కరోనా ఉధృతం.. తిరుపతి సభ వద్దు

ABN , First Publish Date - 2021-04-11T08:47:01+05:30 IST

‘‘రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మరీ ఎక్కువగా ఉంది. కరోనాతో 24 గంటల్లో మరణించిన 11

కరోనా ఉధృతం.. తిరుపతి సభ వద్దు

అన్నగా, తమ్ముడిగా అందరి క్షేమాన్ని

ఆశించి పర్యటన మానేస్తున్నా

మీ దీవెనలను ఓటు రూపంలో ఇవ్వండి

ఓటర్లకు సీఎం జగన్‌ బహిరంగ లేఖ


అమరావతి, ఏప్రిల్‌ 10(ఆంధ్ర‌జ్యోతి): ‘‘రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మరీ ఎక్కువగా ఉంది. కరోనాతో 24 గంటల్లో మరణించిన 11 మందిలో నలుగురు చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాసులే. నేను బహిరంగ సభ పెడితే... నామీద అభిమానంతో వేలాది మంది తరలివస్తారు. వారందరి ఆరోగ్యమూ నాకు ముఖ్యమే. అందుకే బాధ్యతగల అన్నగా, తమ్ముడిగా తిరుపతి సభను రద్దు చేసుకుంటున్నా’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తరఫున ప్రచారానికి ఈ నెల 14న సీఎం జగన్మోహన్‌రెడ్డి తిరుపతి వెళ్లాల్సి ఉంది.


ఆ పర్యటనను ఆయన కరోనా ఉధృతి నేపథ్యంలో రద్దు చేసుకుంటూ తిరుపతి ఓటర్లకు శనివారం బహిరంగ లేఖ రాశారు. తాను వ్యక్తిగతంగా వచ్చి బహిరంగ సభలో పాల్గొని, ప్రచారం చేసి, ఓటు అడగకపోయినా... ప్రజలందరి ప్రభుత్వం ఎవరెవరి కోసం ఏమేమి చేస్తోందో అందరికీ తెలుసునని వివరించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులందరికీ ఇప్పటికే పంపిన వ్యక్తిగత లేఖలు అంది ఉంటాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘మంచి చేస్తున్న అందరి ప్రభుత్వానికి నిండు మనసుతో, గుండెనిండా ప్రేమతో, రెట్టింపయిన నమ్మకంతో ఓటు రూపంలో దీవెనలు ఇస్తారని ఆశిస్తున్నా. సోదరుడు గురుమూర్తిని గతంలో బల్లి దుర్గాప్రసాదరావుకు ఇచ్చిన 2,80,000 కంటే అధిక మెజారిటీతో ఫ్యాను గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని కోరుతున్నా. దేవుడి ఆశీస్సులు ప్రజలందరికీ, ప్రభుత్వానికీ ఉండాలని ఆకాంక్షిస్తున్నా’’ అని సీఎం తన లేఖలో పేర్కొన్నారు. 


ప్రమాణం చేయాల్సి వస్తుందనే రద్దు: అయ్యన్న

అమరావతి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): బాబాయి హత్యపై ప్రమాణం చేయాల్సి వస్తుందనే ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి తిరుపతి పర్యటన రద్దు చేసుకొన్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ముఖ్యమంత్రి పర్యటన రద్దుపై శనివారం ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘‘14న తిరుపతి వచ్చి ఉంటే బాబాయి హత్య మిస్టరీ తేలిపోయేది. అందుకే జగన్‌ రెడ్డి గారు తన పర్యటన రద్దు చేసుకొన్నారు. వెంకన్న సాక్షిగా ప్రమాణం అనగానే పరార్‌ అయ్యారు’’ అని అయ్యన్న అన్నారు. 

Updated Date - 2021-04-11T08:47:01+05:30 IST