రైతులకు కొత్త విద్యుత్‌ వెతలు

ABN , First Publish Date - 2020-11-20T06:59:57+05:30 IST

డిస్కమ్ ల ప్రైవేటీకరణ జరిగి స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే-- రైతు తాను వాడనున్న విద్యుత్తు మొత్తానికి నెలకు ముందుగానే బిల్లు చెల్లించవలసి ఉంటుంది. ఒక్కరోజు ఆలస్యమైనా డిస్కవ్‌ు వద్దనే రైతు కనెక్షన్‌కు సరఫరా నిలిపివేస్తారు. కీలక సమయంలో....

రైతులకు కొత్త విద్యుత్‌ వెతలు

డిస్కమ్ ల ప్రైవేటీకరణ జరిగి స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే-- రైతు తాను వాడనున్న విద్యుత్తు మొత్తానికి నెలకు ముందుగానే బిల్లు చెల్లించవలసి ఉంటుంది. ఒక్కరోజు ఆలస్యమైనా డిస్కవ్‌ు వద్దనే రైతు కనెక్షన్‌కు సరఫరా నిలిపివేస్తారు. కీలక సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే రైతు పంట దెబ్బతింటుంది. ముఖ్యంగా రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న కౌలుదార్లకు దీనివల్ల తీవ్రనష్టం వాటిల్లుతుంది. 


కొద్దినెలల క్రితం కేంద్రప్రభుత్వం విద్యుత్‌ బిల్లు-–2020ను ప్రతిపాదించింది. విద్యుత్‌రంగంలో సంస్కరణలు చేపట్టడానికి, డిస్కంలను ప్రైవేటీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తే ఎఫ్‌ఆర్‌బిఎవ్‌ు పరిమితి పైన 0.5శాతం అదనంగా బ్యాంకుల నుంచి రాష్ట్రప్రభుత్వం రుణం తీసుకునేందుకు అనుమతిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. తెలంగాణాతో సహా పలు రాష్ట్రప్రభుత్వాలు కేంద్రం సూచించిన డిస్కవ్‌ుల ప్రైవేటీకరణ, నగదు బదిలీ మున్నగు సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకించడమేకాక శాసనసభలలో ఆ మేరకు తీర్మానాలను కూడా చేశాయి. ఇంతవరకు విద్యుత్‌ బిల్లు-–2020ను పార్లమెంట్‌లో చర్చించడం గాని, ఆమోదించడం గాని జరగలేదు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని 17.75 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకుని జి.ఓ.నెం.22ను జారీ చేయడమే కాక రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాతో ప్రారంభించి అన్ని జిల్లాలలోను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు ప్రయత్నించడం ఆశ్చర్యకరం. 4 దశాబ్దాలకు పూర్వం వ్యవసాయ విద్యుత్‌ మీటర్లతో రైతులు పడిన కష్టాలకు పరిష్కార మార్గంగా ఎన్‌టి రామారావు ప్రభుత్వం శ్లాబ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వైఎస్‌ రాజశేఖర రెడ్డి సర్కార్‌ ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేయడం వల్ల రైతుల కష్టాలు తొలగి వారికి ఎనలేని మేలు చేకూరింది. 


రైతులు తమ స్వంతఖర్చుతో బోరు వేసుకుని, మోటరు బిగించి డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు కూడా పైకం చెల్లించి భూగర్భ జలాలను వినియోగించుకుంటుంటే, వారికి మరింత తోడ్పాటు అందించ వలసిందిపోయి, ఉచిత విద్యుత్‌కు మంగళం పాడే కేంద్రప్రభుత్వ నిర్ణయానికి తలొగ్గి, రాష్ట్రప్రభుత్వం వ్యవహరించడం రైతులకు తీరని ద్రోహం చేయడమే అవుతుంది. రైతులపై ఒక్క పైసా భారం పడదని నమ్మబలుకుతున్న రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ విద్యుత్‌కు చెల్లించాల్సిన సబ్సిడీ మొత్తాన్ని నేరుగా డిస్కంలకు అందచేస్తే సరిపోతుంది. మీటర్లు పెట్టడం వల్ల వ్యవసాయానికి ఎంత విద్యుత్‌ వినియోగమవుతుందో తెలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలు శుద్ధ బూటకం. 


