నేను ఢిల్లీ వెళ్లకుండా బీజేపీ కుట్ర

ABN , First Publish Date - 2020-11-29T07:14:59+05:30 IST

‘‘కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీలూ దేశాన్ని నడిపించడంలో విఫలమయ్యాయి. పేదరికం ఇంకా ఉండటానికి ఆ రెండు పార్టీలే కారణం. అందుకే, కొత్త పంథా రావాలి. కొత్త ఆవిష్కరణ జరగాలి. మూస ధోరణి పోవాలి. నేను ఇవన్నీ మాట్లాడితే.. ఢిల్లీలో గజగజ వణుకుతున్నరు. మంత్రాంగాలు చేస్తున్నరు. ఢిల్లీకి రాకుండా హైదరాబాద్‌లోనే కట్టడి

నేను ఢిల్లీ వెళ్లకుండా బీజేపీ కుట్ర

కొత్త పంథాపై నా మాటలతో గజగజ వణుకుతున్నరు

ఢిల్లీ రాకుండా హైదరాబాద్‌లో కట్టడి చేసే యత్నం

అందుకే, ఇక్కడికి వరదలా అక్కడి నాయకులు

వరదలు వచ్చినప్పుడు నగరానికి ఒక్కళ్లూ రాలేదు

బక్క కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి గింతమందా?

వరద సాయంగా ప్రధాని 13 పైసలూ ఇవ్వలేదు

అపార్టుమెంట్లవాసులకూ ఉచితంగా నల్లా నీళ్లు

తిడుతున్నా ఓపిక పడుతున్నాం.. చేవలేక కాదు

ఎల్బీ స్టేడియం బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌

బీపాస్‌ కావాలా? కర్ఫ్యూ పాస్‌ కావాలా తేల్చుకోవాలి. నగరం ప్రశాంతత దెబ్బతినకూడదు. 

గడబిడ ఉన్నచోటికి ఎవరైనా పోతారా? ఇప్పుడు వెల్లువలా 


పరిశ్రమలు వస్తున్నాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయి. వీటిని కాపాడుకోవాలి. అందుకు శాంతి, సామరస్యాలను పరిరక్షించుకోవాలి. అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కలిసుండే పూల బొకేలాంటి హైదరాబాద్‌ కావాలి.  యూపీ, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలకు చెందినవారు ఇక్కడ పని చేస్తున్నారు. కరోనా సమయంలో కేంద్రం మీ రక్తం తాగుతుంటే మేం ముందుకు వచ్చాం. 200 రైళ్లు ఏర్పాటు చేసి, రేషన్‌, డబ్బులు ఇచ్చి మీ ఊరికి పంపించాం.

- సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీలూ దేశాన్ని నడిపించడంలో విఫలమయ్యాయి. పేదరికం ఇంకా ఉండటానికి ఆ రెండు పార్టీలే కారణం. అందుకే, కొత్త పంథా రావాలి. కొత్త ఆవిష్కరణ జరగాలి. మూస ధోరణి పోవాలి. నేను ఇవన్నీ మాట్లాడితే.. ఢిల్లీలో గజగజ వణుకుతున్నరు. మంత్రాంగాలు చేస్తున్నరు. ఢిల్లీకి రాకుండా హైదరాబాద్‌లోనే కట్టడి చేయాలని చూస్తున్నరు. అందుకే, ఇక్కడికి వరదలా వస్తున్నరు’’ అని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. కేసీఆర్‌ గుద్దు గుద్దితే ఎలా ఉంటదో అందరికీ తెలుసని, అడ్డొచ్చినోళ్ల బొండిగె పిసికి తెలంగాణ తీసుకొచ్చానని చెప్పారు. దేశాన్ని కూడా కొత్త పంథాలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.


జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని ఇవ్వటం ద్వారా దేశానికి గ్రేటర్‌ ప్రజలు ఆ సందేశమివ్వాలని కోరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘‘వరదలకు ఇళ్లు మునిగాయని, పంటలు దెబ్బతిన్నాయని, వరద సాయం కింద రూ.1,350 కోట్లు ఇవ్వాలని ప్రధాన మంత్రిని కోరా. 13 పైసలు కూడా రాష్ట్రానికి ఇవ్వలేదు. మేం భారతదేశంలో లేమా? బెంగళూరు వంటి వేరే రాష్ట్రాలకు నిఽధులిస్తరు. హైదరాబాద్‌కు ఎందుకివ్వరు?’’ అని ప్రశ్నించారు. వరదలు వచ్చినప్పుడు నగరానికి రానోళ్లు ఇప్పుడు వరదలా, బురదలా వస్తున్నారని, బక్క కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు ఎక్కడెక్కడి నుంచో, ఏయే రాష్ట్రాల నుంచో గింతమంది తరలివస్తారా? అని ఎద్దేవా చేశారు. ఇవేమన్నా నేషనల్‌ ఎన్నికలా? గ్రేటర్‌ ఎన్నికలా? అని ప్రశ్నించారు. ‘‘ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి వచ్చాడు. మహారాష్ట్ర మాజీ సీఎం ఫడణవీస్‌ వచ్చారు. 29 రాష్ట్రాల్లో రాష్ట్ర తలసరి ఆదాయంలో యూపీ 28వ స్థానంలో ఉంటే, మహారాష్ట్ర పదో స్థానంలో ఉంది. తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. 28వ నంబర్‌లో ఉన్న సీఎం మన హైదరాబాద్‌కు వచ్చి ఏంచెప్తరు?’’అని ప్రశ్నించారు. ఎవరికి కర్రు కాల్చి వాత పెట్టాలో, ఎవరికి బుద్ధి చెప్పాలో నిర్ణయించాలని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. 


