ఏపీ పోలీసులకు జగన్ టోపీ..

ABN , First Publish Date - 2022-02-02T16:19:05+05:30 IST

ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ పోలీసులతో అణచివేస్తున్న జగనన్న ప్రభుత్వం చివరికి ఆ పోలీసులకు టోపీ పెట్టింది.

ఏపీ పోలీసులకు జగన్ టోపీ..

అమరావతి: వైసీపీ ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇలా.. ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ పోలీసులతో అణచివేస్తున్న జగనన్న ప్రభుత్వం చివరికి ఆ పోలీసులకు టోపీ పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలో కీలక అంశమైన హెచ్ఆర్ఏ తగ్గింపు పోలీసులకు వర్తించబోదంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం చేసి చివరికి దెబ్బ కొట్టింది. అయితే 23.29 శాతం ఫిట్‌మెంట్ లెక్కలేసి మొత్తం కూడితే జీతం తగ్గలేదు అన్న భావన కలిగించింది. కానీ ప్లే స్లిప్పులో హెచ్ఆర్ఏ వేలల్లో వ్యత్యాసం కనిపించడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. అంతర్గత సంభాషణల్లో పోలీస్ భాషలోనే యూనియన్ నేతలపై, ప్రభుత్వ పెద్దలపై విరుచుకుపడుతున్నారు.


ఇక వీక్లీ ఆఫ్ అని చెప్పే ముఖ్యమంత్రి.. అవి ఏ మాత్రం అమలు చేయని అధికారులు.. సిబ్బంది కొరతతో పనిభారం, సెలవులు సరెండర్ ఇవ్వకపోవడం.. చివరికి హెచ్ఆర్ఏ కూడా తగ్గించి ఇంత ద్రోహం చేస్తారా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రింబవళ్లు ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణగా నిలుస్తూ.. కోవిడ్‌లో సయితం కుటుంబాలను వదిలి రోడ్లపై విధులు నిర్వహించిన తమకు ఇంత అన్యాయం చేస్తారని అనుకోలేదంటూ పోలీసులు వాపోతున్నారు. విజయవాడ, విశాఖ, తిరుపతి లాంటి చోట్ల సిటీ అలవెన్సులు రద్దు చేసి హెచ్ఆర్ఏను 20 శాతం నుంచి 8 శాతానికి తగ్గించడం చాలా బాధేస్తోందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి డిఏ కూడా 2 నుంచి 3 శాతం తగ్గించారని.. పోలీసులకు తగ్గబోదని ఇన్నాళ్లు ప్రచారం చేయడం ఎందుకని నిలదీస్తున్నారు. ఎన్జీవోలు, ఇతర ఉద్యోగుల్లా తాము ఆందోళనలు చేయలేమని, కానీ వాళ్లు చేస్తున్న ఉద్యమంలో న్యాయం ఉందని పోలీసులు అంటున్నారు.

Updated Date - 2022-02-02T16:19:05+05:30 IST