డిస్కంల ప్రైవేటీకరణ జరిగి స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే రైతు వాడనున్న విద్యుత్తు మొత్తానికి నెలకు ముందుగానే, ప్రీపెయిడ్‌ సెల్‌ఫోన్ల వలెనే, చెల్లించవలసి ఉంటుంది. ఒక్కరోజు ఆలస్యమైనా డిస్కవ్‌ు వద్దనే రైతు కనెక్షన్‌కు సరఫరా నిలిపివేస్తారు. కీలక సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే రైతు పంట దెబ్బతింటుంది. ముఖ్యంగా రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న కౌలుదార్లకు దీనివల్ల తీవ్రనష్టం వాటిల్లుతుంది. 


గౌతం అదానీ, టాటా పవర్‌, ముఖేష్‌ అంబానీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి బడా కార్పొరేట్‌ సంస్థలకు లాభాలను కట్టబెట్టేందుకే మోడీ ప్రభుత్వం విద్యుత్‌ బిల్లు– 2020ని తీసుకువచ్చింది. ఇప్పటికే కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో డిస్కంలను ప్రైవేటీకరిస్తున్నారు. గతంలో ఒడిసాలోను, మరికొన్ని నగరాలలోను డిస్కంలను ప్రైవేటీకరించినా ఫలితాలు సంతృప్తికరంగా లేకపోవడంతో ఫ్రాంఛైజీలను తొలగించారు. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం మొండితనంగా వ్యవహరిస్తోంది.


డిస్కంలను ప్రైవేటీకరించడంలో భాగంగా కేంద్రప్రభుత్్వం ‘స్టాండర్డ్‌ బిడ్డింగ్‌ డాక్యుమెంట్‌’ను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రైవేట్‌ సంస్థకు డిస్కంను దాని ప్రస్తుత ‘నికర ఆస్తుల విలువ’కు కట్టబెట్టవలసి ఉంటుంది. డిస్కంలకు చెందిన భూములకు విలువ కట్టవలసిన పని లేకుండా, నామమాత్రపు అద్దెతో వినియోగించుకొనే అధికారం ప్రైవేట్‌ సంస్థకు ఉంటుంది. డిస్కంపై ఉండే రుణభారంతో గానీ లేక ఇతర బాధ్యతలతో గానీ ప్రైవేటు సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదు. డిస్కంకు సంబంధించిన లక్షల కోట్ల విలువ గల ఆస్తులను ప్రస్తుత నికర విలువ పేరుతో కారుచౌకగా ప్రైవేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయడం దుర్మార్గం. విద్యుత్‌ చట్టం–2003, సెక్షన్‌ 13(2) ప్రకారం విద్యుత్‌ సంస్థల ఆస్తులను బదలాయించే సందర్భంలో సదరు ఆస్తుల వల్ల చేకూరే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. దానికి భిన్నంగా కేంద్రం వ్యవహరించడం తగదు. రాష్ట్రప్రభుత్వం, రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్‌లతో నిమిత్తం లేకుండా, కేంద్ర రెగ్యులేటరీ కమిషన్‌ దాదాపు అన్ని కీలక నిర్ణయాలు తీసుకొనే అధికారం కలిగి ఉండటం ఫెడరల్‌ స్పూÛర్తికి విఘాతమే.


‘స్టాండర్డ్‌ బిడ్డింగ్‌ డాక్యుమెంట్‌’ ప్రకారం డిస్కంలలో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు ప్రైవేటు సంస్థలో విధులు నిర్వర్తించవలసి ఉంటుంది. లోగడ ఎన్‌టిపిసిని ప్రైవేటీకరించిన తర్వాత అందులోని ఉద్యోగులను భారత్‌ అల్యూమినియం కంపెనీకి (బాల్కో) బదిలీ చేశారు. అయితే, ఉద్యోగుల ఆమోదం లేకుండా ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు వారిని మార్చడం కుదరదని, వారి సర్వీస్‌ కండిషన్స్‌ను ప్రభుత్వం గానీ, మరొక సంస్థగానీ మార్చడానికి వీలులేదని కోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది. 


