TS News: యాదాద్రికి సీఎం కేసీఆర్.. కొత్త పార్టీ పేరుపై పూజ..

ABN , First Publish Date - 2022-09-30T18:43:05+05:30 IST

సీఎం కేసీఆర్ పెట్టబోయే కొత్త పార్టీకి సరికొత్త అనుభూతిని కలిగించేలా గులాబీ దళపతి అడుగులు వేస్తున్నారు.

TS News: యాదాద్రికి సీఎం కేసీఆర్.. కొత్త పార్టీ పేరుపై పూజ..

హైదరాబాద్ (Hyderabad): సీఎం కేసీఆర్ (CM KCR) పెట్టబోయే కొత్త పార్టీ (New Party)కి సరికొత్త అనుభూతిని కలిగించేలా గులాబీ దళపతి అడుగులు వేస్తున్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనృసింహుడిని దర్శించుకోనున్నారు. ఇందు కోసం ఆయన హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరారు. యాదగిరిగుట్ట ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు గతంలో తమ కుటుంబం తరపున ప్రకటించిన 1కిలో 16తులాల బంగారాన్ని వైటీడీఏ అధికారులకు అందజేయనున్నారు. తర్వాత లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోనున్నారు. కొత్త పార్టీ పేరుపై ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం 3గంటలకు యాదగిరిగుట్ట కొండపై నుంచి బయలుదేరి హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌కు చేరుకుంటారు. 


దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న సీఎం కేసీఆర్‌.. ఆ పార్టీ అధినేతగా దేశవ్యాప్త పర్యటనల కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేశారు. పార్టీలోని పది మంది నాయకులు ఈ విమానం కొనుగోలు కోసం విరాళాలు ఇచ్చారు. విరాళాలు ఇచ్చిన నేతల్లో ముగ్గురు ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు కాగా.. ఒకరు నల్లగొండ జిల్లా, మరొకరు కరీంనగర్‌ జిల్లాకు చెందినవారు ఉన్నట్టు సమాచారం. అలాగే.. జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఏర్పాట్లనూ కేసీఆర్‌ వేగవంతం చేశారు. అందుకు సంబంధించిన పత్రాలపై దసరా పండుగనాడే ఆయన సంతకాలు చేయనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు ఆ పత్రాలను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన విషయాలను ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచి, ముగ్గురు నలుగురు నాయకులకు మాత్రమే చెప్పిన కేసీఆర్‌.. దసరా దగ్గర పడుతుండడంతో ఇప్పుడు మరికొందరు కీలక నేతలకు కూడా ఈ విషయాన్ని చెప్పారని సమాచారం.

Updated Date - 2022-09-30T18:43:05+05:30 IST