ఆ దొంగలు కొంటలేరు!

ABN , First Publish Date - 2021-12-03T07:02:56+05:30 IST

వానాకాలంలో వరి సాగు చేసి, యాసంగిలో మాత్రం కచ్చితంగా పంట మార్పిడి చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ రైతులకు సూచించారు. వనపర్తి జిల్లాలో ఓ రైతు ‘సార్‌ ధాన్యం కొనట్లేదు’ అని చెప్పగా.. ‘‘ఆ దొంగలు కొంటలేరు.. ఏం చేద్దాం?’’ అని కేసీఆర్‌ అన్నారు.

ఆ దొంగలు కొంటలేరు!

  • యాసంగిలో వరి సాగు చేయొద్దు. వడ్లు కొనే పరిస్థితి లేదు
  • పంట మార్పిడి చేసుకోవాల్సిందే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టీకరణ
  • ఆరుతడి పంటల సాగుపై ఆరా
  • వేరుశనగ, మినుము రైతులతో మాటామంతి 
  • గద్వాల ఎమ్మెల్యే కుటుంబానికి పరామర్శ
  • జడ్చర్లలో సీఎం కాన్వాయ్‌ని అడ్డుకోబోయిన బీజేవైఎం నాయకులు
  • ఉభయ సభల్లో టీఆర్‌ఎస్‌ వాకౌట్‌
  • ధాన్యంపై కిషన్‌రెడ్డి మాటలను పీయూష్‌ గోయల్‌తో చెప్పించండి
  • ఉప్పుడు బియ్యం కొనాలి: కేకే
  • రైతు సమస్యలపై కేంద్రానికి అవగాహన లేదు: ఎంపీ నామా


గద్వాల, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో వరి సాగు చేసి, యాసంగిలో మాత్రం కచ్చితంగా పంట మార్పిడి చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ రైతులకు సూచించారు. వనపర్తి జిల్లాలో ఓ రైతు ‘సార్‌ ధాన్యం కొనట్లేదు’ అని చెప్పగా.. ‘‘ఆ దొంగలు కొంటలేరు.. ఏం చేద్దాం?’’ అని కేసీఆర్‌ అన్నారు. యాసంగిలో వడ్లు కొనే పరిస్థితి లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ పంట మార్పిడి చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి ఇటీవల మరణించారు. సీఎం కేసీఆర్‌ గురువారం ఆయన్ను పరామర్శించేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం, కొత్తకోట మండలం విలియంకొండ వద్ద కాన్వాయ్‌ను ఆపి వేరుశనగ, మినుము రైతులతో మాట్లాడారు. ఆరుతడి పంటల సాగులో కష్టనష్టాలు, పెట్టుబడులు, పంటలకు వస్తున్న ధరల గురించి తిప్పాయిపల్లికిచెందిన రైతు మహేశ్వర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.


యాసంగిలో వరి వేయొద్దని, పంటమార్పిడి చేస్తే లాభాలతో పాటు నీటి ఎద్దడి సమస్యలు కూడా ఏర్పడవని కేసీఆర్‌ సూచించారు. ప్రస్తుతం మినుములకు ప్రభుత్వ మద్దతు ధర రూ.6 వేలు ఉండగా మరో రూ.1000 అదనంగానే పలుకుతుందని రైతు చెప్పడంతో ఎకరాకు ఎంత పెట్టుబడి అవుతుందని సీఎం ప్రశ్నించారు. రూ.20 వేల వరకు అవుతుందన్నారు. దిగుబడి 12 క్వింటాళ్ల వరకు వస్తుందని, ఖర్చులన్నీ పోను ఎకరాకు రూ.20 వేలు మిగులుతాయని రైతు తెలిపారు. ఎన్ని నీటి తడులు కావాలని కేసీఆర్‌ అడగ్గా.. ఆరు అవసరమవుతాయని మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఆరుతడి పంటలు వేస్తే ఇబ్బందులు లేవా అని సీఎం ప్రశ్నించగా.. ఏమీ లేవని, లాభాలు ఉంటాయని రైతు బదులిచ్చారు. అలాగే వేరుశనగ, మినుము పంటల సాగు, దిగుబడి, మార్కెటింగ్‌, పెట్టుబడికి సంబంధించిన వివరాలను తన పక్కనే ఉన్న వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొత్తకోట మండలం విలియంకొండ వద్ద వేరుశనగ పంటను పరిశీలించిన కేసీఆర్‌ అక్కడ గిరిజన రైతులతో మాట్లాడారు. కచ్చితంగా ప్రతి యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. వెంకటయ్య అనే రైతు ధాన్యం కొనుగోలు చేయడం లేదని కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ‘ఆ దొంగలు కొంటలేరు.. ఏం చేద్దాం. యాసంగిలో వడ్లు కొనే పరిస్థితి లేదు’ అని చెప్పారు. 


ఎమ్మెల్యే కుటుంబానికి పరామర్శ

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్‌ పరామర్శించారు. ఎమ్మెల్యే తండ్రి వెంకట్రామిరెడ్డి మరణించగా, గత నెల 23న దశదిన కర్మ నిర్వహించారు. ఆ సమయంలో కేసీఆర్‌ ఢిల్లీలో ఉండడంతో హాజరు కాలేకపోయారు. దీంతో గురువారం గద్వాలలోని ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన సీఎం.. వెంకట్రామిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే తల్లి రేవతమ్మ, భార్య జ్యోతి, సోదరులు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలిపారు. ఉన్నత విద్యాశాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వెంకట్రామిరెడ్డి తన వృత్తి జీవితంలో ఎంతో మంది విద్యార్థుల ప్రేమను సంపాదించుకొని చిరస్మరణీయులయ్యారని కేసీఆర్‌ చెప్పారు. చనిపోయే కొద్దిరోజుల ముందు వరకూ వ్యవసాయమే ప్రాణంగా పనిచేశారని ఎమ్మెల్యే సీఎంకు వివరించారు. 


సీఎం కాన్వాయ్‌ని అడ్డుకునే యత్నం

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ని బీజేవైఎం నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి గద్వాలకు రోడ్డు మార్గంలో వెళ్తుండగా.. ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ జడ్చర్ల సమీపంలో బీజేవైఎం కార్యకర్తలు రోడ్డుపైకి రాబోయారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. 


4న హైదరాబాద్‌లో ఐఏఎంసీ సదస్సు 

హాజరు కానున్న ఎన్వీ రమణ, కేసీఆర్‌

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 4న హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హెచ్‌ఐసీసీలో ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) హైదరాబాద్‌ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాల్గొననున్నారు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ స్వాగతోపన్యాసం చేయనుండగా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు అధ్యక్ష ప్రసంగం చేస్తారు. సదస్సు అనంతరం రెండు ప్యానెల్‌ చర్చలుంటాయి. ఏడీఆర్‌ (ఆల్టర్నేటివ్‌ డిస్ప్యూట్‌ రిజొల్యూషన్‌) ప్రక్రియపై జరిగే చర్చకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ సుభా్‌షరెడ్డి, ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ పాత్రపై జరిగే చర్చకు సుప్రీంకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి నేతృత్వం వహిస్తారు. ముగింపు కార్యక్రమాల్లో మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొంటారు. 

Updated Date - 2021-12-03T07:02:56+05:30 IST