చెరకు రైతులను వంచించిన సీఎం జగన్‌

ABN , First Publish Date - 2021-10-17T06:47:25+05:30 IST

జిల్లాలో చెరకు రైతులను సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వం దారుణంగా వంచించిందని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు విమర్శించారు.

చెరకు రైతులను వంచించిన సీఎం జగన్‌
సమావేశంలో మాట్లాడుతున్న బుద్ద నాగజగదీశ్‌

టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద


అనకాపల్లి, అక్టోబరు 16: జిల్లాలో చెరకు రైతులను సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వం దారుణంగా వంచించిందని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు విమర్శించారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలో గోవాడ, ఏటికొప్పాక, తాండవ సహకార చక్కెర కర్మాగారాల్లో చెరకు రైతులకు సుమారు రూ.60 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. గత సీజన్‌లో సరఫరా చేసిన చెరకుకు సంబంధించిన బకాయిలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది రైతులను ఎలా ఆదుకుంటారో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రాంత రైతులు పండించిన చెరకును ఎక్కడికి తరలించాలో తెలియక అయోమయానికి గురవుతున్నారన్నారు. ప్రధానంగా చోడవరం చక్కెర కర్మాగారం యాజమాన్యం, అధికార పార్టీ నాయకులు అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్వయంగా సీఎంకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. దసరాకు చెరకు రైతుల బకాయిలు చెల్లిస్తామని ముగ్గురు మంత్రులు ప్రకటన చేసినప్పటికీ అమలు కాలేదన్నారు. తక్షణమే రైతులకు చెరకు బకాయిలు చెల్లించకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని జగదీశ్‌ హెచ్చరించారు. సమావేశంలో టీడీపీ నాయకులు ఉగ్గిన రమణమూర్తి, కె.వెంకట్రావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T06:47:25+05:30 IST