Abn logo
Sep 28 2021 @ 02:49AM

అవినీతికి చోటు ఇవ్వకండి

  • దాతలు విరాళాలను ఆన్‌లైన్‌లో ఇవ్వాలి
  • దుర్గగుడి అభివృద్ధికి 70 కోట్లు
  • దేవదాయ శాఖ సమీక్షలో సీఎం జగన్మోహన్‌రెడ్డి


అమరావతి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘‘దాతలు ఆన్‌లైన్‌ ద్వారా ఆలయాలకు విరాళాలు ఇవ్వొచ్చు. ఆన్‌లైన్‌ పద్ధతులు, విధానాలను వివరిస్తూ ఆలయాల్లో పెద్ద బోర్డులు ఏర్పాటు చేయాలి. దాతలు ఇచ్చిన విరాళాలు ఆలయాల అభివృద్ధికి ఉపయోగపడాలి. దేవదాయశాఖలో అవినీతికి చోటు ఉండకూడదు’’ అని సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో దేవదాయశాఖపై సోమవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీటీడీ అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఇతర ఆలయాల్లోనూ ప్రవేశపెట్టాలన్నారు. దుర్గగుడిలో అభివృద్ధి పనులకు రూ.70 కోట్ల నిధులను చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేస్తోందని చెప్పారు. ప్రతి దేవాలయంలో ప్రసాదాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తిరుమలలో లడ్డూ తయారీ విధానాలు ఇతర ఆలయాల్లోనూ వచ్చేలా చూడాలని సూచించారు. అన్ని ఆలయాలకూ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేవుడి భూముల పరిరక్షణ కోసం అన్ని భూములను సర్వే చేసి వాటికి జియో ట్యాగింగ్‌ చేయాలని ఆదేశించారు. ఆలయ భూముల పరిరక్షణ కోసం ప్రతి జిల్లాలో కలెక్టర్‌, ఎస్పీ, ఒక ప్రభుత్వ న్యాయవాదితో ఒక కమిటీని ఏర్పాటుచేసేలా ఆలోచన చేయాలని సూచించారు.  అన్ని ఆలయాల్లో సీసీ కెమేరాలు ఉండాలని స్పష్టం చేశారు. దేవదాయశాఖలో విజిలెన్స్‌, సెక్యూరిటీ కోసం ఒక ఎస్పీ స్థాయి అధికారిని నియమించాలని ఆదేశించారు. అర్చకులందరికీ వంశపారంపర్య హక్కులు అమలు చేయాలన్నారు.  


బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

త్వరలో ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని సీఎం జగన్‌ను టీటీడీ ఆహ్వానించింది. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలో సీఎంను కలిసి ఆహ్వానపత్రం అందజేశారు. అలాగే శరన్నవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొనాలని విజయవాడ కనకదుర్గ ఆలయ అధికారులు, భ్రమరాంబ మల్లిఖార్జుస్వామి దసరా ఉత్సవాలకు హాజరుకావాలని శ్రీశైలం దేవస్థానం అధికారులు సీఎంను ఆహ్వానించారు.