స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సు చేసిన విధంగా సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని సరైన ధరలు ఎలాగూ కల్పించడం లేదు. రైతులకు కనీస మద్దతు ధరలు తప్పనిసరిగా అందేట్లు చట్టబద్ధత కూడా కల్పించడం లేదు. కానీ, విద్యుత్‌ సంస్థలకు మాత్రం కచ్చితంగా వాటికి దక్కాల్సిన మొత్తాన్ని అందేలా చూడడానికి ‘ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అథారిటీ’ని ఏర్పాటు చేయడం మోదీ ప్రభుత్వానికి కార్పోరేట్ల పట్ల ఉన్న ప్రేమ ఏమిటో, రైతుల పట్ల ఉన్న నిర్లక్ష్యం ఎంతో తెలియపరుస్తోంది. ఇంతేకాక, దేశంవ్యాప్తంగా వ్యవసాయదారులతో సహా మొత్తం అన్ని వర్గాల ప్రజలకు ఉన్న 25 కోట్ల విద్యుత్‌ కనెక్షన్‌లకు ఇప్పుడున్న మీటర్ల స్థానంలో ఒక్కొక్కటి రూ.8,000 విలువ చేసే ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను బిగించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రూ.1.5లక్షల కోట్ల పైనే ఖర్చువుతుంది. మోదీకి సన్నిహితుడైన ముఖేష్‌ అంబానీ సంస్థ ఈ ప్రీ-పెయిడ్‌ మీటర్ల ఉత్పత్తికి సంసిద్ధమవుతోంది. అంటే, ప్రభుత్వం చేపట్టబోయే కొత్త మీటర్ల కార్యక్రమం వల్ల సింహభాగం ప్రయోజనం ఆ సంస్థకే దక్కబోతోంది.


సోలార్‌ విద్యుత్తును, జల విద్యుత్తును తప్పనిసరిగా కొనుగోలు చేయాలనే నిబంధన ‘విద్యుత్‌ బిల్లు–-2020’లో ఉండడం వల్ల గౌతం అదాని, టాటా వంటి బడా కార్పొరేట్‌ సంస్థలకు లబ్ధి చేకూరుతుంది. భవిష్యత్‌ అవసరాలకు మించి సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కోసం కేంద్రం టెండర్లు పిలవగా అందులో అత్యధిక భాగాన్ని గౌతం అదానీ సంస్థ దక్కించుకుంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేసే సంస్థగా అది నిలవబోతోంది. 


కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి 10వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ స్థాపనకు చర్యలు చేపట్టనున్నట్లు జగన్‌ ప్రభుత్వం ప్రకటించడం ఎంతమాత్రం సరైనది కాదు. ఇప్పటికే రాష్ట్ర అవసరాలకు మించి విద్యుదుత్పాదన స్థాపిత శక్తి ఉంది. కొన్ని విద్యుత్‌ సంస్థలలో ప్రభుత్వం పాక్షికంగా ఉత్పత్తిని ఆపేస్తోంది. అలాంటి పరిస్థితులలో మున్ముందు సోలార్‌ విద్యుత్‌ ధరలు మరింత తగ్గే అవకాశాలున్నాయి. అయినా ప్రస్తుత ధరల ప్రకారం 30సంవత్సరాలకు ఒకే పర్యాయం ఒప్పందం చేసుకోవడం ప్రభుత్వానికి భారంగా పరిణమించడమే కాక, వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందువల్లనే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగులు డిస్కంల ప్రైవేటీకరణకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రైతులు, విద్యుత్‌ ఉద్యోగులు పెద్దఎత్తున వ్యతిరేకించడంతో యోగీ ఆదిత్యనాధ్‌ సర్కార్‌ ఈ విషయంలో వెనుకడుగు వేయవలసి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఈ అంశాలన్నింటినీ సాకల్యంగా పరిశీలించి, రైతు సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వినియోగదారుల సంఘాలతో చర్చించి జీవో22, జీవో 68లను వెంటనే ఉపసంహరించి, డిస్కంల ప్రైవేటీకరణకు స్వస్తి చెప్పాలి.


వడ్డే శోభనాద్రీశ్వరరావు

Updated Date - 2020-11-20T06:59:57+05:30 IST