పిచ్చి ప్రేలాపనలకు ఆగం కావద్దు

‘‘పిచ్చి ప్రేలాపనలకు ఆకర్షితులై ఆగం చేసుకుంటే హైదరాబాద్‌ ఆగమైపోతది. భూములు, ఆస్తుల విలువలు పోతయి. పిల్లలకు ఉపాధి అవకాశాలు పోతయి. దయచేసి ఈ అవకాశం ఇవ్వొద్దు. కళకళలాడే హైదరాబాద్‌ను అందరం కలిసి కాపాడుకుందాం. పోయినసారి ఇచ్చిన దానికంటే ఐదారు సీట్లు ఎక్కువ ఇచ్చి టీఆర్‌ఎస్‌ను దీవించండి’’ అని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. విభజన రాజకీయాల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఆరేళ్ల తమ పాలనలో కుల, మత, ప్రాంతీయ వివక్ష టార్చిలైటు పెట్టి వెతికినా కనిపించలేదని, దానికి మీరంతా సాక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ.. అవన్నీ ఏ కులానికో, మతానికో చెందినవి కావని వివరించారు. ‘‘ఎన్నికలు చాలా జరుగుతుంటాయి. కానీ, ఓట్లేసే ముందు విచక్షణతో ఆలోచించాలి’’ అని అన్నారు.


వంచకుల గిమ్మిక్కులకు మోసపోవద్దు

‘‘బీపాస్‌ కావాలా? కర్ఫ్యూ పాస్‌ కావాలా తేల్చుకోవాలి. ఇప్పుడు వెల్లువలా పరిశ్రమలు వస్తున్నాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయి. వీటిని కాపాడుకోవాలి. అన్ని వర్గాలు, కులాలు, మతాలు కలిసుండే పూల బొకేలాంటి హైదరాబాద్‌ కావాలి’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ శాంతి సామరస్యాల నగరమని, ఇప్పుడు మనందరం కలిసి బతుకుతుంటే కొంతమంది వచ్చి ఏవో పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నారని, అవి మనకు ఏ రకంగానూ మంచివి కావని చెప్పారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి బాధ్యత ఉండదని, ఎన్నికల సమయంలో తియ్యగా మాట్లాడి పోతారని, ఆ తర్వాత సమస్యలు పరిష్కరించేది స్థానిక నేతలేనని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వంచకుల గిమ్మిక్కులకు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.


దుమ్ము దుమ్ము నశం కింద కొడతాం బిడ్డా..

‘‘నన్ను కూడా రారా పోరా అని మాట్లాడుతున్నరు. తూలనాడుతున్నరు. నేను టెంప్ట్‌ కావడం లేదు. మాకు పౌరుషం లేక కాదు. మేం తలచుకున్ననాడు దుమ్ము దుమ్ము నశం కింద కొడతాం బిడ్డా. ఓపిక, సంయమనం, బాధ్యతతో వ్యవహరిస్తున్నాం’’ అని చెప్పారు. తాము ఢిల్లీకి గులాములము కాదన్నారు. ప్రజలే తమ బాస్‌లు అని, వారి భద్రత తమ గుండెల నిండా ఉంటుందని అన్నారు. ‘‘ఇద్దరు ముగ్గురు మాట్లాడే మాటలకు సంయమనం కోల్పోం. మీలాగా ప్రేలాపనలు పేలం. ప్రజలకు న్యాయం జరగడానికి భగవంతుడు ఇచ్చిన శక్తియుక్తులతో పనిచేస్తాం’’ అని వ్యాఖ్యానించారు. తనకు రోజూ వందల ఫోన్లు వస్తున్నాయని, ఈ పిచ్చిని హైదరాబాద్‌ లోకి రానీయమని చెబుతున్నారని తెలిపారు. 


నా ప్రసంగాలను చెవి కోసుకుని వినేవారు

‘‘తెలంగాణ రాకముందు కేసీఆర్‌ ఉద్యమ నాయకుడు. అప్పుడు నా ప్రసంగాలను ప్రజలు చెవి కోసుకుని వినేవారు. లక్షలమంది హాజరయ్యేవారు. ఉద్యమ సమయంలో వాడివేడి, తీవ్రత ఎక్కువగా ఉండేది’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ఉద్యమ ప్రస్థానం ముగిసిందని, ఇప్పుడు రాజకీయ పరిణతితో పని చేస్తోందని, అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తమ పాలన చూసి చాలామంది ఆశ్చర్యపోయారని తెలిపారు.


