సా..గుతున్న బుజ్జగింపులు!

ABN , First Publish Date - 2022-04-14T08:21:44+05:30 IST

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. పదవులు దక్కని నేతల్లో నెలకొన్న ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు సీఎం..

సా..గుతున్న బుజ్జగింపులు!

ఎట్టకేలకు సుచరితకు సీఎం పిలుపు

2024 ఎన్నికల కోసమే తప్పించాం

మళ్లీ అధికారంలోకి వస్తున్నాం

ప్రభుత్వాన్ని కలిసి నడుపుదాం

మాజీ మంత్రికి జగన్‌ హామీ

తోపుదుర్తి, కాపుతోనూ భేటీ

రగిలిపోతున్న గొల్ల బాబూరావు

తాడేపల్లిలో కార్యకర్తల శిబిరం

సలహాదారు సజ్జలతో సమావేశం


అమరావతి/విజయవాడ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. పదవులు దక్కని నేతల్లో నెలకొన్న ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి మూడ్రోజులుగా బుజ్జగింపులు చేపడుతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, మాజీ మంత్రి కొలుసు పార్థసారథిని మంగళవారం తన వద్దకు పిలిపించుకుని నచ్చజెప్పిన ఆయన.. దళిత నాయకురాలు, హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరితను మాత్రం విస్మరించారు. ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా పట్టించుకోలేదన్న ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో వైసీపీ అధిష్ఠానం కదిలింది. సుచరితకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్‌ కాల్‌ వెళ్లింది. ముఖ్యమంత్రిని కలవాలని సూచించారు. దీంతో బుధవారం ఆమె తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రిని కలిశారు. తనకు జరిగిన అవమానం గురించి వివరించారు. తనను తప్పించిన తీరుకు ఆవేదన చెందే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశానని తెలిపారు. అయితే జగన్‌ ఆమెను బుజ్జగించారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఆమెను తప్పించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. 2024లో మరోసారి అధికారంలోకి వస్తున్నామని.. సమష్టిగా అందరమూ కలసి ప్రభుత్వాన్ని నడుపుదామని భరోసా ఇచ్చారు. మరోవైపు.. ఎవరూ ఊహించని విధంగా తోపుదుర్తి ప్రకాశరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి కూడా మంత్రివర్గంలో స్థానం దక్కలేదని అలగడం ప్రభుత్వ పెద్దలను విస్మయపరచింది. వారి నియోజకవర్గాల్లో అనుచరులు, వైసీపీ కార్యకర్తలు శాంతించడం లేదు. దీంతో వారిద్దరినీ సీఎం తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. 2024 ఎన్నికల్లో మరింత ప్రజారంజకంగా ప్రభుత్వాన్ని నడుపుదామని అనునయించారు.


బాబూరావు అనుచరులు క్యూ

పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా అక్కడి నుంచి 200 మంది నాయకులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, కార్యకర్తలు బుధవారం ప్రత్యేక వాహనాల్లో అమరావతి చేరుకున్నారు. తొలుత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్తలు చిక్కాల రామారావు, బొలిశెట్టి గోవిందరావు, వీసం రామకృష్ణ, సూర్యనారాయణరాజుపై ఫిర్యాదు చేశారు. అనంతరం బాబూరావు నివాసంలో మరో సమావేశం నిర్వహించుకున్నారు. నియోజకవర్గంలో వర్గపోరును సృష్టిస్తున్న వారిని పార్టీలో కొంతమంది పెద్దలు ప్రోత్సహిస్తున్నారని కార్యకర్తలు మండిపడ్డారు.


ఇకపై హింసావాదిగానే ఉంటా..

మరోవైపు తనను సౌమ్యుడని అంటారని.. కానీ పుట్టుకతోనే హింసావాదినని బాబూరావు అన్నారు. అనుచరులతో సమావేశం అనంతరం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘హింస అంటే నాకు చాలా ఇష్టం. ఉద్యోగంలో చేరాక అహింసావాదిగా మారా. రాజకీయరంగ ప్రవేశం చేశాక హింస జోలికి పోలేదు. అహింసావాదిగా ఉండడం వల్ల ప్రయోజనం లేదని తెలిసింది. దాని వల్ల లాభం లేదని గ్రహించా ను. ఇక నుంచి దెబ్బకు దెబ్బ.. పట్టుకు పట్టు అన్నట్లుగానే ఉంటాను’ అని అన్నారు. గతంలో జగన్‌ కోసం ఎమ్మెల్యే పదవిని వదులుకున్నానని.. 3సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినా గుర్తించలేదని.. మంత్రి పదవి ఇవ్వలేదని ఆక్రోశించారు. అన్ని విధాలా న్యాయం చేస్తామని సజ్జ ల హామీ ఇచ్చారని, త్వరలో సీఎంను కలిసే అవకాశం ఇప్పిస్తానని చెప్పారని తెలిపారు.




తూచ్‌.. అది రాజీనామా లేఖ కాదు!

థ్యాంక్స్‌ చెబుతూ రాశా: సుచరిత


గుంటూరు, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): కొత్త మంత్రి వర్గంలోకి తనను తిరిగి తీసుకోలేదని అలిగిన మాజీ మంత్రి మేకతోటి సుచరిత.. జగన్‌తో జరిగిన భేటీలో ఆయన నుంచి హామీ రావడం వల్లో.. ఇంకే కారణమో గానీ.. రాజీనామా చేశాననడాన్ని ఖండించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్‌ను, వైసీపీని వీడనని ప్రకటించారు. రాజీనామా విషయాన్ని తన పిల్లలు తొందరపాటుతో చెప్పారని సమర్ధించుకున్నారు. అంతే కాదు.. ఆ రోజున మోపిదేవికి తాను అందజేసింది రాజీనామా లేఖ కాదని.. తనకు హోం మంత్రి పదవిని ఇచ్చి ఇంత కాలం కొనసాగించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ రాసిన లేఖని చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-04-14T08:21:44+05:30 IST