ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి.. Huzurabad టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఈయనే.. KCR అధికారిక ప్రకటన

ABN , First Publish Date - 2021-08-11T17:30:51+05:30 IST

గత కొన్ని రోజులుగా ఇతనే అభ్యర్థి అని ఏబీఎన్ టీవీ చానెల్‌తో పాటు, ఆంధ్రజ్యోతి దినపత్రికలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం విదితమే.

ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి.. Huzurabad టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఈయనే.. KCR అధికారిక ప్రకటన

హైదరాబాద్/కరీంనగర్ : హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఇతనే అభ్యర్థి అని ‘ఏబీఎన్’ టీవీ చానెల్‌తో పాటు, ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే బుధవారం నాడు కేసీఆర్ అధికారికంగా ఆయన పేరే ప్రకటించేశారు. టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా గెల్లు శ్రీనివాస్‌ ఉన్నారు. ఈయన యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గెల్లు అనేకసార్లు జైలుకు కూడా వెళ్లారు.


పరిచయం ఇలా..

కాగా.. దళిత బంధు పథకం ప్రారంభ సమావేశ సందర్భంగా.. ఈ నెల 16న హుజూరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను నియోజకవర్గ ప్రజలకు సీఎం పరిచయం చేయనున్నారు. సామాజిక సమీకరణాలతో పాటు ఉద్యమ నేపథ్యం ఉన్నందున ఆయన వైపే కేసీఆర్ మొగ్గుచూపారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్ నేత ఈటల రాజేందర్‌ను ప్రకటించగా.. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి ఎంపిక కోసం ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది.


ఎత్తుగడలు... 

ఈటల పాదయాత్ర మొదలు పెట్టి పల్లెపల్లె చుట్టేస్తుండగా.. ఇటు టీఆర్ఎస్ కూడా సామాజిక వర్గాల వారిగా ఓటర్లకు గాలం వేసే ఎత్తుగడలు అమలు చేస్తోంది. ఈ విషయంలో కొంత వెనకబడ్డ కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే వేగం పెంచుతోంది. తెలంగాణ అవిర్భావం తర్వాత వచ్చిన ఎన్నికలేవి కాంగ్రెస్‌కు కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను కూడా ఆ పార్టీ కోల్పోయింది. ఆ ఓటములన్నీ అప్పటి పీసీసీ అధ్యక్షుడి ఖాతాలో పడిపోయాయి. అయితే ఇప్పుడు టీపీసీసీకి కొత్త టీం వచ్చింది. ఈ టీంకు హుజురాబాద్ ఉప ఎన్నిక ఛాలెంజ్‌గా మారింది. 




Updated Date - 2021-08-11T17:30:51+05:30 IST