kavithaను ఎంపీ చేసేందుకు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని KCR రంగంలోకి దింపారా..!?

ABN , First Publish Date - 2021-07-18T21:00:27+05:30 IST

కవితను మళ్లీ ఏంపీ చేసేందుకే థర్టీఇయర్స్‌ ఇండస్ట్రీని కేసీఆర్‌ సీన్‌లోకి తెచ్చారా?..

kavithaను ఎంపీ చేసేందుకు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని KCR రంగంలోకి దింపారా..!?

సైకిల్‌ దిగి కారులోకి దూరిన రమణకు బుగ్గకారు వస్తుందా? ఒకప్పుడు ఎంపీగా గెలిచి జెయింట్‌ కిల్లర్‌ అనిపించుకున్న రమణ మళ్లీ ఢిల్లీ పాలిటిక్స్‌కు వెళ్తారా? లేదంటే ఎమ్మెల్సీ పదవిలో భవన్‌ కేంద్రంగా బాధ్యతలు నిర్వర్తిస్తారా? రా రమ్మని పిలిచిన రమణ కోసమే ఇన్నాళ్లు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఆగిందా? హుజురాబాద్‌ గులాబీ దళంలో ఆయన పాత్రేమిటి? కవితను మళ్లీ ఏంపీ చేసేందుకే థర్టీఇయర్స్‌ ఇండస్ట్రీని కేసీఆర్‌ సీన్‌లోకి తెచ్చారా? ఇవీ రమణ పసుపు కండువాను పక్కనపెట్టి గులాబీ దండులోకి చేరిపోయాక ఆయనకు అనుకూలంగా, వ్యతిరేకంగా వస్తున్న విశ్లేషణలు. ఇందులో మున్ముందు ఏది నిజమవుతుందో..? అనే విషయాలను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


కేసీఆర్ మాట కాదనలేక..!

జగిత్యాల ఎమ్మెల్యేగా, కరీంనగర్‌ ఎంపీగా రెడ్డి, వెలమ పాలిటిక్స్‌కు ఛాలెంజ్‌ విసిరి జెయింట్‌ కిల్లర్‌ అనిపించుకున్న రమణ తెలుగుదేశంలో చంద్రబాబు చలవతో వెలుగువెలిగారు. రాష్ట్ర విభజన తర్వాత తన నెంబర్‌టూగా ప్రకటించి రమణను  తెలంగాణ పార్టీకి బాస్‌ని చేశారు చంద్రబాబు. ఆ గౌరవంతో ఇన్నాళ్లూ తెలుగుదేశం నుంచి బయటకు రాలేకపోయారు రమణ. పార్టీ పదవి తప్ప చట్టసభల్లో ప్రజాప్రతినిధిగా రమణకు అవకాశం లేకుండా పోయింది. ఆయనతో కలిసి నడిసిన తెలుగుదేశం మిత్రులు వివిధ హోదాల్లో పదవులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక లాభం లేదనుకుని ఎప్పటినుంచో పిలుస్తున్న కేసీఆర్‌ మాటను కాదనలేక కారెక్కేశారు రమణ. ఇదీ సూక్ష్మంగా రమణ పార్టీ మారడం వెనకున్న ఇన్‌సైడ్‌ స్టోరీ అనుకుంటున్నారు పొలిటికల్‌ విశ్లేషకులు.


రమణ మంత్రి కాబోతున్నారా..!?

రమణ పార్టీ మారే విషయంలో క్లారిటీగా ఉన్న రావుగారి ఫ్యామిలీ ఎప్పటినుంచో ధీమాగా ఉందనేందుకు కొన్నాళ్ల క్రితం ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలే నిదర్శనమనే టాక్‌ వస్తోంది. జగిత్యాలలో పార్టీ కార్యకర్తల సమావేశంలో కవిత చేసిన వ్యాఖ్యలు రమణ వస్తున్నారనే హింట్‌ ఇచ్చేందుకేనని ఇప్పుడక్కడ అనుకుంటున్నారట. టీఆర్‌ఎస్‌లో బలమైన నేతగాగుర్తింపు పొందిన ఈటెల రాజేందర్‌ ముదిరాజ్‌ బీజేపీలో చేరాల్సిరావడం, ఇప్పటికే కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ బీజేపీ స్టేట్‌ చీఫ్‌గా కొనసాగడం, నిజామాబాద్‌లో కవితను ధర్మపురి అర్వింద్ ఓడించడం.. ఈ దూరమైన వర్గాలన్నీ బీసీవర్గాలుగా ఉండటంతో బలహీనవర్గాల బలం పెంచుకునేందుకు రమణను ఓ అస్త్రంలా వాడుకోవచ్చని గులాబీ దళపతి బావించారట. పద్మశాలి సామాజిక వర్గం నుంచి ఓ ఎమ్మెల్సీ పదవి ఇస్తామని గతంలోనే కేసీఆర్‌ చెప్పారు. ఇప్పుడు రమణ పార్టీలోకి వచ్చేయడంతో  ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రి పదవిపై కూడా ఓ క్లారిటీ వచ్చినట్లు టాక్‌ వస్తోంది. హుజురాబాద్‌ ఎన్నికల్లో ఆయన సేవలు ఉపయోగించుకుని బహుమతిగా ఎమ్మెల్సీ ఆ తర్వాత మంత్రి పదవి బోనస్‌ ఇస్తారనే ప్రచారం రమణ వర్గం అప్పుడే మొదలుపెట్టింది.


థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ..!

మాజీ మంత్రి రమణ ముప్పైఏళ్ల రాజకీయ జీవితంలో వివాదాలు లేవనే చెప్పొచ్చంటారు ఆయన్ని గమనించే నేతలు. బీసీల పార్టీగా మంచి గుర్తింపు ఉన్న తెలుగు దేశంలో  ఆహోదాలోనే ఎదిగారు రమణ. ఇప్పుడు దొరల పార్టీ అని విమర్శలు ఎదుర్కొనే టీఆర్‌ఎస్‌లో ఆయనకు అంత ప్రాధాన్యత ఉంటుందా అనే చర్చ కూడా నడుస్తోందట. గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీసీలు పార్టీకి దూరమవుతున్నారనే విశ్లేషణలు చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన గులాబీ పార్టీకి బలహీనవర్గాల నేత కోసం ఎదురు చూస్తున్నారట. ఇందుకోసం రమణను 2018 ఎన్నికల ముందునుంచే సంప్రదించారట. ఎమ్మెల్యే సీటుతో సహా మంత్రి పదవి ఇస్తామనీ ఆఫర్‌ ఇచ్చారట గులాబీ అధిపతి కేసీఆర్‌. అయితే చంద్రబాబు ఇచ్చిన స్వేచ్చముందు ఇదేమంత పెద్దవిషయం కాదనుకున్న రమణ ఇన్నాళ్లూ ఆగారట. అయితే  కరీంనగర్‌, నిజామాబాద్‌లో బీజేపీ నుంచి బీసీ నేతలు ఎంపీలుగా గెలువడం, ఏకంగా కూతురు కవిత లోక్‌సభ సీటును అనూహ్యంగా ఓడిపోవడంతో గట్టిగా నిర్ణయించుకున్న కేసీఆర్‌ ఎప్పటి నుంచో రమణ కోసం రాయభారం పెట్టారట. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దోస్తానాతో రాయభారం ఫలించి ట్రస్ట్‌భవన్‌ నుంచి తెలంగాణభవన్‌కు మకాం మార్చారట రమణ.


టాక్ ఇదీ..!

పార్టీ మారే సమయంలో రమణకు కేసీఆర్‌ స్పష్టమైన హామీలు ఇచ్చారనే టాక్‌ నడుస్తోంది. సౌమ్యుడిగా పేరున్న రమణను బీసీకార్డుగా వాడుకోవాలని కేసీఆర్‌ ఫిక్స్‌ అయ్యారట. ఉత్తర తెలంగాణలో బీసీ సమ్మేళనాలను నిర్వహించే బాధ్యత రమణకే అప్పజెప్పుతారనే మాటలు వినిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో నాన్‌ రిజర్వుడు కోటాలో ఉన్న కరీంనగర్‌, నిజామాబాద్‌లో రెండు వెలమ సిట్టింగ్‌ సీట్లు ఇటు వినోద్‌ కుమార్‌, అటు కవిత రూపంలో ఓడిపోయింది టీఆర్‌ఎస్‌. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో భాగంగా ఉన్న ఈ రెండు సీట్లు తిరిగి తమఖాతాలో వేసుకునేందుకు రమణను వాడుకోవాలనే ఉద్దేశంతో ఉన్న కేసీఆర్‌ బీసీ అస్త్రాన్ని బీసీలపైనే ప్రయోగించాలని చూస్తున్నాడనే టాక్‌ పొలిటికల్‌ సర్కిల్స్‌లో  వినిపిస్తోందట. రమణకు ఎమ్మెల్సీ పదవి అనేది ఫిక్స్‌ అయిపోయిందని ఆయన కోరుకుంటే మంత్రి పదవి ఇచ్చేందుకు కేసీఆర్‌ సుముఖంగా ఉన్నారనే మాటలు టీఆర్‌ఎస్‌లో వినిపిస్తున్నాయి. మరోవైపు ఎంపీగాను ప్రయోగం చేసే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా సాగుతోంది.


కాకరేపిన తాజా పరిణామాలు!

తెలంగాణలో రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడం, వైఎస్‌ తనయ షర్మిల కొత్త పార్టీ పెట్టడం, ఈటెల రాజేందర్‌ టీఆర్ఎస్ పార్టీలో నుంచి బహిష్కరించడం వంటి పరిణామాలు రాజకీయాల్లో కాకరేపాయి. ఉత్తర తెలంగాణ కేంద్రంగా ఎదిగిన టీఆర్‌ఎస్‌కు రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు వస్తాయనే అంచనాతో బలం పుంజుకునేందుకు ఆపరేషన్‌ ఆకర్ష్‌ చేపట్టిందనే మాట వినిపిస్తోంది. ఇన్నాళ్లూ ప్రజా ప్రతినిధులకు గాలం వేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఇక మున్ముందు మరింతమంది పార్టీ నేతలను ఆకర్శించే ప్రయత్నంలో ఉందట. 



Updated Date - 2021-07-18T21:00:27+05:30 IST