Abn logo
Sep 16 2020 @ 04:00AM

క్రూర చట్టం

ఉత్తరాది కంపెనీలకు మేలు చేయడానికే..

వాటి నుంచి విద్యుత్తు కొనడానికే ఎత్తుగడ

అప్పుడు మన ప్లాంట్లను బంద్‌ పెట్టుకోవాల్సిందే

రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఇది గొడ్డలిపెట్టు

రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు, సబ్సిడీలు ఉండవు

మోటార్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూల్‌ చేయాలి

ఈఆర్‌సీ, నిర్ణయాధికారమూ కేంద్రానికి పోతుంది

కేంద్ర విద్యుత్తు సవరణ బిల్లుపై కేసీఆర్‌ ధ్వజం

బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం.. ఆమోదం


ప్రతిపాదిత బిల్లుకు వ్యతిరేకంగా చాలా మంది ముఖ్యమంత్రులు నాతో మాట్లాడారు. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్‌, బెంగాల్‌, ఢిల్లీ, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల సీఎంలు వ్యతిరేకించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా.. బీజేపీ అధికారంలో ఉన్నా ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోలేదు. 


4 లక్షల మెగావాట్ల స్థాపిత విద్యుత్తు శక్తి ఉంటే, పీక్‌లోడ్‌ 2.19 లక్షలు దాటలేదు. మిగిలిన విద్యుత్తు ఏమౌతోంది?

- ముఖ్యమంత్రి కేసీఆర్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కేంద్ర విద్యుత్తు ముసాయిదా బిల్లు ఘోరాతి ఘోరం, చాలా భయంకరమైనదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని, దేశ సమాఖ్య స్ఫూర్తిని గొడ్డలితో అడ్డంగా నరికేసే అమానుష చట్టమని ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రాల్లో సంప్రదాయేతర (రెన్యువబుల్‌) ఇంధన వినియోగం తప్పనిసరిగా ఉండాలని ప్రతిపాదిత బిల్లులో పేర్కొన్నారు. అందులో నిర్దేశించిన పరిధిలో వినియోగం లేకపోతే, ఎంత తక్కువైతే అంతమేర ఒక్కో యూనిట్‌కు 50 పైసల నుంచి రూ.2 వరకూ జరిమానా వేస్తామని నిబంధన పెట్టారు. తెలంగాణలో శ్రీశైలం, నాగార్జున సాగర్‌తోపాటు పలు జల విద్యుత్తు కేంద్రాలు ఉన్నాయి. ఇవి ఉమ్మడి రాష్ట్రంలో కట్టినవే. ఇక, మేం వచ్చిన తర్వాత జూరాల, పులిచింతల పూర్తి చేశాం. వీటికితోడు,రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్తు కేంద్రాలు కూడా ఉన్నాయి. కానీ, ఇప్పటికే రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సంప్రదాయేతర ఇంధన విద్యుత్తును పరిగణనలోకి తీసుకోరట. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి 20 శాతం సంప్రదాయేతర ఇంధన వినియోగం ఉండాలని నిబంధన పెడుతున్నారు.


ఉత్తరాదిలో ఎవరో పెట్టిన ప్లాంట్ల నుంచి కరెంట్‌ కొనడానికే ఈ నిబంధన’’ అని ఆక్షేపించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర భారతంలోని ప్రైవేటు కంపెనీలు పెట్టిన ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసిన కరెంటునే లెక్కలోకి తీసుకుంటే ఎలాగని తప్పుబట్టారు. ఈ మేరకు రేపో ఎల్లుండో పార్లమెంటులో చట్టం చేయనున్నారని మండిపడ్డారు. రాష్ట్రాల విద్యుత్తు సంస్థలన్నిటినీ మేమే తీసేసుకుంటామని నేరుగా చెబితే అయిపోతుంది కదా అని విమర్శించారు. కేంద్ర చట్టంలోని నిబంధనలకు భయపడి రాష్ట్రంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకోవాల్సి వస్తుందని, మన ప్లాంట్లను బంద్‌ పెట్టుకోవాల్సి వస్తుందని విరుచుకుపడ్డారు. ప్రతిపాదిత కేంద్ర విద్యుత్తు చట్టం ప్రజలకు ఏ రకంగానూ పనికొచ్చేది కాదని, రైతులకు గొడ్డలిపెట్టు అని మండిపడ్డారు. రాష్ట్రాల అధికారాలను హరించే, నియంత్రించే చట్టమని ఆరోపించారు. ’’మీకు బలం ఉండొచ్చు. చేతులెత్తి నరేంద్ర  మోదీని వేడుకుంటున్నా. ఫాల్స్‌ ప్రిస్టేజీకి పోకుండా బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. ప్రజల నెత్తిన రుద్దొద్దు’’ అని కోరారు. కేంద్ర విద్యుత్తు ముసాయిదా బిల్లుకు వ్యతిరేకంగా మంగళవారం శాసనసభలో సీఎం కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు.


దానిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం, ముఖ్యమంత్రి మాట్లాడారు. ముసాయిదా పంపించారని, దానికి స్పందించి చట్టం చేయవద్దంటూ లేఖ కూడా రాశామని చెప్పారు. అయినా, బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారని తెలిపారు. ‘‘ఈ రెండు పార్టీలు (బీజేపీ, కాంగ్రెస్‌) దేశాన్ని పరిపాలించే విధానంలో అంబేడ్కర్‌ పెట్టిన ఆదేశిక సూత్రాలను పట్టించుకోవడం లేదు. వీళ్లేం (కాంగ్రెస్‌) తక్కువ కాదు. రాష్ట్రాల అధికారాలను దెబ్బతీస్తున్నారు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు.. మోదీ ప్రభుత్వం అధికారాలను కేంద్రీకృతం చేస్తోంది. ఆ చట్టం అమల్లోకి వస్తే, హైదరాబాద్‌లో ఉన్న లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్లు ఢిల్లీకి పోతాయి. కరెంట్‌ బాధలు వస్తే ఢిల్లీతో మాట్లాడాలి. ప్రజలను దెబ్బతీసే ఈ బిల్లును మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక ఎమ్మెల్యే, నలుగురు ఎంపీలు ఉన్నారని, ప్రజలకు కీడు చేసే బిల్లుపై వారు కూడా నిర్ణయం తీసుకోవాలని కోరారు. 


ఇక విద్యుత్తు సంస్థల వంతు

‘‘బీఎ్‌సఎల్‌ఎన్‌ పోయింది. ఎల్‌ఐసీ పోయింది. రైళ్లు పోయాయి. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పోతాయి. ఓపెన్‌ యాక్సె్‌సలో స్వేచ్ఛగా కరెంట్‌ కొనుక్కునే అవకాశం పరిశ్రమలకు ఇచ్చారు. ట్రాన్స్‌కో, జెన్‌కో ఎక్కడికి పోవాలి? పంపిణీ సంస్థలను ప్రైవేట్‌ వ్యక్తులకు ఇస్తారంట. ఉద్యోగులు ఎక్కడికి పోవాలి?’’ అని సీఎం కేసీఆర్‌ నిలదీశారు. ఇది విద్యుత్తు సంస్థలను ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేసే బిల్లు అని మండిపడ్డారు. 


పంపులకు మీటర్లు పెట్టాల్సిందే

‘‘కరెంట్‌ సరఫరా చేసే క్రమంలో ఒక దగ్గర లాభం వస్తుంది. మరోచోట నష్టం వస్తుంది. దీన్ని సరిచేసే విధానమే క్రాస్‌ సబ్సిడీ. దీన్ని కూడా తీసేస్తారు. రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) మన చేతుల్లో ఉండదు. రాష్ట్రంలో 26 లక్షల కరెంట్‌ మోటార్లు ఉన్నాయి. వీటికి విద్యుత్తు సరఫరా కోసం ఏడాదికి 10 వేల కోట్లు ఇస్తున్నాం. ఫలితంగా, రెండెకరాలు వేసేటోడు నాలుగెకరాలు వేస్తున్నాడు. కొత్త చట్టం అమల్లోకి వస్తే, ఈ పంపులకు మీటర్లు పెట్టాలి.


మీటర్లు కొనడానికి రూ.700-1000 కోట్లు కావచ్చు. ఆ తర్వాత రైతుల నుంచి ముక్కుపిండి బిల్లు వసూలు చేయాలి. మీటర్‌ రీడింగ్‌ తీయాలంటే మళ్లీ 2 వేల మంది బిల్లు కలెక్టర్లు వస్తారు. ఇవన్నీ దేనికి!? అలాగే, దేశంలో ఉన్న విద్యుత్తుఉద్యోగులంతా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో 22 వేల మంది ఆర్టిజన్లను రెగ్యులర్‌ చేశాం. ఇప్పుడు వారి ఉద్యోగాలు కల్లోలంలో పడతాయి. అందుకే, విద్యుత్తు చట్టానికి సవరణ వద్దని ప్రధాన మంత్రికి లేఖ రాశాం’’ అని కేసీఆర్‌ వివరించారు. 26 లక్షల మోటార్లకు మీటర్లు పెట్టడంపై ప్రజలకు వివరణ ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని నిలదీశారు.


