అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌, హిమాన్షు ఉన్న బ్యానర్.. ఇటు దొంగలున్నారు జాగ్రత్త!

ABN , First Publish Date - 2022-03-02T16:45:26+05:30 IST

హర హర మహాదేవ శంభో శంకర.. ఓం నమో రుద్రాయ.. శివనామస్మరణలతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే...

అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌, హిమాన్షు ఉన్న బ్యానర్.. ఇటు దొంగలున్నారు జాగ్రత్త!

ఇంటర్నెట్ డెస్క్ : హర హర మహాదేవ శంభో శంకర.. ఓం నమో రుద్రాయ.. శివనామస్మరణలతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటే.. మరోవైపు ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున వెలిశాయి. తమ అభిమాన నాయకుల ఫొటోలతో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కార్యకర్తలు, అభిమానులు అభిమానం చాటుకుంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే..  తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కీసరగుట్ట వద్ద టీఆర్ఎస్‌ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ బ్యానర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, మల్లారెడ్డి.. ఎంపీ జోగినపల్లి, కల్వకుంట్ల హిమాన్షు ఉన్నారు. 


ఇదీ అసలు కథ..

బ్యానర్ ఏర్పాటు చేశారు.. శుభాకాంక్షలు చెప్పారు.. ఇంతవరకూ అంతా ఓకే కానీ.. ఇది ఏర్పాటు చేసిన చోట పోలీసుల హెచ్చరికతో బ్యానర్ ఉండటంతో అటు ప్రతిపక్షాల నోట.. ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. ఈ పెద్ద బ్యానర్‌ పక్కనే ‘దొంగలున్నారు జాగ్రత్త’ అని హెచ్చరిక ఉండటమే దీనంతటికీ కారణం. అటు రాజకీయనేతలతో పొలిటికల్ ఫ్లెక్సీ.. ఇటేమో దొంగలున్నారు జాగ్రత్త అంటూ పోలీసుల ఫ్లెక్సీ.. ఇక దీన్ని పట్టుకుని నెటిజన్లు చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ చేసేస్తున్నారు. ‘‘అబ్బా ఎంత కరెక్టుగా సెట్ అయ్యిందో.. అది యాదృచ్ఛికమో లేకుంటే చూసుకోకుండా పెట్టారో తెలియట్లేదు కానీ.. అందరి మనసులోని మాటను ఇలా బయటపెట్టారబ్బా..’’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మాత్రం.. ‘అక్షరాలా ఇది నిజం.. మేము ఇన్ని రోజులు చెప్పేది ఇదే కదా..’ అని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరైతే.. ‘చూశారుగా.. తెలంగాణ ప్రజలకు ఇన్ని రోజులు చెబుతుంటే సరిగ్గా అర్థం కాలేదు.. ఇప్పుడు ఏకంగా పోలీసులే ఇలా హెచ్చరిస్తున్నారు.. ఇకనైనా జాగ్రత్త’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘పోలీసు సార్లూ... మీరు అనేది.. రాష్టాన్ని దోచే దొంగలే కదా మీరు అనేది...??’ అంతేనా.. అదే కదా అని నెటిజనం కామెంట్స్ చేస్తూ రీట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.


శివుడు ఎక్కడ సామీ..!

ఇవన్నీ ఒక ఎత్తయితే.. శివరాత్రికి శుభాకాంక్షలు అంటూ ఉన్న ఈ ఫ్లెక్సీలో రాజకీయ నాయకులందరి ఫొటో ఉంది కానీ.. శివుడి ఫొటో లేకపోవడం గమనార్హం. ‘అందరి ఫొటోలు ఫ్లెక్సీలో ఉన్నాయి సరే.. శివుడి ఫొటో పెట్టకపోవడంలో తమరి ఆంతర్యమేంటి సామీ..’ అని కొందరు సొంత పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు. ఇలా ఒకటా రెండా ఎవరికి తోచిన కామెంట్స్ వాళ్లు చేసేస్తున్నారు. అంతేకాదండోయ్.. ఈ ఫ్లెక్సీ వెనకవైపు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఒక బోర్డు కూడా ఉంది.. అయితే అది కూడా కనిపించకుండా బ్యానర్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబోనని జనాలు తిట్టుకుంటున్నారు. చూశారుగా.. ఇవి రెండు ఫ్లెక్సీ బ్యానర్లే..  ఒకటి అభిమానానికి సంబంధించిందైతే.. మరొకటి హెచ్చరిక జోడించిన సమాచారం. రెండింటినీ అనాలోచితంగా ఒక చోట పక్క పక్కనే చేర్చడం వల్ల నవ్వులపాలయ్యింది.. అందుకే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయండి ఓకే కానీ.. ఇలా ఎక్కడబడితే అక్కడ.. చూసుకోకుండా ఏర్పాటు చేసేసి నవ్వులపాలవ్వకండి అని సోషల్ మీడియా జనం సూచిస్తున్నారు.

Updated Date - 2022-03-02T16:45:26+05:30 IST