టీఆర్ఎస్ ప్లీనరీలో ఏపీపై KCR కీలక వ్యాఖ్యలు..

ABN , First Publish Date - 2021-10-25T18:36:00+05:30 IST

టీఆర్‌ఎస్ అధ్యక్షునిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కేసీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.

టీఆర్ఎస్ ప్లీనరీలో ఏపీపై KCR కీలక వ్యాఖ్యలు..

హైదరాబాద్:  టీఆర్‌ఎస్ ప్లీనరి సభలో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలు, కరెంట్, సాగు నీటి గురించి మాట్లాడారు.  ‘‘కలలు కనే సాహసం కూడా ఉండాలి.. స్వాప్నించాలి, సాకారం చేసుకోవాలి.. కొందరు అదెలా సాధ్యం అని ప్రశ్నిస్తున్నారు. ఏపీ తలసరి ఆదాయం లక్షా70వేల కోట్లు, తెలంగాణ తలసరి ఆదాయం 2లక్షల ముప్పై వేల కోట్లు. నేడు తెలంగాణలో 24 గంటల కరెంట్, ఏపీలో కరెంట్ కోతలు ఉన్నాయి. ఎక్కడి తెలంగాణ, ఎక్కడి ఏపీ.. అసలు ఇప్పుడు రెండు రాష్ట్రాలకు పొంతనే లేదు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.


సచివాలయం, యాదాద్రి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కడతామంటే కేసులు వేశారని... అన్నింటినీ ఛేదించి గొప్ప తెలంగాణను ఆవిష్కరించుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. భారతదేశాన్ని తట్టిలేపే దళిత బంధు ఉద్యమాన్ని మొదలు పెట్టామన్నారు. తెలంగాణ వారికి పాలన చేతకాదని అవమానించారని, అనేక రకాలుగా దుష్ప్రచారం చేశారని అన్నారు. నేడు అనేక రంగాల్లో తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉందని తెలిపారు. పంజాబ్‌ను తలదన్ని వరి ఉత్పత్తిలో అగ్రభాగాన నిలిచిందని సీఎం పేర్కొన్నారు.


విద్యుత్ సగటు వినియోగంలో నంబర్ వన్‌లో ఉందన్నారు. తెలంగాణ పథకాలు దేశ వ్యాప్తంగా కాపీ కొట్టబడుతున్నాయని అన్నారు. రాయచూరు ఎమ్మెల్యే, నాందేడ్ జిల్లా ప్రజలు తెలంగాణ పథకాలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని... లేదంటే తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారని తెలిపారు. ఇంత గొప్ప అభివృద్ధిని తెలంగాణ సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. అన్ని గ్రామాల్లో వైకుంఠ దామాలు నిర్మించామన్నారు. లక్షా 50వేల కోట్ల ఐటి ఎగుమతులు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2021-10-25T18:36:00+05:30 IST