కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం : సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-10-31T19:21:32+05:30 IST

కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.

కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్/జనగామ : జనగామ జిల్లా కొడకండ్లలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఇవాళ కొడకండ్లలో రైతు వేదికలను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా రైతులకు వేదికలు లేవని చెప్పారు. అమెరికా, యూరప్‌లో కూడా రైతులు నిరసనలు తెలియజేస్తూనే ఉంటారని అన్నారు. ఇప్పటి వరకు రైతులకు ఒక వ్యవస్థ అంటూ లేదన్నారు. రైతు వేదికలు నా కల. ఈ వేదికలు రైతులను సంఘటిత శక్తిగా మారుస్తాయి. త్వరలోనే భూ సమగ్ర సర్వే జరుగుతుంది. సంకల్పం గట్టిగా ఉంటే రైతు రాజ్యం వచ్చి తీరుతుంది. ధాన్యానికి ఎక్కువ ధర ఇస్తామంటే వడ్లు తీసుకోమంటే బంద్ చేస్తారు. ఇతర దేశాల్లో ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తాయి. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తామంటే ఇవ్వనీయరు. కేంద్ర ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేదు. కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించాలి. రైతులు కూర్చుని మాట్లాడుకోడానికి ఒక వేదిక లేదు. కేంద్రం నిర్థారించిన మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయొద్దని ఎఫ్‌సీఐ అంటోంది అని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు.


ఏకైక రాష్ట్రం తెలంగాణే..

తెలంగాణ రైతులు దేశంలో అగ్రగామిగా నిలవాలి. రైతులంతా వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేయట్లేదు. ధాన్యం కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ. గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. త్వరలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కరోనా పీడ ఇంకా పోలేదు.. జాగ్రత్తగా ఉండాలి. రైతు వేదిక ఒక ఆటం బాంబ్‌.. అద్భుతమైన శక్తి. ఏ పంట వస్తే లాభమో రైతు వేదికలే నిర్ణయించాలి. ప్రత్యేక అధికారుల్ని నియమించి రైతులకు సూచనలిస్తాం. 95శాతం రైతు వేదికలు ఇప్పటికే పూర్తయ్యాయి‌అని కేసీఆర్ వెల్లడించారు.


రైతుబంధు ఆగదు..

రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ ఇచ్చే ఏకైక రాష్ట్రం మనది. నేను బతికి ఉండగా రైతుబంధు ఆగదు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేశాం.. వారిపై నాకు వ్యక్తిగత కోపంలేదు. రైతులకు భూమి విషయంలో సంపూర్ణ రక్షణ రావాలి. అనుభవదారు మూడేళ్లు ఉంటే భూమిపై హక్కులు వస్తాయి. కౌలుకు ఇవ్వడం అంటే కిరాయికి ఇవ్వడమే. నిజాం రాజుల తర్వాత ఎవరూ భూసర్వే చేయలేదు. తెలంగాణలో రైతు రాజ్యం వచ్చి తీరుతుంది అని కేసీఆర్ తెలిపారు.

Updated Date - 2020-10-31T19:21:32+05:30 IST