మక్కల సాగు వద్దు

ABN , First Publish Date - 2020-10-14T06:36:16+05:30 IST

రాష్ట్రంలో రైతులు మొక్కజొన్న పంట వేయొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.

మక్కల సాగు వద్దు

మొక్కజొన్నకు మద్దతు ధర రాదు

క్వింటాలుకు రూ.800 నుంచి రూ.900 లోపే

అయినా పండిస్తామంటే రైతు ఇష్టం

లాభదాయక పంటలను ప్రోత్సహించాలి

వ్యవసాయాధికారులు రైతు నేస్తాలు కావాలి

నాలుగంచెల వ్యూహాన్ని అమలు చేయాలి

వ్యవసాయ శాఖాధికారులతో భేటీలో సీఎం కేసీఆర్‌


మొక్కజొన్నలకు గిట్టుబాటు ధర రాదు. వానాకాలం మాత్రమే కాదు.. యాసంగిలో కూడా మక్కలకు మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదు. క్వింటాలుకు రూ.800 నుంచి రూ.900 లోపే వస్తుంది. అందుకే మొక్కజొన్న పంట వేయొద్దు. ఈ విషయాన్ని వ్యవసాయాధికారులు రైతులకు స్పష్టంగా చెప్పాలి. అయినా మక్కలు పండిస్తామంటే.. రైతుల ఇష్టం.



హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులు మొక్కజొన్న పంట వేయొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మక్కలకు గిట్టుబాటు ధర రావడంలేదని, క్వింటాలుకు రూ.800-900 మించి ధర పలకడం కష్టమని పేర్కొన్నారు. రైతులకు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పి.. అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ ఉద్యోగులదేనన్నారు. మంగళవారం ప్రగతి భవన్‌లో అన్ని జిల్లాలు, రాష్ట్ర స్థాయి వ్యవసాయశాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ‘‘రైతులు ప్రభుత్వ సూచనలను గౌరవించి నియంత్రిత సాగుకు అలవాటు పడుతున్నరు. వారికి.. ఎప్పటికప్పుడు వివరించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖదే. అధిక దిగుబడులతో పంటలు పండిచడమే కాదు.. వాటికి మంచి ధర వచ్చేలా మార్కెటింగ్‌ పద్ధతులపై వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి’’ అని సీఎం అన్నారు. 


దేశానికే ఆదర్శంగా తెలంగాణ వ్యవసాయం

‘‘తెలంగాణ రాష్ట్ర సాధనానంతరం మొదట ప్రారంభించిన ప్రభుత్వ కార్యక్రమం మిషన్‌ కాకతీయ. వలస పాలకులు ఆగం చేసిపోయిన గొలుసుకట్టు చెరువులను పునరుజ్జీవింపజేసుకున్నాం. వాటిని సాగునీటి ప్రాజెక్టులతో నింపుకొన్నాం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు నిత్యం మత్తడి దుంకుతున్నయి. బోర్లు పైకి ఉబుకుతున్నయి. రైతులు స్వయం సమృద్ధితో పంటలు పండిస్తున్నారు. తెలంగాణ వ్యవసాయం దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్ర విభజన సమయానికి కేవలం 4 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములను 24 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యానికి పెంచడం మామూలు విషయం కాదు. వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు జిల్లా ఇవ్వాళ అత్యధిక వర్షపాతం కలిగిన జిల్లాగా మారిపోయింది.


ఇప్పుడు ఇతర జిల్లాల నుంచే అక్కడికి వ్యవసాయ కూలీలు వలస వస్తున్నరు’’ అని సీఎం వివరించారు. రేపు రాబోయే యాసంగి సీజన్‌కు దాదాపు 70 లక్షల ఎకరాలు వ్యవసాయానికి సిద్ధమైనట్లు ఉన్నతాధికారులు రిపోర్టులు సిద్ధం చేశారంటేనే తెలంగాణ వ్యవసాయం దేశంలోనే నంబర్‌వన్‌ స్థానానికి చేరుకున్నట్లు స్పష్టమవుతోందన్నారు. గతంలో వ్యవసాయం చేసేవారికి పిల్లనివ్వాలంటే ఇష్టపడేవారు కాదని, కానీ.. నేడు ఐటీ రంగంలో ఉన్నతస్థాయిలో జీతాలు తీసుకునే యువతీ యువకులు కూడా వ్యవసాయం బాట పట్టారని తెలిపారు. తెలంగాణ రైతు సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలతోపాటు కేంద్రాన్ని కూడా ప్రభావితం చేశాయన్నారు. 


