అన్నదాత కన్నీళ్లు తుడిచేనా!?

ABN , First Publish Date - 2022-01-18T05:40:18+05:30 IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గత మంగళవారం కురిసిన అకాల వర్షం... పంటలకు అపార నష్టం కలిగించింది. అన్నదాత బతుకును ఆగమాగం చేసింది. వడగళ్లతో చేతికంది వచ్చిన పంటలు నేలపాలై గడగండ్లను మిగిల్చింది. పంటల సాగుపై వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు అకాలవర్షం సృష్టించిన భీభత్సంతో కుదేలైపోయాడు.

అన్నదాత కన్నీళ్లు తుడిచేనా!?
ఇటీవల కురిసిన వర్షానికి దుగ్గొండి మండలం స్వామిరావుపల్లిలో నేలవాలిన మొక్కజొన్న పంట దృశ్యం దుగ్గొండి మండలంలో నేలకొరిగిన పంట

సీఎం కేసీఆర్‌ వరాలపై బాధిత రైతుల ఆశలు
అకాల వర్షంతో ఉమ్మడి జిల్లాలో 42వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట
రూ. 120 కోట్ల మేర నష్టం
పరకాల, నర్సంపేట నియోజకవర్గాల్లో నేడు సీఎం పర్యటన?
దెబ్బతిన్న పంటల పరిశీలన


హనుమకొండ/నర్సంపేట టౌన్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గత మంగళవారం కురిసిన అకాల వర్షం... పంటలకు అపార నష్టం కలిగించింది. అన్నదాత బతుకును ఆగమాగం చేసింది. వడగళ్లతో చేతికంది వచ్చిన పంటలు నేలపాలై గడగండ్లను మిగిల్చింది. పంటల సాగుపై వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు అకాలవర్షం సృష్టించిన భీభత్సంతో కుదేలైపోయాడు.

ఉమ్మడి జిల్లాలో అకాలవర్షానికి మిర్చి పంట చేతికి రాకుండా పోయింది. తామర పురుగుతో అప్పటికే సగం పంట పోయి కన్నీరుమున్నీరు అవుతున్న రైతుపై అకాల వర్షం మరో పిడుగుపాటైంది. రాళ్ళవానకు మిగిలిన పంట కూడా తుడిచిపెట్టుకుపోయింది. పంటల బీమా ద్వారా అయిన పరిహారం వచ్చే పరిస్థితి లేని నేపథ్యంలో... మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన బాధిత రైతాంగంలో  ఆశలను చిగురింప చేస్తోంది. దెబ్బతిన్న పంటను పరిశీలించేందుకు ఆయన  వస్తారని చెబుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తమను ఆదుకుంటుందన్న భరోసా రైతుల్లో కలుగుతోంది.  

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అకాల వర్షం వల్ల సుమారు 42వేల ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్న, పసుపుతో పాటు పండ్లతోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటల్లో మిర్చి అధికంగా  ఉంది. సుమారు 30వేల ఎకరాల్లో పంట అక్కరకు రాకుండా పోయింది. ఆ తర్వాత బాగదెబ్బతిన్న పంట మొక్కజొన్న. అరటితోటలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి.

