చెబితే.. వినరా!

ABN , First Publish Date - 2020-05-31T08:43:57+05:30 IST

లెక్కకు మిక్కిలి సలహాదారులు! వారికి... లక్షల కొద్దీ చెల్లింపులు! అయినా... ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై హైకోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు! మరి... వారు ఏవైనా సరైన సలహాలు ఇస్తున్నారా? ఇస్తున్నా...

చెబితే.. వినరా!

  • సలహాదారులేం చేస్తున్నారు?
  • న్యాయ కోవిదుల సూచనలేమిటి?
  • చెప్పినా సీఎం వినడం లేదా!
  • తెలిసీ వివాదాస్పద నిర్ణయాలు
  • కోర్టులో 60కిపైగా ఎదురుదెబ్బలు
  • మొన్న డీజీపీ, నేడు సీఎస్‌ కోర్టుకు
  • తలవంపులుగా మారిన పరిస్థితి
  • వైసీపీ సీనియర్లలో అంతర్మథనం


(అమరావతి - ఆంధ్రజ్యోతి): లెక్కకు మిక్కిలి సలహాదారులు! వారికి... లక్షల కొద్దీ చెల్లింపులు! అయినా... ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై హైకోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు! మరి... వారు ఏవైనా సరైన సలహాలు ఇస్తున్నారా? ఇస్తున్నా... ముఖ్యమంత్రి జగన్‌ వినిపించుకోవడంలేదా? ఇవీ... స్వయంగా పాలకపక్షంలోనే తలెత్తుతున్న ప్రశ్నలు! ‘చెల్లవు’ అని తెలిసీ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నందుకే ఈ పరిస్థితి ఎదురవుతోందని పలువురు వాపోతున్నారు. వైసీపీ తొలి అధికార వార్షికోత్సవ వేడుకల వేళలో తగులుతున్న ఈ ఎదురు దెబ్బలు ఒక కుదుపులాంటివని చెబుతున్నారు. విధాన నిర్ణయాలపై... న్యాయ నిపుణులు సలహాలు, సూచనలు, దిశానిర్దేశం చేయడంలో తప్పుందా? లేక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డే వినకుండా మొండిగా వెళ్తున్నారా అనేది వారికి అంతుపట్టడం లేదు. ఆయన నుంచి పదవులు తీసుకున్నవారు ఎందుకు సహేతుకమైన సలహాలు ఇవ్వడం లేదన్న ప్రశ్నలూ కొందరు పార్టీ నేతల నుంచి వస్తున్నాయి.


ముందే ఊహించారు!: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తొలగించేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌, సంబంధిత జీవోలు న్యాయసమీక్షకు నిలబడవని ముందుగానే ఊహించారు. ఈ ఆర్డినెన్స్‌ను కోర్టు కొట్టివేయడం తథ్యమని వైసీపీకి చెందిన ఒక ఎంపీ ముందస్తుగా చెప్పేశారు. అందుకు కారణాలనూ ఆయన విశ్లేషించారు. ఆర్డినెన్స్‌లో ఎన్నికల కమిషనర్‌ వయసును ప్రస్తావించలేదని తెలిపారు. ఇక... పదవీకాలంలో చేసే మార్పుచేర్పులేవైనా, తర్వాత వచ్చే వారికి మాత్రమే వర్తిస్తాయి. అప్పటికే పదవిలో ఉన్న వారికి వర్తించవు. గ్రామ సచివాలయాలకు రంగుల విషయంలోనూ అదే జరిగింది. అచ్చంగా పార్టీ రంగులు పులమడం కుదరదని, ఎవరు కోర్టుకు వెళ్లినా చుక్కెదురు కావడం తథ్యమని ముందే ఊహించారు. అయి నా... పట్టించుకోకపోగా, మొండిగా ముందుకెళ్లారు. దీంతో ఏకంగా సీఎస్‌ కోర్టు ముందు హాజరు కావాల్సి వచ్చింది. ‘‘సహజంగా విధాన నిర్ణయాలు తీసుకునే సమయలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చిస్తారు. న్యాయశాఖ సలహాలు తీసుకుంటారు. కానీ, మా పాలనలో అలాంటివేమీ కనిపించడం లేదు’’ అని సదరు ఎంపీ అన్నారు.


నామోషీగా లేదా?: ఇప్పటికి 64 సార్లు కోర్టు మొట్టికాయలు వేయడం అలా ఉంచితే.. స్వ యంగా రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు హై కోర్టు ముందు తలవంచుకుని నిలబడాల్సిన పరిస్థితి రావడం బాధాకరమేనని వైసీపీ నేతలు అంటున్నారు. ‘అధికారులను కోర్టు పిలిచిందంటేనే చా లా అవమానంగా భావించేవారు. అలాంటింది ఇప్పుడు కోర్టు ధిక్కరణ కిం ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వరుసగా రెండు రోజులు సహచర అధికారులతో కలసి హాజరు కావాల్సి వచ్చింది’’ అని అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా పోలీసుల తీరు.. పెట్టిన కేసులపై హైకోర్టు ఏకంగా డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను బోనులో నిలబెట్టిన తీరు.. వేసిన ప్రశ్న లు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని అంటున్నారు.

Updated Date - 2020-05-31T08:43:57+05:30 IST