ఇంత అసహనం ఎందుకు?

ABN , First Publish Date - 2020-04-11T06:08:53+05:30 IST

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఇటీవల మీడియా సమావేశంలో ప్రతిపక్షనేతలపై, మీడియా సంస్థలపై వాడిన భాష, ఉపయోగించిన పదజాలం ఆక్షేపణీయంగా ఉంది. ప్రజల ఆరోగ్యానికి ముప్పు వస్తున్నదని...

ఇంత అసహనం ఎందుకు?

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఇటీవల మీడియా సమావేశంలో ప్రతిపక్షనేతలపై, మీడియా సంస్థలపై వాడిన భాష, ఉపయోగించిన పదజాలం ఆక్షేపణీయంగా ఉంది. ప్రజల ఆరోగ్యానికి ముప్పు వస్తున్నదని హెచ్చరించిన ప్రతిపక్షాలను; వైద్య బృందాలకు, పోలీసులకు వ్యక్తిగత భద్రతా కిట్లు లేవనే వాస్తవాన్ని చెప్పిన మీడియాను తూలనాడడం ‌ముఖ్యమంత్రికి తగదు. 


ప్రజాస్వామ్య దేశంలో ప్రధానమంత్రి అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, గ్రామ సర్పంచ్‌ అయినా రాజ్యాంగ వ్యవస్థకు ప్రతినిధులు. రాజ్యాంగ వ్యవస్థకు ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు బాధ్యతలను విస్మరించి, అధికార అహంకారంతో మాట్లాడవచ్చునా? ప్రతిపక్షనేతలపైనా, మీడియాపైనా అనుచిత భాషా ప్రయోగం చేయవచ్చునా? ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల విలేఖర్ల సమావేశంలో ప్రతిపక్షనేతలపై, మీడియా సంస్థలపై వాడిన భాష, ఉపయోగించిన పదజాలం ఆక్షేపణీయంగా ఉంది. ప్రజల ఆరోగ్యానికి ముప్పు వస్తున్నదని హెచ్చరించిన ప్రతిపక్షాలను; వైద్య బృందాలకు, పోలీసులకు వ్యక్తిగత భద్రతా కిట్లు లేవనే వాస్తవాన్ని చెప్పిన మీడియాను తూలనాడడం ముఖ్యమంత్రికి తగదు. 


కరోనా విపత్తును ఎదుర్కోవడానికి కుల, మత, వర్గ, భాష, లింగ, ప్రాంత, రాజకీయ, సైద్ధాంతిక విశ్వాసాలకు అతీతంగా మానవాళి అంతా ఏకమౌతోంది. అఖిలభారత కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌గాంధీ ఫిబ్రవరి 2నే అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేయాలని సూచించారు. ఆ సూచన చేసిన సరిగ్గా 50 రోజులకు(మార్చి 22నాడు) కేంద్ర ప్రభుత్వం మేల్కొని జనతా కర్ఫ్యూను అమలు చేసింది. అన్ని రాజకీయపార్టీలు స్వచ్ఛందంగా జనతా కర్ప్యూ అమలుకు కృషి చేశాయి. తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్యులకు, పోలీసులకు కృతజ్ఞత, సంఘీభావం తెలపడానికి, ఐక్యంగా ఉన్నామన్న సందేశాన్ని ఇవ్వడానికి ప్రజలంతా ఏకమయ్యారు. లైట్లు ఆర్పి దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని ఇచ్చిన పిలుపునూ పాటించారు. కేసీఆర్ వైఖరి చూస్తుంటే మాత్రం కరోనాను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను, మీడియాను తొక్కిపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వున్నది.


రాష్ట్రంలో కరోనా అంటురోగం ప్రవేశిస్తున్నదని మార్చి 7న అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ప్రస్తావించారు. సీఎం దీన్ని అపహాస్యం చేస్తూ ‘తెలంగాణకు కరోనా రాదు, రానివ్వను. రాష్ట్రంలోని వేడికి వైరస్‌ ఫైర్‌ (కాలిపోతదని) అయిపోతదని ఒక సైంటిస్టు చెప్పారు. పారాసెటమాల్‌ గోలి వేసుకుంటే సరిపోతది’ అని, అంటూ కాం గ్రెస్‌పార్టీయే పెద్ద కరోనా’ అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి కేసీఆర్‌కు వంతపాడుతూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు మాస్కులు పంపించండి అంటూ పరిహసించారు. నిండుసభలో కేసీఆర్‌ తన అజ్ఞానాన్ని, బాధ్యతారాహిత్యాన్ని బయటపెట్టుకున్నా, ప్రతిపక్షాలు హూందాగా వ్యవహరించాయి. ఎప్పుడూ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడం అలవాటుగా ఉన్న కేసీఆర్‌కు ప్రతిపక్షాలు, మీడి యా హూందాతనం, బాధ్యతాయుత వర్తన స్ఫురించకపోవడంలో ఆశ్చర్యం లేదు. మహమ్మారి గురించి ముం దుగా హెచ్చరించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు బాధ్యత లేనట్టా, అపహాస్యం చేసిన కేసీఆర్‌కు బాధ్యత లేనట్టా?