చాలామంది సీఎంలూ వ్యతిరేకిస్తున్నారు

ప్రతిపాదిత బిల్లుకు వ్యతిరేకంగా చాలా మంది ముఖ్యమంత్రులు తనతో మాట్లాడారని, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల సీఎంలు వ్యతిరేకత వ్యక్తం చేశారని కేసీఆర్‌ చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా.. బీజేపీ అధికారంలో ఉన్నా దేశంలోని 130 కోట్లమంది ప్రజలకూ మేలు చేసే నిర్ణయాలు తీసుకోలేదని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు కావస్తోందని, 70 వేల టీఎంసీలు ఉన్నా 40 కోట్ల ఎకరాలే సాగు భూమి ఉందని; 4 లక్షల మెగావాట్ల స్థాపిత విద్యుత్తు శక్తి ఉంటే, పీక్‌లోడ్‌ 2.19 లక్షల మెగావాట్లు దాటలేదని, మిగిలిన విద్యుత్తు ఏమవుతోందని నిలదీశారు. ‘‘మిగిలిన పవర్‌ను వాడుకోకుండా మూతేస్తున్నారు. పట్నాలో నాలుగు డీజిల్‌ జనరేటర్లు పెట్టుకొని విద్యుత్తును అమ్ముతున్నారు. యూపీలో కూడా ఇదే పరిస్థితి. ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎన్నో ఈ అవస్థలున్నాయి. అన్నీ పక్కనపెట్టి ఈ బిల్లు తెస్తున్నారు’’ అని ఆక్షేపించారు.’


రాష్ట్రంలో ప్రైవేటుకు ఇవ్వలేదు

రాష్ట్రంలో విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించాలనుకున్నప్పుడు పెద్దస్థాయిలో ఒత్తిడి వచ్చిందని, కాంట్రాక్టులను ప్రైవేట్‌ సంస్థలకు ఇవ్వాలని అడిగారని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ‘‘కానీ, మన సంస్థలు పనిచేస్తే.. డబ్బు మిగిలితే.. పది మంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వవచ్చు. అవసరమైతే పారిశ్రామిక వర్గాలకు కరెంట్‌ చార్జీలను కొంత తగ్గించొచ్చు. అందుకే, ప్రైవేట్‌ సంస్థలకు పవర్‌ ప్లాంట్లు ఇవ్వలేదు’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ సందర్భంగా, శ్రీశైలం విద్యుత్కేంద్రంలో ప్రమాదం జరుగుతున్నప్పుడు చనిపోతున్నామని తెలిసినా చివరిదాకా ప్లాంట్‌లో ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసిన ఉద్యోగులకు శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు.  


రాష్ట్రాలకు విఘాతం: జగదీశ్‌ రెడ్డి

ప్రతిపాదిత కేంద్ర విద్యుత్తు చట్టం అన్ని రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతమని, రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా సవరణలు చేయడం సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి తప్పుబట్టారు. ఈ చట్టం అమల్లోకి వస్తే, రైతులకు ఉచిత విద్యుత్తు, పేదలకు సబ్సిడీలు ఇవ్వడం కుదరదని, కరెంటు చార్జీలను ప్రభుత్వం కాకుండా విద్యుత్తు నియంత్రణ మండలి నిర్ణయిస్తుందని తెలిపారు.


హౌస్‌ కమిటీ వేయాలి: భట్టి 

శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రం ప్రమాదంపై హౌస్‌ కమిటీ వేసి, విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. ‘‘ప్రమాదం దురదృష్టకరం. అగ్ని ప్రమాదాన్ని నివారించే వ్యవస్థ భూగర్భ జల విద్యుత్కేంద్రంలో లేదని వార్తలు వచ్చాయి. ఉన్నత స్థాయి కమిటీలు వేయాలి. సాంకేతిక నిపుణులతో క లిసి చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. విద్యుత్తు బిల్లు సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందని, అయితే, కేంద్రం నిర్ణయాలపై జీఎస్టీ నుంచే మాట్లాడి ఉండాల్సి ఉందని సీఎం కేసీఆర్‌కు చురక అంటించారు.


200 యూనిట్లలోపు బిల్లుల పునఃపరిశీలన

అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సమయంలో 3 నెలలకు కలిపి యావరేజ్‌ చేసి బిల్లు వేయడం వల్ల శ్లాబులు మారి బిల్లులు పెరిగిపోయాయనే ఫిర్యాదులను పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఈ అంశాన్ని మంగళవారం అసెంబ్లీలో కాంగ్రెస్‌ నేత భట్టి లేవనె త్తడంతో వెంటనే బిల్లుల పరిశీలనకు ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. సగటు వినియోగం 200 యూనిట్లలోపు వారికి శ్లాబులు మారడంతో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. సీఎం నిర్ణయంతో వీరికి స్వల్ప ఊరట కలిగే అవకాశం ఉంది.

Advertisement
Advertisement
Advertisement