ఏపీది రాద్ధాంతం

ABN , First Publish Date - 2020-08-11T09:30:47+05:30 IST

‘‘తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి తప్పు. రాష్ర్టానికున్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం.

ఏపీది రాద్ధాంతం

  • పిలిచి పీట వేస్తే.. 
  • కెలికి కయ్యం పెట్టుకుంటోంది
  • నోరు మూయించేలా వాదనలు తిప్పికొడతాం
  • మన ప్రాజెక్టులపై మళ్లీ మాట్లాడకుండా చేస్తాం
  • వాటా ప్రకారమే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం
  • అనుమతులున్న వాటిపై అభ్యంతరాలు తగదు
  • రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వైఖరి
  • దీనిని దేశం మొత్తానికి తెలిసేలా చేస్తాం
  • ఉమ్మడిలోనే ఉన్న ప్రాజెక్టులను తెలంగాణ 
  • అవసరాల మేరకు రీ డిజైన్‌ చేసుకున్నాం
  • ఏపీకి, కేంద్రానికి దీటుగా జవాబు ఇద్దాం
  • ఉన్నత స్థాయి సమీక్షలో టీ-సీఎం కేసీఆర్‌’

హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి తప్పు. రాష్ర్టానికున్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ ఏర్పడేనాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదు’’ అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాన్ని అవలంబిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు జలవనరుల శాఖ అధికారులతో సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. ‘‘శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతరపెడుతోంది. వాస్తవానికి, నాగార్జున సాగర్‌ నింపిన తర్వాతే మిగిలిన ప్రాజెక్టులు నింపాలి’’ అని తెలిపారు. 


‘‘నా అంతట నేనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పెద్దలను పిలిచి, పీటేసి, అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ర్టాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని ేస్నహహస్తం అందించాను. బేసిన్లు లేవు.. భేషజాలు లేవని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాను. కానీ, ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోంది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థం లేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తోంది. అపెక్స్‌ కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నోరు మూయించేలా, అర్థరహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెబుదాం’’ అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో రాష్ర్టానికి ఉన్న హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని తెలిపారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో చాలా ప్రాజెక్టుల డిజైన్‌ తెలంగాణ అవసరాలకు తగ్గట్టుగా చేయలేదు. అందుకే, తెలంగాణ వచ్చిన తర్వాత  రీడిజైన్‌ చేసి నిర్మిస్తున్నాం. దీన్ని తప్పు పట్టడంలో అర్థం లేదు’’ అని కేసీఆర్‌ మండిపడ్డారు.


‘‘గతంలో జరిగిన మొదటి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంధ్రలో చేపట్టిన ముచ్చుమర్రిని తెలంగాణ ప్రస్తావించింది. దాంతో, రెండింటినీ కొనసాగించాలనే నిర్ణయం జరిగింది. మళ్లీ ఆ అంశాన్ని లేవనెత్తడం సరికాదు’’ అని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.  తెలంగాణకు ఇంకా నీటి అవసరం ఉందని, గోదావరి మిగులు జలాల్లో మరో వెయ్యి టీఎంసీలు దక్కాల్సి ఉందని చెప్పారు.  

Updated Date - 2020-08-11T09:30:47+05:30 IST