నీటి పారుదలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

ABN , First Publish Date - 2021-08-07T04:11:53+05:30 IST

కృష్ణా గోదావరి బోర్డుల పరిథిని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నిర్దేశించిన నేపథ్యంలో

నీటి పారుదలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నిర్దేశించిన నేపథ్యంలో, త్వరలో ఏర్పాటయ్యే బోర్డుల సమావేశాల్లో తెలంగాణ  అనుసరించాల్సిన వ్యూహం పై ప్రగతి భవన్‌లో శుక్రవారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అత్యున్నత సమీక్షా సమావేశం జరిగింది.  తెలంగాణకు హక్కుగా కేటాయించబడిన న్యాయమైన నీటివాటాలకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులను క్షుణ్ణంగా మరోసారి ఈ సమావేశంలో సమీక్షించారు. 


కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలను క్షుణ్ణంగా సమీక్షించారు. గోదావరి కృష్ణా జలాల్లో ఉభయ రాష్ట్రాలకుండే నీటివాటాల గురించి విసృతంగా సమావేశంలో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర సాగునీటి హక్కుల కోసం, తెలంగాణ వ్యవసాయం, రైతాంగం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వెనకడుగు వేసే ప్రసక్తేలేదని, అందుకు ప్రభుత్వ యంత్రాంగం పట్టుదలతో కృషి చేయాలని సీఎం మరోసారి స్పష్టం చేశారు. బోర్డుల సమావేశాల్లో తెలంగాణ వాణిని గట్టిగా వినిపించాలని ఉన్నతాధికారులకు సూచించారు. తిరిగి ఇదే అంశంపై ఆదివారం చర్చను కొనసాగించాలని సమావేశం నిర్ణయించింది. 


ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ రావు , ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, హరిరామ్, సీఎం వోఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, సీనియర్ అడ్వొకేట్ రవీందర్ రావు, ఇరిగేషన్ శాఖ అంతర్రాష్ట విభాగం సీఈ మోహన్ కుమార్, ఎస్ఈ కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-07T04:11:53+05:30 IST