ప్రాధాన్యతాక్రమంలో ప్రాజెక్టులు

ABN , First Publish Date - 2020-09-17T09:40:28+05:30 IST

‘‘రాష్ట్రంలో ఇప్పటికే చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలి. జల వనరుల అభివృద్ధి

ప్రాధాన్యతాక్రమంలో ప్రాజెక్టులు

1510 కోట్ల ఆదాయం కోసం కార్యాచరణ

ముంపు బాధితులకు పరిహారం పెంపు

వరద నీటిని ఒడిసిపట్టేలా చర్యలు తీసుకోండి

లస్కర్‌లను ఔట్‌సోర్సింగ్‌లో నియమించుకోండి

జలవనరుల సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశాలు


అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో ఇప్పటికే చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలి. జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు శాఖను ఆర్థికంగా పరిపుష్ఠి చేయడానికి నీటి, పారిశ్రామిక సెస్సు, సౌర విద్యుత్తు ద్వారా వ్యయ నియంత్రణ, చేపల పెంపకం వంటివాటిని చేపట్టాలి. రూ.1510 కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకునేలా కార్యాచరణను అమలు చేయాలి’’ అని జల వనరుల శాఖ అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆ శాఖపై సీఎం సమీక్షించారు. నెల్లూరు, సంగం బ్యారేజీ, అవుకు టన్నెల్‌-2, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు స్టేజ్‌-2 పనుల్లో జాప్యం లేకుండా కొనసాగించాలని నిర్దేశించారు. తారకరామ తీర్థసాగర్‌, తోటపల్లి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచాలని ఆదేశించారు. భారీ వర్షాలతో పోటెత్తుతున్న వరద నీటిని ఒడిసి పట్టాలని సూచించారు. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరులో 10 టీఎంసీలు, గండికోటలో 23 టీఎంసీలు నింపాలని, ఇందుకోసం వెంటనే సహాయ పునరావాస ప్యాకేజీని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

ఏప్రిల్‌కు పోలవరంలో 48 గేట్లు

వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పోలవరం హెడ్‌వర్క్స్‌ పనులు పూర్తిచేయాలన్న లక్ష్యంలో ఎలాంటి మార్పూ లేదని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు గేట్లు ఫ్యాబ్రికేషన్‌ ఇప్పటికే పూర్తయిందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలాఖరు నాటికి 48 గేట్లను బిగించేస్తామన్నారు. ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న నెల్లూరు, సంగం బ్యారేజీ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. అవుకు టన్నెల్‌-2 పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతాయన్నారు. ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటర్‌ పనులకు సంబంధించి.. మొదటి సొరంగం పూర్తయిందని, రెండో సొరంగం పనులు వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తవుతాయన్నారు. 

జగన్‌తో నటుడు అలీ భేటీ

సీఎం జగన్‌తో సినీనటుడు అలీ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎంని కలసి పూలమొక్కను అందజేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు బాగా అమలవుతున్నాయని ప్రశంసించారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ ఉత్తమ సీఎంగా పేరు సంపాయించుకుంటున్నారన్నారు. తమ నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. 

Updated Date - 2020-09-17T09:40:28+05:30 IST