పోడు భూముల రైతులకు శుభవార్త

ABN , First Publish Date - 2021-10-24T01:36:41+05:30 IST

రాష్ట్రంలో పోడు భూములన సాగు చేసుకుంటున్న గిరిజనులు, తదితరుల నుంచి

పోడు భూముల రైతులకు శుభవార్త

హైదరాబాద్: రాష్ట్రంలో పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులు, తదితరుల నుంచి నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు క్లెయిమ్స్ స్వీకరించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పోడుభూముల సమస్య పరిష్కారం, అటవీ రక్షణ - పునరుజ్జీవం, హరితహారం అంశాలపై కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమం, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖల ఉన్నతాధికారులతో శనివారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు.


నవంబర్ 8 లోగా వివిధ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం గ్రామ కమిటీల నియామకం చేపట్టాలన్నారు. రెండు, మూడు గ్రామాలకొక నోడల్ అధికారిని నియమించాలన్నారు. సబ్ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ వంటి 12 జిల్లాల్లోనే 87 శాతం పోడు భూముల ఆక్రమణ ఉందని సీఎం అన్నారు. సమావేశంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతీ రాథోడ్,  అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 


పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ అంశాలపై అన్ని జిల్లాల్లో అఖిల పక్ష సమావేశాలను నిర్వహించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఇప్పటివరకు పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులు తదితరులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కులు కల్పిండంతో పాటు, ఆ తర్వాత అటవీ భూమి ఇంచు కూడా ఆక్రమణకు గురి కాకూడదనే విషయంలో అఖిలపక్ష నాయకుల నుండి ఏకాభిప్రాయం తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితర ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలన్నారు.  గ్రామాల్లో సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు అడవుల రక్షణను ఒక బాధ్యతగా తీసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.

Updated Date - 2021-10-24T01:36:41+05:30 IST