చెరువులు నింపండి

ABN , First Publish Date - 2020-07-13T08:46:47+05:30 IST

రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు ఊపందుకున్న తరుణంలో ప్రాజెక్టుల నీటితో చెరువులను నింపాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.

చెరువులు నింపండి

  • ప్రాజెక్టుల నీళ్లు తొలుత కుంటలకే
  • తర్వాత రిజర్వాయర్లకు, ఆయకట్టుకు
  • చెరువులు, చెక్‌ డ్యాంలు ఏడాదంతా నీటితో
  • సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌  ఆదేశాలు
  • భూగర్భజలం పెరిగి బోర్ల కింద ఉధృత సాగు 
  • ఇరిగేషన్‌ విభాగాలన్నీ ఒకే గొడుగు కిందకు


హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు ఊపందుకున్న తరుణంలో ప్రాజెక్టుల నీటితో చెరువులను నింపాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. చెరువులు కళకళలాడిన తర్వాత రిజర్వాయర్లు నింపాలని, అనంతరం ఆయకట్టుకు నీటిని ఆందించాలని స్పష్టం చేశారు. అన్ని ప్రాజెక్టుల పరిఽధిలో చివరి ఆయకట్టు వరకు నీరు అందించడానికి అనువుగా కాల్వల సామర్థ్యం ఉందా.. లేదా? అనేది మరోసారి పరిశీలించాలని.. అవసరమైతే నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలను సంపూర్ణంగా వినియోగించుకొని, వీలైనంత ఎక్కువ సాగు భూములకు నీటిని అందించే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. వివిధ ప్రాజెక్టుల కాల్వల ద్వారా ఇప్పటి వరకు సాగునీరు అందని ప్రాంతాలను గుర్తించి, వాటికి సాగునీరు అందించే ప్రణాళికపై కేసీఆర్‌ ఆదివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా ఎస్సారెస్పీ వరకు రెండు టీఎంసీల నీటిని తరలించే వెసులుబాటు కలిగిందని, ఫలితంగా ఎస్సారెస్పీ పరిధిలో 30 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండే విధంగా చర్యలు ఉండాలని సూచించారు. వరద కాలువ, కాకతీయ కాలువ, అప్పర్‌ మానేరు, మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు ఏడాది పొడవునా నీటితో జీవధారలుగా మారతాయనని పేర్కొన్నారు.


ఎస్సారెస్పీలో ఎప్పుడూ 25 నుంచి 30 టీఎంసీల నీటిని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎస్సారెస్పీ పరిధిలోని వరద కాలువ, కాకతీయ కాలువ మధ్య దాదాపు 139 చెరువులు ఉన్నాయని, వాటిలో కొన్నింటికి నీరు అందడం లేదని  ప్రస్తావించారు. అలాంటి చెరువులను గుర్తించి వరద కాలువకు వీలైనన్ని ఎక్కువ ఓటీలు పెట్టి ఆ చెరువులను నింపాలని, ఈ పని రాబోయే మూడు, నాలుగు నెలల్లో పూర్తి కావాలన్నారు. అటు ఎస్సారెస్పీ నుంచి, ఇటు కాళేశ్వరం నుంచి వరద కాలువకు నీరందే అవకాశం ఉండటంతో కాలువ 365 రోజుల పాటు నీటితో ఉంటుందని, అందుకే వరద కాలువ ద్వారా ఇప్పటి వరకు  ఇతర పథకాలతో నీరందని ప్రాంతాలకు నీటిని ఇవ్వాలన్నారు. ఎల్లంపల్లి నుంచి 90 వేల ఎకరాల్లోపే ఆయకట్టుకు నీరందించడం సాధ్యమవుతుందని,  మిగతా ఆయకట్టుకు ఎస్సారెస్పీ ద్వారా నీటిని అందించాలని ఆదేశించారు. కృష్ణా నదిలో కూడా ఎక్కువ నీటి లభ్యత ఉండే అవకాశం ఉందని, నారాయణపూర్‌  నుంచి నీరు వదలడంతో వెంటనే జూరాల, భీమా-2 లిప్టుల ద్వారా నీటిని చెరువుల్లోకి తరలించాలని సూచించారు. రామన్పాడు రిజర్వాయర్‌ నింపాలని, కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ డీ 82 డిస్ర్టిబ్యూటరీ కెనాల్‌ పనులను వేగంగా పూర్తి చేసి, ఈ ఏడాదే 30 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని సూచించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో నీటిని నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్‌ నిర్మించాలని, లేదంటే చెరువుల సామర్థ్యం పెంచాలని  చెప్పారు. 


ప్రాజెక్టు వారీగా నిర్వహణ ప్రణాళిక 

సాగునీటిని అందించడం కోసం ప్రాజెక్టు వారీగా నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సీఎంసూచించారు.. సాగునీటి వ్యవస్థ సమర్థ నిర్వహణ  కోసం నీటిపారుదల శాఖను పునర్విభజించాలన్నారు. ఎక్కువ జోన్లను ఏర్పాటు చేసి, ప్రతీ జోన్‌కు ఒక సీఈని బాధ్యుడిగా నియమించాలని పేర్కొన్నారు. సీఈ పరిఽధిలోనే ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెరువులు ఉండాలన్నారు. గతంలో మాదిరిగా భారీ, మధ్య తరహా, చిన్న తరహా, ఐడీసీ అని నాలుగు విభాగాలుగా కాకుండా నీటి పారుదల శాఖ అంతా ఒకే విభాగంగా పనిచేయాలన్నారు. 


కోటిపైగా ఎకరాలకు నీరందించే గొప్ప వ్యవస్థ 

గోదావరి, కృష్ణా నదులపై ఎంతో వ్యయం చేసి, ఎన్నో అవరోధాలను అధిగమించి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను నిర్మిస్తోందని.. పెండింగ్‌ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసిందని సీఎం కేసీఆర్‌  చెప్పారు. కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప వ్యవస్థ ఏర్పడిందని, దాన్ని సమర్థంగా నిర్వహించుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. ఉద్యమ స్ఫూర్తితో చెరువులను పునరుద్ధరించామని, ఈ ఫలితం ప్రజలకు అందాలంటే వీలైనంత ఎక్కువ సాగు భూములకు నీరు అందించడమే మార్గం అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నీటి పారుదల రంగానికి అత్యధిక  ప్రాధాన్యమిచ్చిందని, కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల వల్ల ఇప్పుడు నీటి లభ్యత పుష్కలంగా ఏర్పడిందన్నారు. తెలంగాణలో చెరువులు, చెక్‌ డ్యాంలు ఎప్పడూ నీటితో నిండుగా ఉండాలని, అప్పుడే భూగర్భ జలమట్టం పెరిగి రైతులు దాదాపు రూ. 45 వేల కోట్ల వ్యయం చేసి వేసుకున్న బోర్లకు నీరందుతుందన్నారు.

Updated Date - 2020-07-13T08:46:47+05:30 IST