వారణాసిలో బీజేపీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ప్రచారం?

ABN , First Publish Date - 2022-03-02T16:47:02+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై రాజకీయ యుద్ధం ప్రకటించిన తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశారు.

వారణాసిలో బీజేపీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ప్రచారం?

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై రాజకీయ యుద్ధం ప్రకటించిన తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశారు. ఫెడరల్ ఫ్రంట్ చర్చలు ముమ్మరం చేసిన గులాబీ దళపతి యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. మోదీ నియోజక వర్గమైన వారణాసిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నట్లు సమాచారం.


బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తానన్న సీఎం కేసీఆర్ ఆ దిశగా పావులు వేగంగా కదుపుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ చర్చలను ముమ్మరం చేయనున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భేటీ కావడంతోపాటు.. యూపీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారని సమాచారం. ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి సెగ్మెంట్‌లోనే కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.


నిజానికి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తామంటూ గతంలో సీఎం కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంకేతాలిచ్చారు. వారణాసి లోక్ సభ స్థానం పరిధిలో ఈ నెల 7న ఏడో విడత యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ నెల 4న అక్కడ ఎన్నికల ప్రచారానికి కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఎన్సీపీ నేత శరద్ పవర్ వెళ్లే అవకాశాలున్నాయి. వారితో పాటు కేసీఆర్ కూడా వారణాసి ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.

Updated Date - 2022-03-02T16:47:02+05:30 IST