హనుమకొండ జిల్లాలోని పరకాల, నడికుడ, ఆత్మకూరు, దామెర, కమలాపూర్‌, ఐనవోలు మండలాల్లో పంట నష్టం తీవ్రంగా జరిగింది. ఈ మండలాల్లో 2500 ఎకరాల్లో మిర్చి, 200 ఎకరాల్లో మొక్కజొన్న, మరో 200 ఎకరాల్లో పసుపు పంట ఽధ్వంసం అయింది. రాయపర్తి, నార్లాపూర్‌, చెర్లపల్లి, కౌకొండ, వరికోలు, నర్సక్కపల్లి, పులిగిల్ల, ధర్మారం, కంఠాత్మకూరు, రామక్రిష్ణాపురం తదితర గ్రామాల్లో  పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మిర్చి పూత పూర్తిగా రాలిపోయింది. మొక్కలు నేలకు వంగి పోయింది. పరకాల మండలంలో 300 ఎకరాల్లో మిర్చి, 150 ఎకరాల్లో మొక్కజొన్న, 50 ఎకరాల్లో పసుపు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నాగారం, పైడిపెల్లి, వెంకటాపురం, మల్లక్కపేట తదితర గ్రామాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఆత్మకూరు మండలంలో 60 ఎకరాల్లో  మిర్చి, 50 ఎకరాల్లో మొక్కజొన్న చేతికి రాకుండా పోయింది. కమలాపూర్‌ మండలంలో 200 ఎకరాల మిర్చి, 200 ఎకరాల మొక్కజొన్న దెబ్బతిన్నతి. ఒక ఎకరం మొనగతోట ఎందుకూ పనికిరాకుండా పోయింది. అయినవోలు మండలంలో 200 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరిగింది. కొండపర్తి, ముల్కలగూడెం, వనమాలకనపర్తి, నర్సింహులగూడెం, కొండపర్తి, ఒంటిమామిడిపల్లి గ్రామాల్లో  పంటలకు నష్టం వాటిల్లింది, హసన్‌పర్తి మండలంలోని గుంటూరుపల్లి, పెంబర్తి, అన్నసాగరం, మడిపెల్లి గ్రామాల్లో సుమారు  50 ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లింది. శాయంపేట  మండలంలో మిర్చి, మొక్కజొన్న నేలకొరిగాయి.

వరంగల్‌ జిల్లాలో 18946 మంది రైతులకు చెందిన 24005 ఎకరాల్లో పంట తీవ్రంగా ధ్వంసం అయింది. జిల్లాలో మొత్తం సాగైన పంటల విస్తీర్ణంలో దాదాపు 33 శాతం పంట అకాల వర్షం వల్ల   పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. నర్సంపేట సబ్‌డివిజన్‌ పరిధిలోని ఆరు మండలాలు నర్సంపేట, దుగ్గొండి, కానాపురం, నెక్కొండ, చెన్నారావుపేట, నల్లబెల్లితో పాటు సంగెం, గీసుకొండ మండలాల్లో పంటలకు అపార నష్టం జరిగింది. సుమారు రూ.81 కోట్ల మేరకు పంట నష్టం జరిగింది. ఇందులో అత్యధిక శాతం మిర్చి పంటనే. వడగళ్లవాన వల్ల సుమారు 15వేల మంది రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

జనగామ జిల్లాలోని 9 గ్రామాల్లోని 237 మంది రైతులకు చెందిన 461 ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. సుమారు రూ 2 కోట్ల విలువైన పంట ఽనేలపాలైంది. ఈ జిల్లాలో మొక్క జొన్న ఎక్కువ దెబ్బతిన్నది. 343 ఎకరాల్లో మొక్కజొన్న, 50 ఎకరాల్లో వేరుశనగ, 15 ఎకరాల్లో మిర్చి, 30 ఎకరాల్లో పొగాకు, 23 ఎకరాల్లో ఇతర పంటలు నేలపాలయ్యాయి.

మహబూబాబాద్‌ జిల్లాలో 1137 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం, గూడూరు మండలాల్లో పంటలు ఎక్కువ దెబ్బతిన్నాయి. సమారు 400 మంది రైతులు ఇబ్బందుల పాలయ్యారు.

ములుగు జిల్లాలో సుమారు వెయ్యి ఎకరాల్లో మిర్చి చేతికి రాకుండా పోయింది. మరో వెయ్యి ఎకరాల్లో ఇతర పంటలు నేలపాలయ్యాయి. ఏటూరునాగారం, వాజేడు, నూగేరు వెంకటాపూర్‌, ములుగు, తదితర మండలాల్లో మండలాల్లో మిర్చి పూర్తిగా చేతికి రాకుండా పోయింది. నష్టం సుమారు రూ 2. కోటి వరకు ఉండవచ్చునని అంచనా. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 12వేల ఎకరాల్లో మిర్చి తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

నాలుగెకరాల్లో మిర్చి దెబ్బతిన్నది..
- అజ్మీర రాజన్న, రైతు బోజ్యనాయక్‌తండా, నర్సంపేట మండలం

నాలుగెకరాల్లో ఎకరానికి రూ.లక్ష చొప్పున పెట్టుబడులు పెట్టి మిర్చి సాగు చేశా. వడగండ్ల వానతో పంట పూర్తిగా దెబ్బతింది. పెట్టుబడులు కూడా చేతికిరాలేదు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు. మాకు పరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలి.

