చదువే ముఖ్యం

ABN , First Publish Date - 2022-08-12T05:55:30+05:30 IST

‘పేదల బతుకులు మారాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. ఇందుకు చదువు ఒక్కటే మార్గం. విద్య ఎవరూ దొంగలించలేని ఆస్తి. విద్యార్థులు భవిష్యత్‌లో సులభంగా ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం..’

చదువే ముఖ్యం
సభలో ప్రసంగిస్తున్న సీఎం జగన్‌

విద్యతోనే బతుకులు మారతాయి 

తల్లుల ఖాతాల్లో విద్యాదీవెన నిధుల జమ  

బాపట్లలో పలు పనులకు సీఎం జగన్‌ ఆమోదం 

సభకు హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు

బాపట్ల, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ‘పేదల బతుకులు మారాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. ఇందుకు చదువు ఒక్కటే మార్గం. విద్య ఎవరూ దొంగలించలేని ఆస్తి. విద్యార్థులు భవిష్యత్‌లో సులభంగా ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం..’ అని బాపట్ల ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో గురువారం జరిగిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తెలిపారు. ఏప్రిల్‌, మే, జూన్‌కు సంబంధించి జగనన్న విద్యాదీవెన నిధులను విడుదల చేశారు. 33,356 మంది విద్యార్థులకు సంబంధించి 29,750 మంది తల్లుల ఖాతాల్లో రూ.23 కోట్ల నగదును బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో సీఎం జగన్‌ జమ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో ఆ ఫలాలను విద్యార్థులు అనుభవిస్తారన్నారు.  ప్రతి ఇంటి నుంచి కలెక్టర్‌, ఇంజనీర్‌, డాక్టర్లు రావాలనేది తన ఆకాంక్ష అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవడానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. బాపట్లలోని కళాశాలలకు కూడా గత ప్రభుత్వంలోని బకాయిలు రూ.14 కోట్లు చెల్లించామన్నారు. రాఖీ పండుగ సందర్భంగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేయడం సంతోషంగా ఉందన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ఓ విద్యార్థి తల్లితో సీఎం రాఖీ కట్టించుకున్నారు. అనంతరం పలువురు జగన్‌కు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 

పేదల ఇబ్బందులు తెలుసు : మంత్రి మేరుగ

 పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలుసని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.  విద్యారంగంలో ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పథకాలతో వారి జీవితాలే మారిపోతున్నాయన్నారు. ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్ల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.  కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్‌, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పోతుల సునీత, లేళ్ల అప్పిరెడ్డి, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జడ్పీ చైర్‌ పర్సన్లు క్రిస్టియానా, బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, కరణం బలరాం కృష్ణమూర్తి, ఉండవల్లి శ్రీదేవి, కిలారి రోశయ్య, చీరాల ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌, సీఎం ప్రోగాం కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, గాదె వెంకటరెడ్డి, జేసీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నార

బాపట్లకు వరాలు

బాపట్లలోని వివిధ సమస్యలను కోన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సమావేశం ముగింపులో సీఎం పలు పనులకు ఆమోదం తెలిపారు.

- బాపట్ల కలెక్టరేట్‌ను 50 ఎకరాల్లో నిర్మించడానికి ఆమోదం.

బాపట్లలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా అదనపు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి రూ.18 కోట్లు నిధులు మంజూరు.

- మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.10 కోట్ల మంజూరు. 

- పేరలి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మాణానికి ఆమోదం.


ఇలా వచ్చారు.. వెళ్లారు

ఉదయం 10:18కి పరేడ్‌ గ్రౌండ్‌లోని  హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. 10:38కి సభాప్రాంగణానికి చేరుకుని విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించారు. 11:35 గంటలకు ప్రసంగం మొదలుపెట్టి అరగంటలో ముగించారు. అనంతరం మధ్యాహ్నం 12:59కి తిరిగి తాడేపల్లికి పయనమయ్యారు.

ఆకట్టుకున్న విద్యార్థిని ప్రసంగం..

బీఏ చదువుతున్న  విద్యార్థిని నవిత ప్రియ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. విద్యారంగంలో ఆర్ట్స్‌ కోర్సులు కూడా ప్రొపెషనల్‌ కోర్సులకు తక్కువకాదని చెప్పడంతో పాటు విద్యారంగంలో వస్తున్న మార్పులనువివరించిన తీరు అందరికీ నచ్చింది.




Updated Date - 2022-08-12T05:55:30+05:30 IST