తిరుగే లేదనుకున్న కేసీఆర్.. సీన్ రివర్స్..!

ABN , First Publish Date - 2021-12-28T18:08:20+05:30 IST

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడున్నరేళ్లు అయింది. ఇంతకాలం పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు కేసీఆర్ ప్రియారిటీ ఇస్తూ వచ్చారు.

తిరుగే లేదనుకున్న కేసీఆర్.. సీన్ రివర్స్..!

టీఆర్ఎస్‌లో ఉద్యమకారులకు స్థానం లేదన్న విమర్శలకు కేసీఆర్‌ చెక్‌ పెడుతున్నారా? ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నేతలకు ఇప్పుడెందుకు పదవులు కట్టబెడుతున్నారు? అసంతృప్తిగా ఉన్న నాయకులు పక్కచూపులు చూడకుండా పక్కా స్కెచ్‌తోనే పదవులు ఇస్తున్నారా? సడెన్‌గా గులాబీ బాస్‌ వైఖరిలో మార్పు రావడానికి కారణమేంటి? అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


ఉద్యమం వేరు, రాజకీయం వేరని ఆయన స్టయిల్‌లో కౌంటర్ 

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడున్నరేళ్లు అయింది. ఇంతకాలం పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు కేసీఆర్ ప్రియారిటీ ఇస్తూ వచ్చారు. ఉద్యమకారులను పట్టించుకోవడం లేదన్న  విమర్శలను బేఖాతరు చేస్తూ వచ్చారు. దీనిపై అడిగితే ఉద్యమం. వేరు, రాజకీయం వేరు అని ఆయన స్టయిల్‌లో కౌంటర్ ఇచ్చేవారు. దీంతో ఉద్యమ సమయం నుంచి పార్టీలో పదవులు వస్తాయని ఆశలు పెట్టుకున్న నేతలకు నిరాశే మిగిలింది. ఇక పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్ కోల్పోతామని పక్క చూపులు చూస్తున్న నేతలకు బీజేపీ ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఈ తరుణంలో ఇప్పటికే చాలామంది నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.


గులాబీ పార్టీకి కొరకరాని కొయ్యలా మారిన బీజేపీ..

ఇక గులాబీ పార్టీకి రాష్ట్రంలో బీజేపీ కొరకరాని కొయ్యలా మారింది. ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ముఖ్య నేతలంతా టీఆర్ఎస్ అసంతృప్త వాదులకు గాలం వేసే పనిలో పడ్డారు. హుజురాబాద్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌ నేతలు సైతం రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెరుగుతోందని బహిరంగంగానే మాట్లాడుతున్నారు. దీంతో ఇంకా మేల్కొనకపోతే తమ పుట్టి మునుగుతుందని గ్రహించిన గులాబీ బాస్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఉద్యమకారులకు పదవులిచ్చి వలసలు నివారించే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.


ఉద్యమ నేతలకు పదవులిచ్చి ఉత్సాహం నింపుతున్న కేసీఆర్

టీఆర్ఎస్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టాక పెద్దఎత్తున నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని పార్టీ నేతలు భావించారు. కానీ కొన్ని కీలక పదవులు మాత్రమే భర్తీ చేసి ఆశావహులను నైరాశ్యంలోకి నెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఈ నేపథ్యంలో విద్యార్థి, ఉద్యమ నేతలకు పదవులిచ్చి వారిలో ఉత్సాహం నింపడంతో పాటు పక్కచూపులు చూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థి, ఉద్యమ నాయకులకు పదవులు కట్టబెడుతున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జల నగేష్, ఓయూ జేఏసీ నేతలు దుదిమెట్ల బలరాజ్, మన్నే క్రిశాంక్, పార్టీ సాంస్కృతిక విభాగంలో కీలకంగా పనిచేసిన సాయిచంద్, ఉద్యమకారుడు జూలూరి గౌరీ శంకర్ లాంటి వారికి పదవులిచ్చి విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.


తిరుగే లేదని భావించిన కేసీఆర్ కు..సీన్ రివర్స్ అయ్యింది..

ఇన్నాళ్లు తమకు తిరుగే లేదని కేసీఆర్ భావించారు. తన మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. కేసీఆర్‌కు తత్వం బోధపడుతోంది. మూడోసారి అధికారంలోకి రావాలంటే పార్టీ ఇంటర్నల్ సమస్యలు అధిగమించాలని ఆయన డిసైడ్ అయ్యారు. ముందు ఇంటిని చక్కబెట్టుకుని.. తర్వాత ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవాలని భావిస్తున్నారు గులాబీ బాస్. పార్టీ కోసం హార్డ్‌కోర్‌గా పనిచేసే విద్యార్థి, ఉద్యమకారులను పదవులతో యాక్టివ్ చేసి గులాబీ దళంలో అసంతృప్త రాగాలు వినిపించకుండా వ్యూహాలు అమలు చేస్తున్నారు. మరి కేసీఆర్‌ చర్యలు ఉద్యమ నేతలను ఎంతవరకు సంతృప్తి పరుస్తాయో చూడాలి. 

Updated Date - 2021-12-28T18:08:20+05:30 IST