పవన్ ప్రచారంతో జగన్‌లో ఆకస్మిక మార్పు?

ABN , First Publish Date - 2021-04-08T07:50:44+05:30 IST

ఆయన అనుకున్నట్లుగా అక్కడ ఐదు లక్షల మెజారిటీ వచ్చే అవకాశం లేదని నిఘా వర్గాలు చెప్పినట్లు సమాచారం...

పవన్ ప్రచారంతో జగన్‌లో ఆకస్మిక మార్పు?

    • తిరుపతి ‘ఉప’ ప్రచారానికి సీఎం జగన్‌
    • వెళ్లక తప్పని పరిస్థితి!..
    • మెజారిటీపై సడలిన ధీమా?
    • 14న తిరుపతిలో రోడ్‌షో, బహిరంగ సభ
    • హోదా, విశాఖ ఉక్కుపై నిలదీస్తున్న టీడీపీ
    • ప్రభుత్వ వైఫల్యాలపై గళం పెంచిన బీజేపీ
    • కమలానికి మద్దతుగా పవన్‌ ప్రచారం
    • ఈ పరిణామాలతోనే జగన్‌లో ఆకస్మిక మార్పు?
    • స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయం!
    • 14న ఒకే రోజు అటు జగన్‌... ఇటు బాబు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలోకి దిగనున్నారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి విజయం కోరుతూ ఈ నెల 14న తిరుపతిలో పార్టీ నిర్వహించే ర్యాలీలో, బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. తిరుపతి ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల నుంచి నిన్నమొన్నటి దాకా ఆ  యన ప్రచారంపై వైసీపీ స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల తిరుపతిలో ఆ పార్టీ ముఖ్య నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో.. సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయని.. జగన్‌ వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం లేదని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ధీమాగా చెప్పారు. కానీ ఇంతలోనే జగన్‌ ప్రచార రంగంలోకి దిగడం విస్మయం కలిగిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆయన ఆకస్మిక నిర్ణయానికి.. నిఘా వర్గాల సమాచారమే ప్రధాన కారణమని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని.. పోటీ గట్టిగానే ఉందని.. ఆయన అనుకున్నట్లుగా అక్కడ ఐదు లక్షల మెజారిటీ వచ్చే అవకాశం లేదని నిఘా వర్గాలు చెప్పినట్లు సమాచారం.


రెండ్రోజుల కింద నెల్లూరు జిల్లాలోనూ, తిరుపతిలోనూ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు నిర్వహించిన ప్రచార సభలు వెలవెలపోవడం.. పెద్దగా జనం రాకపోవడం.. స్థానిక నేతల కుమ్ములాటలు బహిర్గతం కావడం వైసీపీ అధినేతను కలవరపరిచాయని అంటున్నారు. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇక్కడ స్థానిక ఎన్నికల్లో కంటే మెరుగ్గా కనిపించడమూ జగన్‌ ఆలోచనలో మార్పు తెచ్చిందని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వెళ్లి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఓటర్లను తాను అభ్యర్థించాల్సిన అవసరం లేదని.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తనకు వారు తప్పక మద్దతు పలుకుతారని ధీమాగా చెప్పిన ఆయనలో.. ఎందుకింత మార్పు వచ్చిందన్న చర్చ సర్వత్రా సాగుతోంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే గీటురాయి. కానీ అధికారపక్షం స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాల పేరిట అక్రమాలకు తెరతీసింది. తిరుపతి ఉప ఎన్నిక వచ్చేసరికి విపక్షాల నేతలు నిర్భయంగా గళమెత్తడం ప్రారంభించారు. ఇక్కడ అక్రమాలకు పాల్పడితే.. జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తుందని.. అది తమ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని వైసీపీ నాయకత్వం భావించింది. పైగా లోక్‌సభ ఉప ఎన్నికలో ఏకగ్రీవం సాధ్యమయ్యేది కాదని గ్రహించింది.


ఓటమి భయంతోనే జగన్‌ తిరుపతి పర్యటన: ‘దేవినేని’

తిరుపతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): ఉప ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న భయంతోనే సీఎం జగన్‌ తిరుపతి పర్యటన ఖరారు చేసుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తిరుపతి టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు ఎన్ని దౌర్జన్యాలు చేయాలో అన్నీ చేశారు. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నిక కేంద్ర ఎన్నికల సంఘం నేతృత్వంలో జరుగుతుంది కాబట్టి భయం పట్టుకుంది. ఈ ఉప ఎన్నికల్లో బూతుల మంత్రులకు, జగన్‌ అహంకారానికి ఓటు అనే ఆయుధంతో ఫుల్‌స్టాప్‌ పడనుంది’’ అని చెప్పారు.


టీడీపీ, జనసేనపై వ్యూహాత్మక దాడి..!

2019 ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాన్నే తిరుపతి ఉప ఎన్నికలోనూ వైసీపీ అమలు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేసినా ఈ రెండు పార్టీలూ ఒక్కటేనన్న ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది. ఈ ప్రచారం వైసీపీకి లబ్ధి చేకూర్చింది. దాంతో ఇప్పుడూ అదే ఎత్తుగడ అమలు చేస్తోంది. వాస్తవానికి తిరుపతి ఉప ఎన్నిక ప్రకటనకు ముందు రాష్ట్ర బీజేపీ నేతలు వైసీపీని తమ ప్రత్యర్థిగా చూడలేదు. పైగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ టీడీపీనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. అయితే.. తిరుపతిలో ప్రచారానికి జనంలోకి వెళ్లినప్పుడు.. అధికార పక్షమైన వైసీపీని కాకుండా ప్రతిపక్ష టీడీపీని విమర్శించడం సరికాదన్న సత్యాన్ని గుర్తించారు. జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో.. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని ఎందుకు కోరడం లేదని టీడీపీ వేస్తున్న ప్రశ్నలకు ఓటర్లు సైతం ప్రభావితులవుతున్నారని వైసీపీ నాయకత్వానికి అర్థమైంది.


జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడా ప్రచారానికి రావడం, బీజేపీ జాతీయ నాయకులు కొందరు నేరుగా జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగడం, బెయిల్‌ త్వరలో రద్దుకాబోతోందని రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌ ప్రకటించడం.. ఇదే సమయంలో జగన్‌, విజయసాయిరెడ్డిల బెయిల్‌ రద్దుచేయాలంటూ వైసీపీకే చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం వంటి పరిణామాలు సహజంగానే జగన్‌, వైసీపీలో కలవరం పెంచాయి. ఈ పరిస్థితుల్లో జగన్‌ వేసుకున్న ఐదు లక్షల మెజారిటీ లెక్క తప్పుతుందోమోనన్న ఆందోళన కూడా ఆయన ప్రచారంలో పాల్గొనేందుకు ఒక కారణమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.


‘సంక్షేమ పథకాలను అందుకుంటున్న ప్రజలే వైసీపీకి ఓటేస్తారు. స్వయంగా నేను ప్రచారానికి వెళ్లాల్సిన అవసరం లేదు’ అని స్థానిక ఎన్నికల సమయంలో మంత్రులు, పార్టీ నేతలతో సీఎం జగన్‌ చెప్పారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించాక.. వారు ఇదే విషయాన్ని గర్వంగా చెప్పుకొన్నారు. అయితే ఇప్పుడాయన తిరుపతి ప్రచారానికి ఎందుకు వెళ్తున్నట్లు అని సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతలోనే జనం ఓట్లేయరన్న అపనమ్మకం ఏర్పడిందా అని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. 

Updated Date - 2021-04-08T07:50:44+05:30 IST