మేడ్చల్‌పై సీఎం నజర్‌

ABN , First Publish Date - 2020-10-30T10:21:15+05:30 IST

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మేడ్చల్‌జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్‌ను గురువారం జిల్లాలోని మూడుచింతలపల్లి తహసీల్దార్‌ ..

మేడ్చల్‌పై సీఎం నజర్‌

జిల్లాలో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం

మూడుచింతలపల్లి మండలం నుంచి ధరణి పోర్టల్‌ ప్రారంభం

రెవెన్యూ సంస్కరణాలూ ఇక్కడి నుంచే షురూ..

కూరగాయల పంటల సాగుకు ప్రోత్సాహం

ప్రత్యేకంగా హార్టికల్చర్‌ అధికారులను నియమించాలని ఆదేశం


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) :ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మేడ్చల్‌జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్‌ను గురువారం జిల్లాలోని మూడుచింతలపల్లి తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ప్రారంభించారు. అనంతరం లింగాపూర్‌తండా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గతంలో తాను పర్యటించిన సందర్భంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఈ ప్రాంతానికి మంజూరు చేశానని, త్వరలోనే అన్నింటినీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. మూడుచింతలపల్లి వేదికపైనే మూడేళ్ల క్రితం రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నట్లు ప్రకటించామని, ఈ గ్రామం రెవెన్యూ సంస్క రణలకు వేదికైందని వెల్లడించారు. మూడు చింతలపల్లికి ప్రత్యేకమైన గౌరవం దక్కిందని సీఎం కేసీఆర్‌ అన్నారు.


తెలంగాణ ముద్దుబిడ్డ వీరారెడ్డి 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వారిలో అగ్రగణ్యులని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాడి జైలుపాలైన వీరారెడ్డి సేవలను ఆయన కొనియాడారు. ఆ మహానీయుడు పుట్టిన గ్రామంలో ధరణి పోర్టల్‌ కార్యక్రమం నిర్వహించాలని భావించి.. ఽప్రారంభించినట్లు వెల్లడించారు. మూడుచింతలపల్లి మండలానికి తహసీల్దార్‌తోపాటు సిబ్బంది పోస్టులు మంజూరు లేవని పలువురు ప్రజాప్రతనిధులు, అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం స్పందిస్తూ తహసీల్దార్‌ పోస్టుతోపాటు మిగతా పూర్తిస్థాయి సిబ్బందిని రెండురోజుల్లోగా మంజూరు చేస్తామని ప్రకటించారు. మండలంలోని లక్ష్మాపూర్‌ గ్రామానికి నక్ష కూడా లేదని, తాను పర్యటించిన సందర్భంలో నక్ష ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. మూడుచింతలపల్లి మండలానికి కాళేశ్వరం జలాలు వస్తాయి. కాలువలు త్వరలోనే పూర్తిచేస్తాం. ఏప్రిల్‌, మే నెలల్లోనూ చెరువుల్లో నీళ్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


తాను ఫాంహౌజ్‌కు వెళ్లేటప్పుడు ఈ గ్రామాల నుంచే వెళ్తానని, పందిరి తోటలు, కూరగాయల పంటలను పరిశీలిస్తానని తెలిపారు. ఈ ప్రాంత రైతులు సొర, బీర, కాకర తదితర కూరగాయాలు సాగుచేస్తారని, నిత్యం హైదరాబాద్‌కు తరలించి విక్రయిస్తారని తెలిపారు. ఈప్రాంత రైతులను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు వస్తున్నందున అద్భుతమైన పంటలను సాగు చేయాలని కోరారు. హైదరాబాద్‌ నగరంలో కోటి మంది జనాభా ఉంటుందని, నిత్యం 20లక్షల మంది ఇతర ప్రాంతాల నుంచి వస్తారని తెలిపారు. నగరానికి సరిపడా కూరగాయాలు పండించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరానికి చేరువలో ఉన్న ప్రాంతాల్లో భూమి పంచాయతీలు లేకుండా ఉన్నట్లయితే పంటల ఉత్పత్తులు పెరిగి, రైతులు ఆర్థికంగా లాభపడతారని వెల్లడించారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో ఉద్యానవన, కూరగాయల పంటల కార్యకలాపాలు పెంచాలని, ప్రత్యేకంగా హార్టికల్చర్‌ అధికారులను నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌కు సూచించారు.

Updated Date - 2020-10-30T10:21:15+05:30 IST