రైతుకు గౌరవం రావాలి

అభివృద్ధి చెందిన దేశాల్లో రైతును గౌరవిస్తారని, మన వద్ద కూడా ఆ పరిస్థితి రావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్ర ప్రజలు ఏమేమి తింటారనేది తెలుసుకునేందుకు సర్వే చేయిస్తే.. ఒకప్పుడు గ్రామాల్లో ఉచితంగా లభ్యమయ్యే చింతపండుకు లోటు ఏర్పడినట్లు తేలిందని తెలిపారు. తెలంగాణ ప్రజలు 58 వేల మెట్రిక్‌ టన్నుల చింతపండును వినియోగిస్తారని తేలడంతో అప్పటికప్పడు అటవీశాఖను అప్రమత్తం చేసి భారీ స్థాయిలో చింతచెట్లను నాటించామని పేర్కొన్నారు. ప్రపంచానికే విత్తనాలను అమ్ముతున్న రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతోందని, గుజరాత్‌ వ్యాపారులు ఆ రాష్ట్రంలో పండే పత్తిని పక్కన పెట్టి, తెలంగాణ పత్తిని కొంటున్నారని తెలిపారు.


తెలంగాణ సోనా రకం వరి బియ్యాన్ని డయాబెటిక్‌ రోగులు తినవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు పరిశీలించి అక్కడి పత్రికల్లో ప్రచురించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పంటలు ఇక నుంచి బుల్లెట్లలా దూసుకువస్తాయని, వ్యవసాయశాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సరైన దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను, యాంత్రీకరణను విరివిగా ఉపయోగించాలని, ఆ దిశగా రైతాంగాన్ని చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టాలని సీఎం అన్నారు. వ్యవసాయ శాఖ రైతు సంక్షేమ బాధ్యతను భుజాన వేసుకునే సమయం ఆసన్నమైందన్నారు. ఇందుకోసం నాలుగంచెల వ్యూహాలను రూపొందించుకోవాలని సూచించారు. రైతులు సరైన ధరలు వచ్చే పంటలను మాత్రమే పండించేందుకు ప్రణాళికలు తయారు చేయడం, మార్కెట్‌లో కల్తీ విత్తనాలు లభ్యం కాకుండా జాగ్రత్త పడుతూ నాణ్యమైన విత్తనాలను రైతులకు సరఫరా చేయడం, సరైన సమయంలో ఎరువులను అందించడం, రైతు పండించిన పంటకు మంచి ధరలు లభించేలా చూడడమనే వ్యూహాలను అమలు చేయాలన్నారు. 


ఖాళీలను వెంటనే భర్తీ చేయండి..

‘‘వ్యవసాయ శాఖలో ప్రమోషన్లు పెండింగులో ఉంటే వెంటనే ఇచ్చేయండి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులే అయితే ఒకేచోట పనిచేసేలా వారి బదిలీకి ఉత్తర్వులు సిద్ధం చేయండి. పదవీ విరమణ పొందిన ఉద్యోగులను గౌరవంగా సత్కరించి ఇంటికి సాగనంపాలి. వ్యవసాయశాఖ ఇకనుంచి సాదాసీదా డిపార్టుమెంటుగా కాకుండా.. డైనమిక్‌ డిపార్టుమెంట్‌గా మారబోతోంది’’ అని సీఎం అన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు రంజిత్‌రెడ్డి, లింగయ్యయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-14T06:36:16+05:30 IST