కరోనాను నియంత్రిండానికి, ప్రజలను ఆదుకోవడానికి గ్రామగ్రామాన రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, స్వ చ్ఛంద సంఘాలు, మీడియా ప్రతినిధులు కృషి చేస్తున్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి అభిప్రాయాలను తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరడం ఎలా నేరం అవుతుంది? కరోనా సమయంలో కొత్తగా టెం డర్లు ఏమిటని, కొండపోచమ్మ రిజర్వాయరులో మునిగిపోనున్న భూములకు, ఇండ్లకు నష్ట పరిహారం ఇవ్వకుండా పోలీసులతో బలవంతంగా ఖాళీ చేయిస్తే, నిరాశ్రయులు ఎక్కడికి పోవాలని అడిగిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌ రెడ్డి తెలంగాణ ద్రోహి అయితరా? కేసీఆర్‌ ఫార్మ్‌హౌజ్‌ పొరుగున ఉన్న మామిడ్యాల, బహిలింపూర్, తానేదార్‌పల్లి, తండా వాసుల ఇళ్లను ఈ కరోనా సమయంలో కూల్చేస్తున్న కేసీఆర్‌ బాధ్యతాయుతమైన రాజ్యాంగ వ్యవస్థకు ప్రతినిధి ఎలా అయితరు? మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రం కేవలం 15 రోజుల్లోనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఎలా వచ్చిందని అడిగిన ఎంపీ కోమటిరెడ్టి వెంకటరెడ్డి, కేసీఆర్‌ను పనిచేయనివ్వకుండా అడ్డుకున్నట్టా? కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియాకు సావధానంగా వివరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదా? తెలుసుకునే హక్కు వీరికి లేదా? అడిగితే అసహజనమైన పదాలతో విరుచుకుపడటం ద్వారా కేసీఆర్‌ ఇస్తున్న సందేశం ఏమిటి? సామాన్యుల ప్రాణాలకు రక్షణ కవచాల్లా ఉన్న అనేక విభాగాల సిబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత వ్యవస్థకు ప్రతినిధి అయిన కేసీఆర్‌పై ఉంది. వారి బాగోగులను పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపైనా, మీడియాపైనా ఉంది. పీపీఈ (పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌) కిట్‌లు దాదాపు 10లక్షలకు పైగా అవసరమున్నాయి. కానీ, దేశంలో కేవలం 3.34లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొన్నది. రాష్ట్రంలోనూ పీపీఈలు అందుబాటులో లేకపోవడంతో వైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులకు, పోలీసులకు, ఇతర కార్యకలాపాల్లో మునిగి తేలుతున్న సిబ్బందికి నాణ్యమైన మాస్క్‌లు లేవు. శానిటైజర్లు కొందామంటే కూడా దొరకడం లేదనే సంగతి కేసీఆర్‌కు తెలుసా? తిండి దొరక్క పేదలు పడుతున్న ఇబ్బందులు చూస్తూనే ఉన్నాము. ఇప్పటిదాకా కేంద్రం ప్రకటించిన బియ్యం ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1500 ఇవ్వలేదు. రోగులకు వెంటిలేటర్లు లేవు. వీటిని సమకూర్చుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచనలు చేసిన మీడియాపై కేసీఆర్‌కు అసహనం ఎందుకు? ప్రజలు, వివిధ వర్గాలు పడుతున్న ఇబ్బందులను గుర్తుచేసిన మీడియాకు కరోనా రావాలని శపించిన కేసీఆర్‌ ఏ వ్యవస్థకు ప్రతినిధి? 


బోరెడ్డి అయోధ్యరెడ్డి

టీపీసీసీ అధికార ప్రతినిధి, మీడియా కో ఆర్డినేటర్

Updated Date - 2020-04-11T06:08:53+05:30 IST