మగతనమున్న పార్టీ టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏనాడూ పాక్షిక, పక్షపాత నిర్ణయాలు తీసుకోలేదని కేసీఆర్‌ చెప్పారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టినవన్నీ విశిష్ట పథకాలేనని అన్నారు.  ‘‘మిషన్‌ భగీరథ అద్భుతమైన కార్యక్రమం. చాలెంజ్‌ చేసి ప్రజలకు అందించిన గొప్ప పథకం. ఐదేళ్లలో పథకం పూర్తి చేయకపోతే.. ఓట్లు అడగమని చెప్పిన మగతనమున్న పార్టీ టీఆర్‌ఎస్‌’’ అన్నారు.


కిరికిరి పెడుతున్నరు నా కొడుకులు

‘‘ఎవడో తలకు మాసినోడు హైదరాబాద్‌ వరదల గురించి మాట్లాడుతున్నడు. ఒక్క హైదరాబాద్‌లోనే వరదలు రాలేదు. ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌ నగరాల్లో కూడా వరదలొచ్చాయి. కానీ, బీజేపీ, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలోనూ వరద సాయం అందించలేదు. నేనే ఇంటికి రూ.10 వేల ఆర్థిక సహాయం ప్రకటించాను’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లో గతంలో వరదలు వచ్చినప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఇంత పెద్దఎత్తున సహాయం అందించలేదని చెప్పారు. ‘‘వరద సాయం పంపిణీ చేస్తుంటే కిరికిరి పెడుతున్నరు నా కొడుకులు. ఒకడు పత్రం రాస్తడు. తర్వాత రాయలేదంటడు. ఈసీని ఇబ్బంది పెడతరు. ఇదేనా మీ విజ్ఞత? ఇదేనా మీ తెలివి?’’ అని ధ్వజమెత్తారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఇంటికి రూ.10 వేల చొప్పున 6.50 లక్షల కుటుంబాలకు రూ.650 కోట్లు పంపిణీ  చేశామని, ఇంకా 3-4 లక్షల కుటుంబాలు ఉండవవచ్చని, ఎన్నికలు పూర్తికాగానే డిసెంబరు ఏడో తేదీ నుంచి వారికీ ఆర్థిక సహాయం అందజేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.


అపార్టుమెంట్‌ వాసులకూ ఉచిత నల్లా నీళ్లు

ఉచిత నీటి సరఫరా ఎన్నికల తాయిలం కాదని, నగర ప్రజలకు శాశ్వతంగా తాను అందించిన కానుకని సీఎం కేసీఆర్‌ అన్నారు. నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి సదుపాయాన్ని అపార్ట్‌మెంట్‌వాసులకూ వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. దానిపై అపార్ట్‌మెంట్‌వాసులు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సి అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ 24 గంటల మంచినీరు అందించాలన్నది తన కల అని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 90 శాతం పైచిలుకు మంచినీటి సమస్యకు పరిష్కారం చూపామని, మిగిలిన 10 శాతాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. రాబోయే కొన్ని నెలల్లోనే హైదరాబాద్‌లో 24 గంటల మంచినీటి సరఫరా చేస్తామన్నారు.


హైదరాబాద్‌కు ఏటా 10 వేల కోట్లు

‘‘హైదరాబాద్‌ అశాస్త్రీయంగా పెరిగింది. ఇందుకు గత ప్రభుత్వాలదే బాధ్యత. తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.60 వేల నుంచి రూ.70 వేల కోట్లు నగరాభివృద్ధికి ఖర్చు చేశాం. కేంద్రం పట్టించుకోకపోయినా, నిధులు ఇవ్వకపోయినా సిటీని అభివృద్ధి చేశాం. వరదల ముప్పు నుంచి హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సి ఉంది. ఇకనుంచి ప్రతి బడ్జెట్‌లో హైదరాబాద్‌ నగరాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తాం’’ అని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. నాలాల కబ్జాలు తొలగిస్తామని, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు తయారుచేసి హైదరాబాద్‌కు శాశ్వతంగా వరదల నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పారు. నగరం మధ్యలో ఉన్న పరిశ్రమలను బయటకు పంపించి కాలుష్యం నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని, ఇతర నగరాల తరహాలో హైదరాబాద్‌లో ఆక్సిజన్‌ కొనుక్కునే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. మెట్రో రైలును శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుతోపాటు నగరంలో అవసరమున్న ప్రాంతాలకు పొడిగిస్తామని చెప్పారు. ఆరేళ్లలో అభివృద్ధి చేశామని, ఇంకా మెరుగైన హైదరాబాద్‌ను నిర్మించుకోవాల్సి ఉందని, తెలంగాణ అభివృద్ధిపై తనకే తపన ఉందని, నగరాన్ని ఆగం చేసేది లేదని, అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - 2020-11-29T07:14:59+05:30 IST