ఎకరానికి రూ.2లక్షల పరిహారం చెల్లించాలి
-కోరె మల్లేశం, రైతు, దాసరిపల్లి, నర్సంపేట మండలం

నాకున్న మూడు ఎకరాల్లో ఒక ఎకరంలో తేజ రకం మిర్చి, మరో రెండెకరాల్లో దొడ్డరకం మిర్చి సాగు చేశా.. అకాల వర్షంతో పూర్తిగా పంట నీటమునిగింది. ప్రభుత్వం ఎకరాకు రూ.2లక్షలు పరిహారంగా చెల్లించాలి. లేదం టే అప్పుల బాధతో ఆత్మహత్యలే శరణ్యం.

నేడు సీఎం కేసీఆర్‌  రాక?

పరకాల, నర్సంపేట నియోజకవర్గాల్లో పర్యటనకు రంగం సిద్ధం
విస్తృత ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం
అర్ధరాత్రి వరకు ఖరారు కాని షెడ్యూల్‌


వరంగల్‌/హనుమకొండ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని పరకాల, నర్సంపేట నియోజకవర్గాలలో పర్యటించనున్నట్టు సమాచారం.  హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పరకాల, నడికూడ మండలాలతో పాటు వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి లేదా నల్లబెల్లి మండలంలోని పంటలు దెబ్బతిన్న గ్రామాలలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలిస్తారు. బాధిత రైతులతో మాట్లాడతారు. వారికి పరిహారం చెల్లించే విషయంలో భరోసా ఇస్తారు.   హైదరాబాద్‌లో మంగళవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అకాల వర్షం వల్ల పరకాల, నర్సంపేట నియోజకవర్గాల్లో జరిగిన పంట నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన సీఎం పంట నష్టం జరిగిన పొలాలను చూడడానికి తాను మంగళవారం ఈ రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తానని చెప్పినట్టు తెలిసింది.

సీఎం రాకను పురస్కరించుకొని జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. తగిన ఏర్పాట్లు చేయడానికి అధికారులు రంగంలోకి ది గారు. హనుమకొండ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు సోమవా రం సాయంత్రం హుటాహుటిన పరకాల మండల కేంద్రానికి వెళ్ళి హెలీప్యాడ్‌ స్థల పరిశీలన జరిపారు. తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సీఎం హెలీకాప్టర్‌ ద్వారా  తొలుత నర్సంపేటకు చేరుకొని అక్కడి నుంచి కారులో దుగ్గొండి లేదా నల్లబెల్లి గ్రామాలలో పర్యటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో పరకాల మండల కేంద్రానికి చేరుకొని మల్లక్కపల్లి గ్రామంతో పాటు నడికుడ మండలంలోని ఒకటి రెండు గ్రామాలను సందర్శించనున్నట్టు తెలుస్తోంది. అకాల వర్షం వల్ల ఉమ్మడి జిల్లాలో సుమారు 42వేల ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్న, పసుపుతో పాటు పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. మిర్చి పంట ఎక్కువగా ధ్వంసమైంది. నష్టం సుమారు రూ. 120 కోట్ల వరకు ఉండవచ్చునని ప్రాధమిక ఆంచనా.

ఇదిలావుండగా సీఎం పర్యటన చివరిక్షణంలో రద్దయితే, ఆయనకు బదులు మంత్రులు, ఉన్నతాధికారుల బృందం పర్యటిస్తుందని తెలిసింది.  సీఎం పర్యటనపై అధికారుల్లోనూ అయోమయం నెలకొంది. భద్రతా కారణాల దృష్ట్యా షెడ్యూల్‌ గోప్యంగా ఉంచారనే ప్రచారం కూడా సాగింది.





Updated Date - 2022-01-18T05:40:18+05:30 IST