుకుంటారని పేర్కొంది. కానీ, ఇంతలోనే కేసీఆర్‌ హైదరాబాద్‌కు తిరిగి రావడం చర్చనీయాంశమైంది. అయితే ఆయన ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూలు ప్రకారమే 26న బెంగళూరుకు వెళతారని చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అదే రోజు హైదరాబాద్‌కు రానున్నందున.. ఆయన రాకముందే కేసీఆర్‌ బయలుదేరతారని అంటున్నారు. ‘‘హైదరాబాద్‌లో పనులున్నాయి.. మళ్లీ ఒకటి రెండురోజుల్లో వద్దాం’’ అని ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ఎంపీలతో కేసీఆర్‌ చెప్పినట్లు తెలిసింది. ఏది ఏమైనా మోదీ హైదరాబాద్‌కు వచ్చేరోజు కేసీఆర్‌ అక్కడ ఉండే అవకాశాలు లేవని టీఆర్‌ఎస్‌ నేత ఒకరు చెప్పారు. జూన్‌ మొదటి వారంలో రాష్ట్రపతి అభ్యర్థిపై ఒక అవగాహనకు రావాలని సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నారని, అదే సమయంలో బీజేపీ కూడా తమ అభ్యర్థిని నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు.


అశోక్‌ గులాటీతో భేటీ..

దేశం ఎదుర్కొంటున్న వ్యవసాయ సమస్యలపై ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్‌ గులాటీతో సీఎం కేసీఆర్‌ సోమవారం భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఆయనతో చర్చలు జరిపారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, సరైన గిట్టుబాటు ధర  కల్పించడం వంటి అంశాలపై వారు చర్చించినట్లు తెలిసింది. అశోక్‌ గులాటీ గతంలో వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌కు చైర్మన్‌ గా వ్యవ హరించారు. పలు ఆహార ధాన్యాలకు కనీస మద్దతు ధరలను పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కాగా, సోమవారం ఉదయం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితుల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో, ఇతర అధికారులతో సీఎం కేసీఆర్‌ చర్చించినట్లు తెలిసింది.


శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌.. పర్యటనలో బిజీబిజీగా గడిపారు. శనివారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌తో ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కేసీఆర్‌ భేటీ అయ్యారు. అదే రోజు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి సర్వోదయ స్కూల్‌ను సందర్శించారు. ప్రముఖ జర్నలిస్టు, ఆర్థికవేత్త, రచయిత ప్రణయ్‌ రాయ్‌తో భేటీ అయ్యారు. ఆదివారం అరవింద్‌ కేజ్రీవాల్‌తో సమావేశమై.. అక్కడి నుంచి ఆయనతో కలిసి మధ్యాహ్నం చండీగఢ్‌కు బయలుదేరి వెళ్లారు. పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌ నివాసంలో ముగ్గురు సీఎంలు సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలు, దేశాభివృద్ధి, రాష్ట్రాల పాత్ర తదితర అంశాలపై చర్చించుకున్నారు. దీనికి ముందు ఠాగూర్‌ స్టేడియంలో రైతు కుటుంబాలు, సైనికుల కుటుంబాలను ఉద్దేశించి కేసీఆర్‌ ప్రసంగించారు. వారికి పరిహారం చెక్కులను అందజేశారు. 



Updated Date - 2022-05-24T09:04:42+05:30 IST