Abn logo
Jun 22 2021 @ 16:10PM

వాసాలమర్రికి మరో 20సార్లు వస్తా: సీఎం కేసీఆర్

యాదాద్రి: వాసాలమర్రిని సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఆ గ్రామస్తులతో కలిసి సీఎం కేసీఆర్‌ సహపంక్తి భోజనం చేశారు. అనంతరం వాసాలమర్రిలో నిర్వహించిన  గ్రామ సభలో  సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊరికి కేవలం ట్రాక్టర్లు ఇచ్చి వెళ్లిపోతే సరిపోదన్నారు. వాసాలమర్రిలో ఒక ప్రత్యేకమైన పని జరగాలని చెప్పారు. వాసాలమర్రికి మరో 20 సార్లు వస్తానని వ్యాఖ్యానించారు. వాసాలమర్రిలో కేవలం నలుగురే తనకు పరిచయమయ్యారన్నారు. ఈ గ్రామం ఏడాదిలో బంగారు వాసాలమర్రి కావాలని సూచించారు.


ఊరిలో పోలీసు కేసులు ఉండకుండా చేయాలని, సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. వాసాలమర్రి రూపురేఖలు మారాలని పేర్కొన్నారు. ఊరిలో ఒకరంటే మరొకరికి ప్రేమ ఉండాలన్నారు. గ్రామస్తుల మధ్య ఐకమత్యం ఉండాలని పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని సూచించారు. అంకాపూర్‌లో గ్రామ అభివృద్ధి కమిటీ ఉందన్నారు. సాక్ష్యాత్తు గ్రామ సర్పంచ్‌కి కూడా ఫైన్‌ వేశారని గుర్తు చేశారు. గ్రామంలో ప్రతి దళితవాడకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటానని కేసీఆర్‌ తెలిపారు.